బుధవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో కడియం, ఉన్నతాధికారులు
- అలాంటి వాటిని కఠినంగా శిక్షిస్తాం: కేసీఆర్
- జవాబుదారీతనం లేని విద్యా సంస్థలకు చరమగీతం పాడుతాం
- సౌకర్యాలు లేక, నాసిరకం విద్య అందించే విద్యాసంస్థలు స్వచ్ఛందంగా తప్పుకోవాలి
- ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చేశాయి
- విద్యను పరిపుష్టం చేసేందుకు సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉంది
- తప్పుడు ప్రచారం చేయడం సరికాదు
- విద్యావ్యవస్థ తీరుతెన్నులపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ‘‘కొద్దో గొప్పో లోటుపాట్లు ఉన్నాయంటే ఏమో గానీ అసలు పంతుళ్లు లేరు.. పిల్లల్లేరు.. ఏమీ ఉండవు.. కాగితాల మీదే కాలేజీ నడుస్తుంది. ఇది ఎంత దారుణం..? ఇలాంటి ఫేక్ కాలేజీ యాజమాన్యాలను గుర్తించి కఠినంగా శిక్షిస్తాం..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. జవాబుదారీతనం లోపించిన విద్యా సంస్థలకు రాష్ట్రంలో చరమగీతం పాడుతామని స్పష్టంచేశారు. కనీస సౌకర్యాలను విస్మరించి, నాసిరకం విద్యను అందిస్తున్న విద్యాసంస్థలు స్వచ్ఛందంగా తప్పుకోవాలన్నారు. నకిలీ ఫ్యాకల్టీని రికార్డుల్లో చూపుతూ అసలు విద్యార్థులే లేకుండా కాలేజీలను నడపడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ తీరు తెన్నులపై బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్ అడ్మిషన్లు, యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ, హాస్టళ్ల పరిస్థితి, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీల్లో చేపట్టిన విజిలెన్స్ తనిఖీలు తదితర అంశాలపై సమీక్షించారు. అటు అఖిల భారత సాంకేతిక విద్యామండలితోగానీ(ఏఐసీటీఈ), ఇటు రాష్ట్ర ప్రభుత్వంతోగానీ సంబంధం లేకుండా నడుస్తున్న కాలేజీలపై ఆరా తీశారు.
అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వివిధ పేర్లతో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చాయన్నారు. ‘‘బాధ్యత కలిగిన ప్రభుత్వం అందరికీ న్యాయం జరగాలని చూస్తుంది. మా ప్రభుత్వం కూడా అంతే. రిజర్వేషన్లు అమలు పరచకుండా ఇష్టం వచ్చినట్లు అడ్మిషన్లు చేపడతామంటే ఎట్లా? వారు అటు కేంద్ర ప్రభుత్వం చేతనో, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేతనో, లేక ప్రభుత్వరంగ సంస్థ చేతనో కనీసం నియంత్రణ లేకుండా నడిపించడం అస్సలు కరె క్టు కాదు..’’ అని పేర్కొన్నారు. కాలేజీల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థి చదువుకోవద్దా అని ప్రశ్నించారు.
వర్సిటీల పరిస్థితిపై నివేదిక ఇవ్వండి
రాష్ట్రంలో యూనివర్సిటీలు, వాటిల్లో ఎన్ని వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి అనుబంధ కాలేజీల పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని సీఎం ఆదేశించారు. యూనివర్సిటీ భవనాల పరిస్థితేంటి? ఫ్యాకల్టీ పరిస్థితేంటి? విద్యార్థుల పరిస్థితేంటి? వాళ్ల హాస్టళ్ల నిర్వహణ వ్యవహారం ఏంటి? ఏయే యూనివర్సిటీకి ప్రభుత్వం ఏ మేరకు సహకారం అందించాలి? ఆర్థికంగా ఎన్ని నిధులు అవసరం? అనే అంశాలపై పూర్తిస్థాయి సమాచారాన్ని అందించాలని ఆదేశించారు.
స్వయం ఉపాధి పొందేలా తీర్చిదిద్దండి
డిగ్రీ పట్టా చేతిలోకి వచ్చిన యువత ఖాళీగా ఉండకుండా తాము చదివిన విద్య ద్వారా స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందే దిశగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం అధికారులకు సూచించారు. విద్యా రంగంలో ఇప్పటివరకు కొనసాగిన మూస ధోరణలను వదిలి మారుతున్న కాలానికి అనుగుణంగా ఉన్నత విద్యలో అప్ టు డేట్ మార్క్ కనిపించేలా కోర్సులను ప్రవేశ పెట్టాలన్నారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పునరుద్ఘాటించారు. పూర్తిస్థాయి ప్రక్షాళన దిశగా తెలంగాణ ప్రభుత్వం వేస్తున్న అడుగులు ఫలితాలను ఇస్తున్నాయని, చిత్తశుద్ధితో తాము చేపట్టిన బృహత్కార్యానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నిబంధనలను అతిక్రమించిన యాజమాన్యాలు వాటిని సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం తగినంత సమయం ఇస్తుందన్నారు.
సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉంది
కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో విద్యా విధానం పరిపుష్టం చేయాలంటే అనేక కొత్త సంస్కరణలకు నాంది పలకాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. అందుకు కాలేజీ యాజమాన్యాలు, విద్యాశాఖ సమన్వయంతో కలిసి పని చేయాలన్నారు. ‘‘గందరగోళంగా ఉన్న విద్యా వ్యవస్థను చక్కదిద్దాలన్నదే మా ఉద్దేశం. కేజీ టు పీజీ వరకు ఉన్న అన్ని విద్యా వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేసి తద్వారా నాణ్యమైన విద్యను అందించాలన్నది మా ఉద్దేశం. కొందరు దీన్ని నెగిటివ్‌గా భావిస్తూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదు..’’ అని పేర్కొన్నారు. విద్యార్థి చ దువులు మార్కెట్‌కు, పరిశ్రమకు అనుబంధంగా ఉండాలన్నారు. ఆ దిశగా జూనియర్, డి గ్రీ, పీజీ తదితర వృత్తి విద్యా కోర్సులకు రూపకల్పన చేయాలని సూచించారు.
అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాకే దోస్త్ ద్వారా అడ్మిషన్లు
డిగ్రీ ప్రవేశాలను ఇక నుంచి ఆన్‌లైన్‌లో చేపట్టాలని నిర్ణయించామని, అయితే అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాతే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్)పై సీఎం చర్చించారు. ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు లభించే సౌలభ్యాన్ని సమీక్షించారు. దీంతో విద్యార్థులు కాలేజీల చుట్టూ తిరిగి అడ్మిషన్ ఫీజులు చెల్లించే అవన వసర ఖర్చు తప్పుతుందని, తమకు కావాల్సిన కాలేజీలో అడ్మిషన్‌ను పొందే వెసులుబాటు ఉంటుందని అధికారులు తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం కొన్ని కాలేజీ యాజమాన్యాల కక్కుర్తి చర్యలకు ఆన్‌లైన్ అడ్మిషన్ అడ్డుకట్ట వేస్తుందని, అనేక విధాలుగా ఇది శ్రేయస్కరమని సీఎంకు వివరించారు.
డిగ్రీ ఫీజుల నిర్ధరణ ప్రభుత్వమే చేస్తుంది..
జిల్లా స్థాయిల్లోని డిగ్రీ కాలేజీల్లో కనీస ఫీజులను త్వరలోనే ప్రభుత్వమే నిర్ధరించాలని సమావేశంలో నిర్ణయించారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రతిష్టాత్మకంగా నడుస్తున్న డిగ్రీ కాలేజీలకు ఎంత ఫీజు నిర్ధరించాలనే అంశంపై ఆయా కాలేజీ యాజమాన్యాలతో త్వరలోనే చర్చించి నిర్ణయించనుంది. అటానమస్, మైనారిటీ, ప్రీమియర్ కాలేజీలను గుర్తించి వారితో చర్చించి పూర్తిస్థాయి కసరత్తు అనంతరం డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల విధానం అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ నెల 20 నుంచి ప్రారంభం కావాల్సిన రిజిస్ట్రేషన్ నిలిపివేయనున్నారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, కళాశాల విద్య కమిషనర్ వాణిప్రసాద్, జేఎన్‌టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు.