సాక్షి, హైదరాబాద్: రంజాన్ ఉపవాసాలను పురస్కరించుకుని సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ నెల 26న ముస్లిం సోదరులకు దావత్-ఏ-ఇఫ్తార్(ఇఫ్తార్ విందు) ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తూ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కేసీఆర్ హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో 6 వేల మందికి స్వయంగా ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలోని 100 మసీదుల్లో లక్ష మందికి, రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని ఒక్కో మసీదులో 1,000 మందికి ఇఫ్తార్ విందు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.
ఒక్కో మసీదు ద్వారా 1,000 మంది పేద కుటుంబాలకు దుస్తులను సైతం పంపిణీ చేయనున్నారు. అనాథ చిన్నారులకు ఇఫ్తార్ విందుతో పాటు దుస్తులు పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి రూ.14 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. నగరంలో ఇఫ్తార్ విందు ఏర్పాట్లను హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లతో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్, వక్ఫ్ బోర్డు అధికారులు పర్యవేక్షించనున్నారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. దుస్తుల పంపిణీ బాధ్యతలను మసీదు కమిటీలు, ఇమాంలకు అప్పగించింది.
దావత్-ఏ-ఇఫ్తార్ మార్గదర్శకాలు జారీ
Published Sun, Jun 19 2016 12:23 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement