నకిలీ ఎన్‌ఓసీతో అనుమతి పొందిన కోడుమూరులోని ఠాగూర్ విద్యా శిక్షణ కళాశాల
కర్నూలు(రాజ్‌విహార్): ‘బోధనా’ విలువలు నేర్పించే కళాశాలలే దారి తప్పాయి. ప్రభుత్వ శాఖలను బురిడీ కొట్టించాయి. అనుమతుల కోసం నకిలీ ధ్రువపత్రాలు సమర్పించాయి. అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన భద్రతా చర్యలు లేకుండానే అడ్డదారుల్లో అనుమతులు పొందాయి. నకిలీ ఎన్‌ఓసీలతో ఏకంగా రాయలసీమ యూనివర్సిటీనే బురిడీ కొట్టించాయి. మామూళ్ల మత్తులో జోగిన వర్సిటీ అధికారులు వాటిని పరిశీలించకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. జిల్లా వ్యాప్తంగా 96 బీఈడీ, డీఈడీ బోధనా కళాశాలలు ఉండగా.. వాటిలో 11 మాత్రమే అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) పొంది ఉన్నాయి. మిగిలిన 85 కాలేజీలకు ఎన్‌ఓసీలు లేవు.
ఎన్‌ఓసీలు ఎందుకు?
కళాశాలల్లో చదివే విద్యార్థులు, అధ్యాపకుల భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు ఆర్పడానికి తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేయాలి. ఇందుకోసం అగ్ని మాపక శాఖ అధికారుల తనిఖీ అనంతరం పొందే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను వర్సిటీకి సమర్పించాల్సి ఉంటుంది. 500 చదరపు మీటర్ల విస్తీర్ణం లేదా ఆరు మీటర్ల ఎత్తయిన కళాశాల భవనం ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా అగ్ని మాపక శాఖ సూచించిన మేర భద్రతా చర్యలు చేపట్టాలి. ఫైర్ ఎస్టింగర్లతో పాటు హోజ్‌రీల్ పైపు, ఫైర్ పంప్, భవనం పైన వాటర్ ట్యాంకు ఏర్పాటు చేయాలి. 2007 సంవత్సరానికి ముందునిర్మించిన భవనమైతే ఆఫ్‌లైన్‌లో, ఆ తరువాత నిర్మించి ఉంటే ఆన్‌లైన్‌లో ఎన్‌ఓసీ కోసం అగ్నిమాపక శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత సంబంధిత స్టేషన్ ఫైర్ ఆఫీసర్, జిల్లా ఫైర్ ఆఫీసర్ పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉంటే ఎన్‌ఓసీ జారీ చేస్తారు.
నకిలీ ఎన్‌ఓసీలతో అనుమతులు
జిల్లాలో 96 బీఈడీ, డీఈడీ కళాశాలలు ఉండగా.. అందులో 11 మాత్రమే అసలు సర్టిఫికెట్లు పొంది ఉన్నాయి. మిగిలిన వాటికి ఎన్‌ఓసీలు లేవు. ఇందులో కొన్ని కళాశాలలు చలానా చెల్లించిన రసీదుతో అనుమతులు పొందగా.. మరికొన్ని నకిలీ ఎన్‌ఓసీలను జత చేసి అనుమతి సంపాదించాయి. వాస్తవానికి బోధనా కళాశాలల్లో రకరకాల చార్జీలు, ఫీజుల పేరుతో విద్యార్థుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ నిబంధనల మేరకు భద్రతా చర్యలు చేపట్టడం లేదు. కళాశాలలకు అనుమతులిచ్చే వర్సిటీ అధికారులు కూడా వచ్చిన ధ్రువపత్రాలు అసలువా.. నకిలీవా? అని చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
వెలుగులోకి వచ్చిందిలా..
ఇటీవలే కొన్ని కళాశాలల ఎన్‌ఓసీలపై అనుమానం వచ్చిన అగ్నిమాపక శాఖ డీజీ.. ఆ సర్టిఫికెట్ల నిర్ధారణకు జిల్లా ఫైర్ ఆఫీసర్‌ను ఆదేశించారు. అవి నకిలీవని తేలడంతో జిల్లాలోని అన్ని కళాశాలల సర్టిఫికెట్లు పరిశీలించి వాస్తవికతతో కూడిన నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో 96 కళాశాలలల్లో కేవలం 11 ఎన్‌ఓసీలు మాత్రమే అసలువని తేలింది.
నకిలీ ఎన్‌ఓసీలు, అసలు ఎన్‌ఓసీలే లేకుండా అనుమతి పొందిన కళాశాలల వివరాలు
అక్షరశ్రీ (ఆదోని), అల్ మదీనా (మునగాలపాడు), అంకాలరెడ్డి (ఆళ్లగడ్డ), భారతి (నంద్యాల), బీవీఆర్ (గడివేముల), డాక్టర్ రామలింగారెడ్డి (ఆళ్లగడ్డ), డాక్టర్ కె.వి.సుబ్బారెడ్డి (లక్ష్మీపురం), జి.ఎం కాలేజ్ (నంద్యాల), గీతాంజలి (బి.క్యాంప్, కర్నూలు), జీఎంఆర్ (కవులూరు), జ్ఞానసరస్వతి (బనగానపల్లె), ఇక్బాల్ కాలేజ్ (నాయకల్లు), జేవీఆర్‌ఆర్ (నంద్యాల), కె.ఇక్బాల్ కాలేజ్ (రుద్రవరం), కేఎండీ ఇక్బాల్ కాలేజ్ (పెద్దపాడు), లిటిల్ ఫ్లవర్ (అయ్యలూరు), మదీనా (బ్రాహ్మణకొట్కూరు), మొహమ్మద్ పాషా కాలేజ్ (బి.క్యాంప్, కర్నూలు), నాయక్ కాలేజీ (దూపాడు), నలంద (ఎమ్మిగనూరు), నేషనల్ కాలేజ్ (ఉలిందకొండ), ప్రభాత్ (పార్నపల్లి), ప్రవీణ్ భాను (ఆళ్లగడ్డ), రాఘవరామ్ (ఆళ్లగడ్డ), రోజా (కోవెలకుంట్ల), సాయిప్రతిభ (కర్నూలు), సాయిశ్రీ (డోన్), సాయినాథ్ రామ్ (కరివేన), ఎస్‌ఏఎస్ (బ్రాహ్మణకొట్కూరు), శాంతినికేతన్ (లక్ష్మీపురం), శారద (నన్నూరు), సిద్ధార్థ, ఎస్పీజీ (నంద్యాల), ఎస్‌ఆర్సీ (కర్నూలు), శ్రీలక్ష్మీ (బనగానపల్లె), శ్రీలక్ష్మీనరసింహ (కొలిమిగుండ్ల), శ్రీగాయత్రి (ధర్మవరం), శ్రీలక్ష్మి వెంకటేశ్వర (మామిదాలపాడు), శ్రీరాఘవేంద్ర (నన్నూరు), శ్రీరాఘవేంద్ర (ఎమ్మిగనూరు), శ్రీరాఘవేంద్ర (ఆళ్లగడ్డ), శ్రీరామచంద్ర (పాములపాడు), శ్రీసాయిప్రతిభ (పత్తికొండ), శ్రీ వెంకటేశ్వర (ఆత్మకూరు), సెయింట్ పీటర్స్ (జూటూరు), సుమౌర్య (బి.తాండ్రపాడు), ఠాగూర్ కాలేజీ (కోడుమూరు), తారకరామ (చాపిరేవుల), వరప్రసాద్ రావు కాలేజీ (పంచలింగాల), విజయానికేతన్ (పాణ్యం), విశ్వవాణి (కర్నూలు), జోహార్స్ (ఉడుములపాడు), జుబేదా కాలేజీ (నంద్యాల), కృషి విద్యానికేతన్ (ఆళ్లగడ్డ), జీఎస్‌ఆర్ (చింతకుంట), మదీనా (కోవెలకుంట్ల), విశ్వశాంతి (ఆళ్లగడ్డ), శ్రీవెంకటేశ్వర విద్యా మందిర్ (నంద్యాల), ఎంఎన్‌ఆర్ (తిమ్మాపురం), ఎన్‌ఎంఆర్ (కర్నూలు), సర్వేశ్వర (పసుపల), బృందావన్ (ఆళ్లగడ్డ), కె.నాగిరెడ్డి (దూపాడు), వెంకటేశ్వర్ (నంద్యాల), నాగ సత్యనారాయణ (బొల్లవరం), శ్రీసాయి వెంకటేశ్వర (గూడూరు), కేఎస్‌ఆర్ (కర్నూలు), శ్రీవైష్ణవి (పత్తికొండ), శ్రీసుధ (డోన్), అనసూయ (తుగ్గలి), సెయింట పీటర్ (ఆదోని), శ్రీవెంకటేశ్వర (ప్యాపిలి), శ్రీలక్ష్మీ శ్రీనివాస (బి.తాండ్రపాడు), శ్రీభారతి (నంద్యాల), నవభారత్ కాలేజ్ (బి.క్యాంప్, కర్నూలు), సుమౌర్య (హొళగుంద), శ్రీశివసాయికృష్ణ కాలేజీ (నందికొట్కూరు).
85 కళాశాలలకు ఎన్‌ఓసీలు లేవు
జిల్లాలో 96 బీఈడీ, డీఈడీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో కేవలం 11 మాత్రమే నిబంధనల ప్రకారం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు పొందాయి. మిగిలిన కళాశాలలు పెట్టిన ఎన్‌ఓసీలు నకిలీవని తేలింది. కొన్ని కాలేజీలు కేవలం చలానా తీసిన రసీదుతో అనుమతులు పొందాయి. – వి.శ్రీనివాసరెడ్డి, జిల్లా ఫైర్ ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment