ఆ జిల్లాల ఏర్పాటును పరిశీలిస్తున్నాం: కేసీఆర్
హైదరాబాద్: జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటును పరిశీలిస్తున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. కొత్త జిల్లా ఏర్పాటుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సిద్ధిపేట జిల్లా ప్రారంభోత్సవంలో తాను పాల్గొంటానని చెప్పారు. దసరా రోజు నుంచే కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు పనిచేయాలని ఆదేశించారు.
సిద్ధిపేటలో పోలీసు కమిషనరేట్ ఏర్పాటు చేయాలని సూచించారు. కరీంనగర్, నిజామాబాద్ తో పాటు సిద్ధిపేట కమిషనరేట్ ప్రతిపాదనను వెంటనే రూపొందించాలన్నారు. యాదాద్రి జిల్లాను రాచకొండ పోలీసు కమిషనరేట్ లోకి, జనగామ జిల్లాను వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోకి తేవాలని సలహాయిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని తాండూరును రెవెన్యు డివిజన్లుగా మార్చాలని అన్నారు.
మొయినాబాద్, శంకర్ పల్లి, షాబాద్ తో పాటు చేవెళ్ల మండలాన్ని శంషాబాద్ జిల్లాలో చేరుస్తామని చెప్పారు. కామారెడ్డి జిల్లాలోనే నాగిరెడ్డిపేట మండలాన్ని ఉంచాలన్నారు. ముథోల్ నియోజకవర్గంలోని భైంసాలో రెవెన్యు డివిజన్ ఏర్పాటు చేయాలని సూచించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కుక్, మనోహరాబాద్.. నిజామాబాద్ జిల్లాలోని చందూరు, ములుగు నియోజకవర్గంలోని కన్నాయిగూడెం, నిర్మల్ అర్బన్, రూరల్ మండలాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు.