Fake colleges
-
Scholarship Scam: మైనారిటీ స్కాలర్షిప్.. భారీ కుంభకోణం
న్యూఢిల్లీ: మైనారిటీల్లోని పేద కుటుంబాల పిల్లలకు అందాల్సిన ఉపకార వేతనాలు భారీగా పక్కదారి పట్టాయి. అనర్హులు వాటిని కాజేశారు. ఏళ్లుగా అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ దందాకు వివిధ స్థాయిల్లో నోడల్ అధికారులు కొమ్ముకాశారు. స్కాలర్షిప్ పథకానికి ఆమోదం పొందిన విద్యా సంస్థల్లో 53 శాతం నకిలీవని తాజాగా తేలింది. అయిదేళ్లలో రూ.144.83 కోట్లు అనర్థులు జేబుల్లో వేసినట్లు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంతర్గత విచారణలో వెల్లడైంది. దీంతో, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఈ అక్రమాలపై కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ జూలై 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ శాఖ అంతర్గత విచారణ జరిపిన 1,572 విద్యా సంస్థల్లో 830 వరకు బోగస్‌వేనని గుర్తించారు. ప్రస్తుతానికి 830 విద్యాసంస్థల బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నకిలీ ఆధార్ కార్డులు, కేవైసీ పత్రాలతో లబ్ధిదారులకు బోగస్ అకౌంట్లను బ్యాంకులు ఎలా ఇచ్చాయనే దానిపైనా దృష్టి సారించనుంది. రాష్ట్రాల వారీగా అక్రమాలు.. ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలోని పరిశీలన జరిపిన మొత్తం 62 విద్యాసంస్థలూ బోగస్‌వే. రాజస్తాన్: పరిశీలన జరిపిన 128 విద్యాసంస్థల్లో 99 నకిలీవి. అస్సాం: రాష్ట్రంలోని స్కాలర్షిప్ అందుకుంటున్న మొత్తం విద్యా సంస్థల్లో 68శాతం ఉత్తుత్తివే. కర్ణాటక: కర్ణాటకలోని 64 శాతం విద్యాసంస్థలు బోగస్‌వి. ఉత్తరప్రదేశ్: 44 శాతం విద్యాసంస్థలు నకిలీవి. పశ్చిమబెంగాల్: 39 శాతం సంస్థలు నకిలీవి. పక్కదారి పలు విధాలు ► కేరళలోని మలప్పురంలో ఒక బ్యాంకు శాఖలో 66 వేల స్కాలర్షిప్పులు పంపిణీ అయ్యాయి. ఇక్కడ రిజిస్టరయిన మైనారిటీ విద్యార్థుల కంటే ఉపకారవేతనాలు తీసుకున్న వారి సంఖ్యే ఎక్కువ. ► జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌కు చెందిన ఒక కాలేజీలో 5 వేల మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 7 వేల మంది స్కాలర్షిప్పులు అందుకున్నారు. తొమ్మిదో తరగతి చదువుకుంటున్న 22 మంది విద్యార్థులకు ఒకే మొబైల్ నంబర్ ఒక్క తండ్రి పేరుతోనే రిజిస్టరయి ఉంది. మరో విద్యాసంస్థకు అనుబంధంగా హాస్టల్ లేకున్నా విద్యార్థులందరూ స్కాలర్షిప్ పొందారు. ► అస్సాంలో.. ఒక బ్యాంక్ బ్రాంచిలో 66 వేల మంది స్కాలర్షిప్ లబ్ధిదారులున్నారు. సంబంధిత మదర్సాకు వెళ్లి పరిశీలనకు యత్నించగా నిర్వాహకులు అధికారులను బెదిరింపులకు గురిచేశారు. ► పంజాబ్‌లో.. స్కూల్లో పేరు నమోదు చేయించుకోని మైనారిటీ విద్యార్థులు సైతం ఉపకారవేతనాలు అందుకున్నారు. -
బురిడీ కాలేజీలు
కర్నూలు(రాజ్‌విహార్): ‘బోధనా’ విలువలు నేర్పించే కళాశాలలే దారి తప్పాయి. ప్రభుత్వ శాఖలను బురిడీ కొట్టించాయి. అనుమతుల కోసం నకిలీ ధ్రువపత్రాలు సమర్పించాయి. అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన భద్రతా చర్యలు లేకుండానే అడ్డదారుల్లో అనుమతులు పొందాయి. నకిలీ ఎన్ఓసీలతో ఏకంగా రాయలసీమ యూనివర్సిటీనే బురిడీ కొట్టించాయి. మామూళ్ల మత్తులో జోగిన వర్సిటీ అధికారులు వాటిని పరిశీలించకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. జిల్లా వ్యాప్తంగా 96 బీఈడీ, డీఈడీ బోధనా కళాశాలలు ఉండగా.. వాటిలో 11 మాత్రమే అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) పొంది ఉన్నాయి. మిగిలిన 85 కాలేజీలకు ఎన్ఓసీలు లేవు. ఎన్ఓసీలు ఎందుకు? కళాశాలల్లో చదివే విద్యార్థులు, అధ్యాపకుల భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు ఆర్పడానికి తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేయాలి. ఇందుకోసం అగ్ని మాపక శాఖ అధికారుల తనిఖీ అనంతరం పొందే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను వర్సిటీకి సమర్పించాల్సి ఉంటుంది. 500 చదరపు మీటర్ల విస్తీర్ణం లేదా ఆరు మీటర్ల ఎత్తయిన కళాశాల భవనం ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా అగ్ని మాపక శాఖ సూచించిన మేర భద్రతా చర్యలు చేపట్టాలి. ఫైర్ ఎస్టింగర్లతో పాటు హోజ్‌రీల్ పైపు, ఫైర్ పంప్, భవనం పైన వాటర్ ట్యాంకు ఏర్పాటు చేయాలి. 2007 సంవత్సరానికి ముందునిర్మించిన భవనమైతే ఆఫ్‌లైన్‌లో, ఆ తరువాత నిర్మించి ఉంటే ఆన్లైన్లో ఎన్ఓసీ కోసం అగ్నిమాపక శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత సంబంధిత స్టేషన్ ఫైర్ ఆఫీసర్, జిల్లా ఫైర్ ఆఫీసర్ పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉంటే ఎన్ఓసీ జారీ చేస్తారు. నకిలీ ఎన్ఓసీలతో అనుమతులు జిల్లాలో 96 బీఈడీ, డీఈడీ కళాశాలలు ఉండగా.. అందులో 11 మాత్రమే అసలు సర్టిఫికెట్లు పొంది ఉన్నాయి. మిగిలిన వాటికి ఎన్ఓసీలు లేవు. ఇందులో కొన్ని కళాశాలలు చలానా చెల్లించిన రసీదుతో అనుమతులు పొందగా.. మరికొన్ని నకిలీ ఎన్ఓసీలను జత చేసి అనుమతి సంపాదించాయి. వాస్తవానికి బోధనా కళాశాలల్లో రకరకాల చార్జీలు, ఫీజుల పేరుతో విద్యార్థుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ నిబంధనల మేరకు భద్రతా చర్యలు చేపట్టడం లేదు. కళాశాలలకు అనుమతులిచ్చే వర్సిటీ అధికారులు కూడా వచ్చిన ధ్రువపత్రాలు అసలువా.. నకిలీవా? అని చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. వెలుగులోకి వచ్చిందిలా.. ఇటీవలే కొన్ని కళాశాలల ఎన్ఓసీలపై అనుమానం వచ్చిన అగ్నిమాపక శాఖ డీజీ.. ఆ సర్టిఫికెట్ల నిర్ధారణకు జిల్లా ఫైర్ ఆఫీసర్‌ను ఆదేశించారు. అవి నకిలీవని తేలడంతో జిల్లాలోని అన్ని కళాశాలల సర్టిఫికెట్లు పరిశీలించి వాస్తవికతతో కూడిన నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో 96 కళాశాలలల్లో కేవలం 11 ఎన్ఓసీలు మాత్రమే అసలువని తేలింది. నకిలీ ఎన్ఓసీలు, అసలు ఎన్ఓసీలే లేకుండా అనుమతి పొందిన కళాశాలల వివరాలు అక్షరశ్రీ (ఆదోని), అల్ మదీనా (మునగాలపాడు), అంకాలరెడ్డి (ఆళ్లగడ్డ), భారతి (నంద్యాల), బీవీఆర్ (గడివేముల), డాక్టర్ రామలింగారెడ్డి (ఆళ్లగడ్డ), డాక్టర్ కె.వి.సుబ్బారెడ్డి (లక్ష్మీపురం), జి.ఎం కాలేజ్ (నంద్యాల), గీతాంజలి (బి.క్యాంప్, కర్నూలు), జీఎంఆర్ (కవులూరు), జ్ఞానసరస్వతి (బనగానపల్లె), ఇక్బాల్ కాలేజ్ (నాయకల్లు), జేవీఆర్ఆర్ (నంద్యాల), కె.ఇక్బాల్ కాలేజ్ (రుద్రవరం), కేఎండీ ఇక్బాల్ కాలేజ్ (పెద్దపాడు), లిటిల్ ఫ్లవర్ (అయ్యలూరు), మదీనా (బ్రాహ్మణకొట్కూరు), మొహమ్మద్ పాషా కాలేజ్ (బి.క్యాంప్, కర్నూలు), నాయక్ కాలేజీ (దూపాడు), నలంద (ఎమ్మిగనూరు), నేషనల్ కాలేజ్ (ఉలిందకొండ), ప్రభాత్ (పార్నపల్లి), ప్రవీణ్ భాను (ఆళ్లగడ్డ), రాఘవరామ్ (ఆళ్లగడ్డ), రోజా (కోవెలకుంట్ల), సాయిప్రతిభ (కర్నూలు), సాయిశ్రీ (డోన్), సాయినాథ్ రామ్ (కరివేన), ఎస్ఏఎస్ (బ్రాహ్మణకొట్కూరు), శాంతినికేతన్ (లక్ష్మీపురం), శారద (నన్నూరు), సిద్ధార్థ, ఎస్పీజీ (నంద్యాల), ఎస్ఆర్సీ (కర్నూలు), శ్రీలక్ష్మీ (బనగానపల్లె), శ్రీలక్ష్మీనరసింహ (కొలిమిగుండ్ల), శ్రీగాయత్రి (ధర్మవరం), శ్రీలక్ష్మి వెంకటేశ్వర (మామిదాలపాడు), శ్రీరాఘవేంద్ర (నన్నూరు), శ్రీరాఘవేంద్ర (ఎమ్మిగనూరు), శ్రీరాఘవేంద్ర (ఆళ్లగడ్డ), శ్రీరామచంద్ర (పాములపాడు), శ్రీసాయిప్రతిభ (పత్తికొండ), శ్రీ వెంకటేశ్వర (ఆత్మకూరు), సెయింట్ పీటర్స్ (జూటూరు), సుమౌర్య (బి.తాండ్రపాడు), ఠాగూర్ కాలేజీ (కోడుమూరు), తారకరామ (చాపిరేవుల), వరప్రసాద్ రావు కాలేజీ (పంచలింగాల), విజయానికేతన్ (పాణ్యం), విశ్వవాణి (కర్నూలు), జోహార్స్ (ఉడుములపాడు), జుబేదా కాలేజీ (నంద్యాల), కృషి విద్యానికేతన్ (ఆళ్లగడ్డ), జీఎస్ఆర్ (చింతకుంట), మదీనా (కోవెలకుంట్ల), విశ్వశాంతి (ఆళ్లగడ్డ), శ్రీవెంకటేశ్వర విద్యా మందిర్ (నంద్యాల), ఎంఎన్ఆర్ (తిమ్మాపురం), ఎన్ఎంఆర్ (కర్నూలు), సర్వేశ్వర (పసుపల), బృందావన్ (ఆళ్లగడ్డ), కె.నాగిరెడ్డి (దూపాడు), వెంకటేశ్వర్ (నంద్యాల), నాగ సత్యనారాయణ (బొల్లవరం), శ్రీసాయి వెంకటేశ్వర (గూడూరు), కేఎస్ఆర్ (కర్నూలు), శ్రీవైష్ణవి (పత్తికొండ), శ్రీసుధ (డోన్), అనసూయ (తుగ్గలి), సెయింట పీటర్ (ఆదోని), శ్రీవెంకటేశ్వర (ప్యాపిలి), శ్రీలక్ష్మీ శ్రీనివాస (బి.తాండ్రపాడు), శ్రీభారతి (నంద్యాల), నవభారత్ కాలేజ్ (బి.క్యాంప్, కర్నూలు), సుమౌర్య (హొళగుంద), శ్రీశివసాయికృష్ణ కాలేజీ (నందికొట్కూరు). 85 కళాశాలలకు ఎన్ఓసీలు లేవు జిల్లాలో 96 బీఈడీ, డీఈడీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో కేవలం 11 మాత్రమే నిబంధనల ప్రకారం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు పొందాయి. మిగిలిన కళాశాలలు పెట్టిన ఎన్ఓసీలు నకిలీవని తేలింది. కొన్ని కాలేజీలు కేవలం చలానా తీసిన రసీదుతో అనుమతులు పొందాయి. – వి.శ్రీనివాసరెడ్డి, జిల్లా ఫైర్ ఆఫీసర్ -
రాష్ట్రంలో 37 నకిలీ ఇంజనీరింగ్ కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 37 అనుమతిలేని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నట్లు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ ) తేల్చింది. 2018–19 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తం గా 236 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వలే దని వెల్లడించింది. వాటి పరిస్థితిపై ఈ నెల 4 లోగా నివేదిక అందజేయాలని రాష్ట్రాలకు లేఖ లు రాసింది. ఆ కాలేజీల్లో తరగతులు కొనసాగుతున్నట్లయితే మూసేయాలని, వాటిపై రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని చెప్పింది. రాష్ట్రంలో సగానికిపైగా నకిలీ కాలేజీలు గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయని పేర్కొంది. ఏఐసీటీఈ ఆదేశాల నేపథ్యంలో నివేదిక బాధ్యతను ఉన్నత విద్యా మండలికి ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం కాలేజీ వారీగా వివరాలు తెలుసుకోడానికి విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి చర్యలు చేపట్టారు. కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చిన జేఎన్టీయూ, ఉస్మాని యా, కాకతీయ యూనివర్సిటీల నుంచి సమా చారం క్రోడీకరిస్తున్నారు. ఇటీవల ఇంజనీరింగ్ ప్రవేశాలు చేపట్టిన ప్రవేశాల క్యాంపు కార్యాల యం నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అనుమతుల వివరాలు ఇవ్వాలని కొన్ని డీమ్డ్, ప్రైవేటు వర్సిటీలకు కూడా ఉన్నత విద్యా మండలి లేఖలు రాసింది. వాటి నుంచి వివరాలు రాగానే క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని పాపిరెడ్డి పేర్కొన్నారు. -
23 యూనివర్సిటీలు, 279 కాలేజీలు నకిలీవి
నకిలీ యూనివర్సిటీలు, నకిలీ కాలేజీలతో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. దేశంలో 23 యూనివర్సిటీలు, 279 టెక్నికల్ ఇన్స్టిట్యూట్లకు ఎలాంటి రెగ్యులేటరీ అనుమతి లేదని తేలింది. నకిలీ కాలేజీల జాబితాలో ఢిల్లీ తొలి స్థానంలో ఉందని వెల్లడైంది. ఇండియాలోనే ఈ రాష్ట్రంలో నకిలీ కాలేజీలు ఎక్కువగా ఉద్భవిస్తున్నాయని తెలిసింది. ఈ కాలేజీలకు డిగ్రీలు జారీచేయడానికి ఎలాంటి అథారిటీ లేదని, ఈ కాలేజీలు జారీచేసే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు కేవలం ఓ కాగితమేనని యూనిర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తెలిపింది. 23 నకిలీ యూనివర్సిటీల్లో ఢిల్లీలోనే ఏడు యూనివర్సిటీలు ఉన్నాయని ఈ కమిషన్ వెల్లడించింది. యూజీసీ, ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) గత నెల చేపట్టిన వార్షిక సమీక్షలో ఈ నకిలీ యూనివర్సిటీలు, కాలేజీలను వెలుగులోకి వచ్చాయి. ఈ నకిలీ ఇన్స్టిట్యూట్ల జాబితాను యూజీసీ, ఏఐసీటీఈ తమ వెబ్ సైట్లో పొందుపరిచాయి. వచ్చే నెల నుంచి కొత్త అకాడమిక్ సెషన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని యూజీసీ హెచ్చరించింది. అనుమతి లేకుండా.. కార్యకలాపాలు సాగిస్తున్న ఈ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ జాబితాను సంబంధిత రాష్ట్ర అధికారులకు తాము పంపుతామని, వీటిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశిస్తామని యూజీసీ అధికారులు చెప్పారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలలో కూడా నకిలీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. విద్యార్థులను జాగ్రత్త పరిచేందుకు ఈ నకిలీ కాలేజీల జాబితాలను వార్తాపత్రికల్లో ప్రచురిస్తామని కూడా అధికారులు పేర్కొన్నారు. -
కాగితాలపై కాలేజీలా?
- అలాంటి వాటిని కఠినంగా శిక్షిస్తాం: కేసీఆర్ - జవాబుదారీతనం లేని విద్యా సంస్థలకు చరమగీతం పాడుతాం - సౌకర్యాలు లేక, నాసిరకం విద్య అందించే విద్యాసంస్థలు స్వచ్ఛందంగా తప్పుకోవాలి - ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చేశాయి - విద్యను పరిపుష్టం చేసేందుకు సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉంది - తప్పుడు ప్రచారం చేయడం సరికాదు - విద్యావ్యవస్థ తీరుతెన్నులపై సమీక్ష సాక్షి, హైదరాబాద్: ‘‘కొద్దో గొప్పో లోటుపాట్లు ఉన్నాయంటే ఏమో గానీ అసలు పంతుళ్లు లేరు.. పిల్లల్లేరు.. ఏమీ ఉండవు.. కాగితాల మీదే కాలేజీ నడుస్తుంది. ఇది ఎంత దారుణం..? ఇలాంటి ఫేక్ కాలేజీ యాజమాన్యాలను గుర్తించి కఠినంగా శిక్షిస్తాం..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. జవాబుదారీతనం లోపించిన విద్యా సంస్థలకు రాష్ట్రంలో చరమగీతం పాడుతామని స్పష్టంచేశారు. కనీస సౌకర్యాలను విస్మరించి, నాసిరకం విద్యను అందిస్తున్న విద్యాసంస్థలు స్వచ్ఛందంగా తప్పుకోవాలన్నారు. నకిలీ ఫ్యాకల్టీని రికార్డుల్లో చూపుతూ అసలు విద్యార్థులే లేకుండా కాలేజీలను నడపడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ తీరు తెన్నులపై బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డిగ్రీ కాలేజీల్లో ఆన్లైన్ అడ్మిషన్లు, యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ, హాస్టళ్ల పరిస్థితి, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీల్లో చేపట్టిన విజిలెన్స్ తనిఖీలు తదితర అంశాలపై సమీక్షించారు. అటు అఖిల భారత సాంకేతిక విద్యామండలితోగానీ(ఏఐసీటీఈ), ఇటు రాష్ట్ర ప్రభుత్వంతోగానీ సంబంధం లేకుండా నడుస్తున్న కాలేజీలపై ఆరా తీశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వివిధ పేర్లతో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చాయన్నారు. ‘‘బాధ్యత కలిగిన ప్రభుత్వం అందరికీ న్యాయం జరగాలని చూస్తుంది. మా ప్రభుత్వం కూడా అంతే. రిజర్వేషన్లు అమలు పరచకుండా ఇష్టం వచ్చినట్లు అడ్మిషన్లు చేపడతామంటే ఎట్లా? వారు అటు కేంద్ర ప్రభుత్వం చేతనో, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేతనో, లేక ప్రభుత్వరంగ సంస్థ చేతనో కనీసం నియంత్రణ లేకుండా నడిపించడం అస్సలు కరె క్టు కాదు..’’ అని పేర్కొన్నారు. కాలేజీల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థి చదువుకోవద్దా అని ప్రశ్నించారు. వర్సిటీల పరిస్థితిపై నివేదిక ఇవ్వండి రాష్ట్రంలో యూనివర్సిటీలు, వాటిల్లో ఎన్ని వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి అనుబంధ కాలేజీల పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని సీఎం ఆదేశించారు. యూనివర్సిటీ భవనాల పరిస్థితేంటి? ఫ్యాకల్టీ పరిస్థితేంటి? విద్యార్థుల పరిస్థితేంటి? వాళ్ల హాస్టళ్ల నిర్వహణ వ్యవహారం ఏంటి? ఏయే యూనివర్సిటీకి ప్రభుత్వం ఏ మేరకు సహకారం అందించాలి? ఆర్థికంగా ఎన్ని నిధులు అవసరం? అనే అంశాలపై పూర్తిస్థాయి సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. స్వయం ఉపాధి పొందేలా తీర్చిదిద్దండి డిగ్రీ పట్టా చేతిలోకి వచ్చిన యువత ఖాళీగా ఉండకుండా తాము చదివిన విద్య ద్వారా స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందే దిశగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం అధికారులకు సూచించారు. విద్యా రంగంలో ఇప్పటివరకు కొనసాగిన మూస ధోరణలను వదిలి మారుతున్న కాలానికి అనుగుణంగా ఉన్నత విద్యలో అప్ టు డేట్ మార్క్ కనిపించేలా కోర్సులను ప్రవేశ పెట్టాలన్నారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పునరుద్ఘాటించారు. పూర్తిస్థాయి ప్రక్షాళన దిశగా తెలంగాణ ప్రభుత్వం వేస్తున్న అడుగులు ఫలితాలను ఇస్తున్నాయని, చిత్తశుద్ధితో తాము చేపట్టిన బృహత్కార్యానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నిబంధనలను అతిక్రమించిన యాజమాన్యాలు వాటిని సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం తగినంత సమయం ఇస్తుందన్నారు. సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉంది కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో విద్యా విధానం పరిపుష్టం చేయాలంటే అనేక కొత్త సంస్కరణలకు నాంది పలకాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. అందుకు కాలేజీ యాజమాన్యాలు, విద్యాశాఖ సమన్వయంతో కలిసి పని చేయాలన్నారు. ‘‘గందరగోళంగా ఉన్న విద్యా వ్యవస్థను చక్కదిద్దాలన్నదే మా ఉద్దేశం. కేజీ టు పీజీ వరకు ఉన్న అన్ని విద్యా వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేసి తద్వారా నాణ్యమైన విద్యను అందించాలన్నది మా ఉద్దేశం. కొందరు దీన్ని నెగిటివ్‌గా భావిస్తూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదు..’’ అని పేర్కొన్నారు. విద్యార్థి చ దువులు మార్కెట్‌కు, పరిశ్రమకు అనుబంధంగా ఉండాలన్నారు. ఆ దిశగా జూనియర్, డి గ్రీ, పీజీ తదితర వృత్తి విద్యా కోర్సులకు రూపకల్పన చేయాలని సూచించారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాకే దోస్త్ ద్వారా అడ్మిషన్లు డిగ్రీ ప్రవేశాలను ఇక నుంచి ఆన్లైన్లో చేపట్టాలని నిర్ణయించామని, అయితే అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాతే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్)పై సీఎం చర్చించారు. ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు లభించే సౌలభ్యాన్ని సమీక్షించారు. దీంతో విద్యార్థులు కాలేజీల చుట్టూ తిరిగి అడ్మిషన్ ఫీజులు చెల్లించే అవన వసర ఖర్చు తప్పుతుందని, తమకు కావాల్సిన కాలేజీలో అడ్మిషన్‌ను పొందే వెసులుబాటు ఉంటుందని అధికారులు తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కొన్ని కాలేజీ యాజమాన్యాల కక్కుర్తి చర్యలకు ఆన్లైన్ అడ్మిషన్ అడ్డుకట్ట వేస్తుందని, అనేక విధాలుగా ఇది శ్రేయస్కరమని సీఎంకు వివరించారు. డిగ్రీ ఫీజుల నిర్ధరణ ప్రభుత్వమే చేస్తుంది.. జిల్లా స్థాయిల్లోని డిగ్రీ కాలేజీల్లో కనీస ఫీజులను త్వరలోనే ప్రభుత్వమే నిర్ధరించాలని సమావేశంలో నిర్ణయించారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రతిష్టాత్మకంగా నడుస్తున్న డిగ్రీ కాలేజీలకు ఎంత ఫీజు నిర్ధరించాలనే అంశంపై ఆయా కాలేజీ యాజమాన్యాలతో త్వరలోనే చర్చించి నిర్ణయించనుంది. అటానమస్, మైనారిటీ, ప్రీమియర్ కాలేజీలను గుర్తించి వారితో చర్చించి పూర్తిస్థాయి కసరత్తు అనంతరం డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల విధానం అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ నెల 20 నుంచి ప్రారంభం కావాల్సిన రిజిస్ట్రేషన్ నిలిపివేయనున్నారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, కళాశాల విద్య కమిషనర్ వాణిప్రసాద్, జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు.