పన్ను ఎగవేతలను అరికట్టండి: కేసీఆర్
- వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు కేసీఆర్ ఆదేశం
- బకాయిల వసూలుకు పటిష్ట కార్యాచరణ అవసరం
సాక్షి, హైదరాబాద్: పన్నుల వసూళ్లలో వినూత్న ఆలోచనలు చేయాలని, ఎగవేతలను పూర్తిస్థాయిలో అరికట్టాలని వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. పన్నులు సక్రమంగా చెల్లించే వారిని ప్రోత్సహిస్తూ, ఎగవేతదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. పన్ను వసూళ్లలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న అధికారుల వెన్నుతట్టేలా కార్యక్రమాలను రూపొందించాలని చెప్పారు.
రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేస్తున్న పన్నులు, ఇతర రాష్ట్రాల్లో వ్యాట్ ద్వారా వస్తున్న ఆదాయం, ఎగవేత దారులు, బకాయిలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ శనివారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. రాష్ట్ర ఖజానాకు అత్యధిక ఆదాయం సమకూర్చే వాణిజ్య పన్నుల శాఖను పటిష్టం చేసుకోవాలని, అవసరమైతే పునర్వ్యవస్థీకరించుకోవాలని అధికారులకు ఈ సందర్భంగా సూచించారు. ఖాళీలను భర్తీ చేసి, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలన్నారు.
ఆదాయంపై దృష్టి పెట్టండి
వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రావాల్సినంత ఆదాయం వస్తున్నదా, లేదా? అనే అంశాన్ని శాస్త్రీయంగా బేరీజు వేసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించే ఉద్యోగులను ప్రోత్సహించే కార్యక్రమాలను రూపొందించాలని చెప్పారు. పన్నులు సక్రమంగా చెల్లించే వ్యక్తులు, సంస్థలను గుర్తించి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. రూ.3,600 కోట్ల బకాయిలకు సంబంధించి కోర్టుల్లో కేసులున్నాయని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా జరిపే అన్ని కొనుగోళ్లపై టీడీఎస్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు.
అవసరమైతే పదవీ విరమణ చేసే అధికారుల సేవలను, అనుభవాలను ఉపయోగించుకోవాలని సూచించారు. బడ్జెట్, బడ్జెటేతర వ్యయం ద్వారా రాష్ట్రంలో భారీగా పనులు జరుగుతున్నాయని... ఫలితంగా పన్నులు అదనంగా వసూలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చెక్‌పోస్టుల ఆధునీకరణ, ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల నిర్మాణం, నెలకో అంశాన్ని తీసుకొని అక్రమార్కులపై దాడులు చేయడం తదితర అంశాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, అదనపు కమిషనర్ కె.చంద్రశేఖర్‌రెడ్డి, జాయింట్ కమిషనర్ రేవతి రోహిణి తదితరులు పాల్గొన్నారు.