ఘనంగా రంజాన్ పండుగ | grand celebration to ramzan festivel :cm kcr review | Sakshi
Sakshi News home page

ఘనంగా రంజాన్ పండుగ

Published Wed, Jun 15 2016 2:52 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

ఘనంగా రంజాన్ పండుగ - Sakshi

ఘనంగా రంజాన్ పండుగ

అధికారిక ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
2 లక్షల ముస్లిం పేద కుటుంబాలకు దుస్తుల పంపిణీ

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రంజాన్‌ను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వపరంగా ఈద్గా, మసీదుల దగ్గర కావాల్సిన ఏర్పాట్లు చేయాలన్నారు. రంజాన్ సందర్భంగా 2 లక్షల పేద ముస్లిం కుటుంబాలకు కొత్త దుస్తులు పంపిణీ చేయాలని, ఈ నెల 17 నుంచి 22 వరకు హైదరాబాద్‌లోని 100 ప్రాం తాల్లో, జిల్లాల్లోని 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. మదర్సాలు, అనాథ శరణాలయాల్లో కూడా దుస్తులు పంపిణీ చేయాలన్నారు. వచ్చే నెలలో జరిగే రంజాన్ సందర్భంగా ప్రభుత్వం తరఫున చేయాల్సిన కార్యక్రమాలపై క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి సమీక్షించారు.

సీఎం మాట్లాడుతూ రంజాన్‌ను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ఇఫ్తార్ విందు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 26న హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ మైదానంలో సాయంత్రం ప్రత్యేక ప్రార్థన చేసి ఇఫ్తార్ విందు ఏర్పా టు చేయాలని, నగరంలోని ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, మత పెద్దలు, రాయబారులు, కాన్సులేట్లను ఆహ్వానించాలని సీఎం సూచించారు. నిజాం కాలేజీలో జరిగే ప్రధాన కార్యక్రమంలో తాను పాల్గొంటానని సీఎం వెల్లడించారు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా ఇఫ్తార్ విందులు జరగాలని చెప్పారు. జిల్లా కేంద్రంలో జరిగే ప్రధాన కార్యక్రమానికి కలెక్టర్లు సమన్వయకర్తలుగా వ్యవహరించాలని సూచించారు. రంజాన్ సందర్భంగా ముస్లింల ప్రార్థనా స్థలాల వద్ద కావాల్సిన కనీస వసతులు కల్పించాలని సీఎం చెప్పారు.

సమీక్షలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, పేద ముస్లింలు, మైనారిటీల విద్య, ఉపాధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల మంది మైనారిటీలకు ప్రభుత్వపరంగా భూ పంపిణీ జరిగినట్లు లెక్కలున్నాయని, అవి ఏ పరిస్థితుల్లో ఉన్నాయో విచారణ జరపాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చామని చెప్పారు. వివరాలు అందిన వెంటనే సదరు భూములన్నీ మైనారిటీలకు వంద శాతం ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement