స్మృతి ఇరానీ మెడకు 'విద్యార్హత' ఉచ్చు
విద్యార్హతలపై ఈసీకి తప్పుడు సమాచారం ఇచ్చారని కోర్టులో ఫిర్యాదు
న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి తాజా మరో చిక్కు! ఆమె విద్యార్హతలకు సంబంధించి ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ దాఖలైన ఓ ఫిర్యాదును ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం పరిశీలనకు స్వీకరించింది. ఆమేర్ ఖాన్ అనే ఫ్రీలాన్స్ రచయిత ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర మంత్రి ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన మూడు అఫిడవిట్లలో తన విద్యార్హతలను ఒక్కోదాంట్లో ఒకో విధంగా ఇచ్చారని ఆమేర్ పేర్కొన్నారు.
మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆకాశ్ జైన్ తదుపరి విచారణను ఆగస్టు 28కి వాయిదా వేశారు. ఆరోజు ఫిర్యాదుదారు నుంచి కోర్టు వాంగ్మూలాన్ని స్వీకరించడంతోపాటు ప్రాథమిక ఆధారాలను సమర్పించడానికి అవకాశమిస్తుంది. 2004, 2011, 2014లలో ఈసీకి ఇచ్చిన అఫిడవిట్లలో కేంద్ర మంత్రి తన విద్యార్హతలపై తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమేర్ పేర్కొన్నారు.
‘మంత్రిని తొలగించాలి..’
కోర్టులో ఈ ఫిర్యాదు దాఖలవడంతో ఇరానీ తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 ఏ ప్రకారం తప్పుడు అఫిడవిట్ ఇచ్చినట్లు రుజువైతే ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ కలిపి విధించడానికి అవకాశం ఉంటుంది. మంత్రికి వ్యతిరేకంగా దాఖలైన ఫిర్యాదును ఢిల్లీకోర్టు పరిశీలనకు స్వీకరించడంతో కాంగ్రెస్, ఆప్‌లు.. ఇరానీపై పెద్ద ఎత్తున విమర్శలకు దిగాయి. ఆమె మంత్రి పదవిలో కొనసాగడానికి ఎలాంటి నైతిక హక్కు లేదని, చట్టపరంగా, రాజ్యాంగపరంగా ఆమె మంత్రి పదవిలో కొనసాగడానికి వీలు లేదని ధ్వజమెత్తాయి. ఆమెను వెంటనే పదవినుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి.