అమేథీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతల విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అమేథీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలుస్తున్న స్మృతి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆ ఆఫిడవిట్‌లో తాను గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదని స్పష్టం చేశారు. అయితే చాలా కాలంగా స్మృతి గ్రాడ్యుయేషన్ అంశం వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేయకపోయినప్పటికీ 2004 ఎన్నికల సమయంలో బీఏ పట్టా పొందినట్టు తప్పుడు వివరాలు పొందుపర్చారని విపక్షాలు ఆరోపిస్తు వచ్చాయి.
వివరాల్లోకి వెళ్తే.. 2004 ఎన్నికల సమయంలో ఢిల్లీ చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్మృతి ఇరానీ తాను 1996లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందినట్టు పేర్కొన్నారు. తీరా 2014లో అమేథీ నుంచి బరిలో నిలిచిన సమయంలో బీకామ్ కోసం 1994లో ఢిల్లీ యూనివర్సిటీ దూర్య విద్యలో ప్రవేశం పొందినట్టు తెలిపారు. దీంతో విపక్షాలు స్మృతిపై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగాయి. అయితే తాజా ఆఫిడవిట్‌లో మాత్రం 2014లో మాదిరి తాను దూరవిద్యలో బీకామ్‌కు కోర్సుకు నమోదు చేసుకున్నట్టు తెలిపిన స్మృతి.. తాను అది పూర్తి చేయలేదని ప్రత్యేకంగా పేర్కొన్నారు. దీని బట్టి స్మృతి 2004లో సమర్పించిన ఆఫిడవిట్‌లో పేర్కొన్న విద్యర్హతలు తప్పడువని అర్థమవుతోంది.
2014 ఆగస్టులో జరిగిన ఓ మీడియా సమావేశంలో స్మృతి మాట్లాడుతూ.. తాను ప్రతిష్టాత్మక యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందినట్టు చెప్పుకొచ్చారు. అయితే అప్పుడు ఆ డిగ్రీ వివరాలు ఎందుకు ఆఫిడవిట్‌లో పొందుపర్చలేదని ప్రతిపక్షాలు స్మృతిని ప్రశ్నించాయి. స్మృతి ఇరానీ తన విద్యార్హత విషయంలో తప్పుదారి పట్టించిందని ఢిల్లీ హైకోర్టులో కేసు కూడా నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే తాజా ఆఫిడవిట్‌లో స్మృతి డిగ్రీ పూర్తి చేయలేదని పేర్కొనడంపై విపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.
స్మృతి ఇరానీ ఆస్తులు రూ.4.71 కోట్లు
తనకు రూ.4.71 కోట్ల ఆస్తి ఉన్నట్లుగా స్మృతి ఇరానీ ప్రకటించారు. గురువారం నామినేషన్ పత్రాల్లో ఆమె ఈ విషయం వెల్లడించారు. రూ.1.75 కోట్ల విలువగల చరాస్తులు, రూ.2.96 కోట్ల విలువగల స్థిరాస్తులు ఉన్నట్లుగా ఆమె వెల్లడించారు. ఇందులో రూ.1.45 కోట్ల విలువగల వ్యవసాయ భూమి, ఇంటి విలువ కోటిన్నరగా ప్రకటించారు. తనపేరు మీద బ్యాంకులో రూ.89 లక్షలు ఉన్నాయని, తపాలా ఖాతాలో 18 లక్షలు, ఇతర పెట్టుబడులు రూ. 1.05 కోట్లు ఉన్నట్లుగా తెలిపారు. రూ.13.14 లక్షల విలువగల వాహనాలు, 21 లక్షల రూపాయల విలువగల బంగారం ఉన్నాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment