న్యూఢిల్లీ: మైనారిటీల్లోని పేద కుటుంబాల పిల్లలకు అందాల్సిన ఉపకార వేతనాలు భారీగా పక్కదారి పట్టాయి. అనర్హులు వాటిని కాజేశారు. ఏళ్లుగా అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ దందాకు వివిధ స్థాయిల్లో నోడల్ అధికారులు కొమ్ముకాశారు. స్కాలర్‌షిప్ పథకానికి ఆమోదం పొందిన విద్యా సంస్థల్లో 53 శాతం నకిలీవని తాజాగా తేలింది. అయిదేళ్లలో రూ.144.83 కోట్లు అనర్థులు జేబుల్లో వేసినట్లు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంతర్గత విచారణలో వెల్లడైంది.
దీంతో, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఈ అక్రమాలపై కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ జూలై 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ శాఖ అంతర్గత విచారణ జరిపిన 1,572 విద్యా సంస్థల్లో 830 వరకు బోగస్‌వేనని గుర్తించారు. ప్రస్తుతానికి 830 విద్యాసంస్థల బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నకిలీ ఆధార్ కార్డులు, కేవైసీ పత్రాలతో లబ్ధిదారులకు బోగస్ అకౌంట్లను బ్యాంకులు ఎలా ఇచ్చాయనే దానిపైనా దృష్టి సారించనుంది.
రాష్ట్రాల వారీగా అక్రమాలు..
ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలోని పరిశీలన జరిపిన మొత్తం 62 విద్యాసంస్థలూ బోగస్‌వే.
రాజస్తాన్: పరిశీలన జరిపిన 128 విద్యాసంస్థల్లో 99 నకిలీవి.
అస్సాం: రాష్ట్రంలోని స్కాలర్‌షిప్ అందుకుంటున్న మొత్తం విద్యా సంస్థల్లో 68శాతం ఉత్తుత్తివే.
కర్ణాటక: కర్ణాటకలోని 64 శాతం విద్యాసంస్థలు బోగస్‌వి.
ఉత్తరప్రదేశ్: 44 శాతం విద్యాసంస్థలు నకిలీవి.
పశ్చిమబెంగాల్: 39 శాతం సంస్థలు నకిలీవి.
పక్కదారి పలు విధాలు
► కేరళలోని మలప్పురంలో ఒక బ్యాంకు శాఖలో 66 వేల స్కాలర్‌షిప్పులు పంపిణీ అయ్యాయి. ఇక్కడ రిజిస్టరయిన మైనారిటీ విద్యార్థుల కంటే ఉపకారవేతనాలు తీసుకున్న వారి సంఖ్యే ఎక్కువ.
► జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌కు చెందిన ఒక కాలేజీలో 5 వేల మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 7 వేల మంది స్కాలర్‌షిప్పులు అందుకున్నారు. తొమ్మిదో తరగతి చదువుకుంటున్న 22 మంది విద్యార్థులకు ఒకే మొబైల్ నంబర్ ఒక్క తండ్రి పేరుతోనే రిజిస్టరయి ఉంది. మరో విద్యాసంస్థకు అనుబంధంగా హాస్టల్ లేకున్నా విద్యార్థులందరూ స్కాలర్‌షిప్ పొందారు.
► అస్సాంలో.. ఒక బ్యాంక్ బ్రాంచిలో 66 వేల మంది స్కాలర్‌షిప్ లబ్ధిదారులున్నారు. సంబంధిత మదర్సాకు వెళ్లి పరిశీలనకు యత్నించగా నిర్వాహకులు అధికారులను బెదిరింపులకు గురిచేశారు.
► పంజాబ్‌లో.. స్కూల్‌లో పేరు నమోదు చేయించుకోని మైనారిటీ విద్యార్థులు సైతం ఉపకారవేతనాలు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment