స్మృతీ e-‘రాణి’! | bjp leader smriti irani political history | Sakshi
Sakshi News home page

స్మృతీ e-‘రాణి’!

Published Fri, Apr 12 2019 5:00 AM | Last Updated on Fri, Apr 12 2019 11:52 AM

bjp leader smriti irani political history - Sakshi

సీరియల్‌ రాణిగానూ, సినీ నటిగానూ తన పాత్రలో ఇట్టే ఒదిగిపోయే స్మృతీ ఇరానీ రాజకీయ పాత్రని సైతం ఓటమిలోనూ సమర్థవంతంగా నిర్వహించారన్న ప్రశంసలు సామాజిక మాధ్యమాల్లో తరచూ కని, వినిపిస్తున్నాయి. గాంధీ కుటుంబానికి దశాబ్దాలుగా ఆతిథ్యం ఇస్తోన్న అమేథీ లో అదే కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌గాంధీకి 2014 లోక్‌సభ ఎన్నికల్లో స్మృతీ గట్టి పోటీ ఇచ్చారు. కాంగ్రెస్‌కి కంచుకోట లాంటి అమేథీలో ఆ పార్టీ కంగుతినేలా మూడు లక్షలకుపైగా ఓట్లు సాధించి ఇటు పార్టీలోనూ, ఆటు పార్టీ విమర్శకుల్లోనూ తన సత్తా చాటుకోగలిగారు. బహుశా అదే ఈసారి కోటలోని యువరాజు రాహుల్‌లో భయం రాజేసి, కోట దాటి బయటకు వచ్చేలా చేసి ఉంటుందన్న వాదన కూడా ఉంది. అదే రాహుల్‌ని అమేథీ నుంచి వయనాడ్‌కి పరుగులు పెట్టించిందన్న ప్రచారమూ జరుగుతోంది. ఈ అంశంపై సామాజిక మాధ్యమాలే వేదికగా విస్తృత చర్చలు నడుస్తున్నాయి. గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగానే ‘కాంగ్రెస్‌ కంచుకోటలాంటి అమేథీలో స్మృతీ ఇరానీ మళ్లీ పోటీ చేస్తే, రాహుల్‌గాంధీ తన స్థానాన్ని మార్చుకునే అవకాశం ఉంది’ అని ట్విట్టర్‌లో ఆమె అనుచరులు చేసిన ఊహాగానాలూ, కామెంట్లూ సైతం స్మృతీ ఇరానీపై వారికి ఉన్న విశ్వాసాన్ని చాటి చెబుతున్నాయి.

రాహుల్‌తో పోటీ పడగల గ్లామర్‌కి గ్లామర్, స్థానికంగా కాంగ్రెస్‌కు గల పట్టుని ఎలాగైనా దెబ్బతీయాలనే బీజేపీ వ్యూహం వెరసి స్మృతీ ఇరానీకి గత ఎన్నికలు ఓటమిని మిగిల్చినా ఓట్ల శాతంలో మంచి తృప్తినే మిగిల్చాయి. అదే విషయాన్ని స్మృతీ ఇరానీ అనుచరులూ, పార్టీ వర్గాలూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసుకోగలిగాయి. 2014లో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న బలం కారణంగా అమేథీలో లక్షకుపైగా మెజారిటీతో రాహుల్‌  విజయాన్ని చేజిక్కించుకోగలిగారు. అయితే 2004లోనూ, 2009లోనూ ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్‌ ప్రత్యర్థి పార్టీల కన్నా 2014లో స్మృతీ ఇరానీకి వచ్చిన ఓట్లు చాలా ఎక్కువ. రాహుల్‌ సంప్రదాయ ఓటుబ్యాంకుని కొల్లగొట్టిన ఘనత స్మృతీ ఇరానీకి దక్కడంతో స్థానిక బీజేపీ నాయకత్వానికి భవిష్యత్‌పై ఆశలు రేకెత్తాయని చెప్పొచ్చు. అదే మళ్లీ రాహుల్‌తో తలపడే అవకాశాన్ని ఆమెకు ఇచ్చిందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.

రాహుల్‌పై పంచ్‌లే పంచ్‌లు
స్మృతీ ఇరానీ సామాజిక మాధ్యమాల్లో రాహుల్‌గాంధీపై వేస్తున్న పంచ్‌ డైలాగులు సైతం బాగానే పేలుతున్నాయి. గత నెలలో రాహుల్‌పై స్మృతీ ఇరానీ ‘‘భాగ్‌ రాహుల్‌ భాగ్‌..’’ అని ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టారు. దక్షిణాదికి చెందిన కాంగ్రెస్‌ నాయకుల ప్రోద్బలంతోనే రాహుల్‌ వయనాడ్‌లో నామినేషన్‌ వేసారన్న వాదనని సైతం ఆమె దీటుగానే ఎదుర్కొన్నారు. రాహుల్‌ గాంధీ అమేథీ ప్రజలను అవమానించారంటూ స్మృతి నిప్పులు చెరిగారు. 2014 ఎన్నికల్లో ఓటమి తరువాత సైతం ఆమె ఈ నియోజకవర్గంపై పెట్టిన శ్రద్ధ భవిష్యత్‌ కార్యాచరణకి అద్దం పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.  2014 నుంచి, ఇప్పటి వరకు రాహుల్‌ గాంధీ, ఈ నియోజకవర్గాన్ని 17 సార్లు సందర్శించగా, స్మృతీ ఇరానీ 21 సార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించి వందకు పైగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజకీయ నాయకులు ట్విట్టర్‌ వేదికగానే ఓటర్లను ఆకర్షించడానికీ, గెలవటానికీ ప్రయత్నించి ఉంటే, స్మృతీ ఇరానీ కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉన్నదని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.

 అభ్యర్థిగా కాదు పెద్దక్కగా ఆదరించారు..
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అమేథీలో నామినేషన్‌ దాఖలు చేసిన ఒకరోజు తరువాత ఆయన ప్రత్యర్థి స్మృతీ ఇరానీ గురువారం వేలాది మంది పార్టీ కార్యకర్తలూ, అభిమానుల మధ్య నామినేషన్‌ దాఖలు చేశారు. ‘మై భీ చౌకీదార్‌’ నినాదం రాసి వున్న టీ షర్టులను ధరించిన వందలాది బీజేపీ కార్యకర్తల నృత్యాలూ, నినాదాల మధ్య గౌరీగంజ్‌ వైపు సాగిన ఊరేగింపు బీజేపీలో నూతనోత్తేజాన్ని నింపింది. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సహా స్మృతీ ఇరానీ ఊరేగింపులో ఆమె భర్త జుబిన్‌ కూడా పాల్గొన్నారు. జిల్లా మేజిస్ట్రేట్‌ కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేయడానికి ముందు స్మృతీ దంపతులు పూజలు చేశారు. నిజానికి స్మృతీ ఇరానీ 17న నామినేషన్‌ వేయాలని భావించారు. ఆ రోజు సెలవు కావడంతో ముందుగానే నామినేషన్‌ వేయాల్సి వచ్చింది.

భయంతోనే రాహుల్‌ వయనాడ్‌కు..
అమేథీ ప్రజలు ఓట్లతో బుద్ధి చెబుతారని భయపడడంతోనే రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్‌లో పోటీ చేస్తున్నారని స్మృతీ ఇరానీ తన నామినేషన్‌ సందర్భంగా అన్నారు. దేశ విభజనకూ, సమాజ విచ్ఛిన్నానికీ పాల్పడుతోన్న వారిని ఎన్నుకోవద్దనీ, అది దేశాన్ని బలహీనపరుస్తుందనీ వ్యాఖ్యానించారు. అమేథీ తనను ఒక అభ్యర్థిగా కాకుండా పెద్దక్కగా గౌరవించిందనీ, అందుకే అమేథీ ప్రజలకు సేవ చేయడం తన పరమ ధర్మమనీ చెబుతూనే, కాంగ్రెస్‌ అధ్యక్షడు రాహుల్‌ గాంధీ నామినేషన్‌ సందర్భంగా తన బావ రాబర్ట్‌ వాధ్రాని వెంటబెట్టుకోవడాన్ని ఆమె గుర్తు చేశారు. ‘అల్లుడు గారు అడుగుపెట్టారంటే అమేథీ రైతులంతా తమ పంటపొలాలను కాపాడుకునే పనిలో పడాలి’ అని స్మృతీ రైతాంగాన్ని హెచ్చరించారు. అవినీతిలో కూరుకుపోయి, బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యక్తిని వెంటబెట్టుకొని తిరుగుతున్న వాళ్లు బాలాకోట్‌ దాడిలో చనిపోయిన వారి లెక్కలు అడగడం ఆశ్చర్యంగా ఉందని అంటూ, రానున్న రోజుల్లో తన ప్రచారం ఏ అంశాలపై సాగుతుందో ముందుగానే చెప్పారు.

ఓటమి నుంచే గెలుపు బాటలు
ఐదు దశాబ్దాలుగా రెండుసార్లు మినహా అమేథీ ప్రజలు కాంగ్రెస్‌కే పట్టంగట్టారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైనందుకు స్మృతీ ఇరానీ కుంగిపోలేదు. ఆ నియోజకవర్గానికి మొహం చాటేయనూ లేదు. ఓటమి గెలుపునకు తొలిమెట్టని భావించారు. నిత్యం ప్రజల్లో తన పేరు నిలిచిపోయేందుకు ఆమె చాలానే కృషి చేశారు. ఓడిపోయిన తరువాత రాహుల్‌ని ఉద్దేశించి ‘మళ్లీ అక్కడే కలుసుకుందాం’ అంటూ అమేథీ గురించి ట్విట్టర్‌లో వ్యాఖ్యానించడం ఆమె ఆత్మవిశ్వాసానికి ప్రతీక. అది మొదలు స్మృతీ ఇరానీ అమేథీ ప్రజల్లో తన పేరు నిలిచిపోయేలా చాలా పనులు చేశారు.

పేదలకు ఈ–రిక్షాలు పంపిణీ చేశారు. అక్కడి ఉక్కు పరిశ్రమని సందర్శించారు. యువతకి చేరువయ్యేందుకు వైఫై సౌకర్యం కల్పించారు. నియోజకవర్గానికి చెందిన పేద కార్మికుడిని విదేశం నుంచి రప్పించినందుకు సుష్మాస్వరాజ్‌కి ధన్యవాదాలు తెలపడం కానీ,  పేద మహిళలకు చీరలు పంచడం కానీ, ఒక పచ్చళ్ల బ్రాండ్‌ని ఈ ప్రాంతంలో ప్రోత్సహించడం కానీ అమేథీ ప్రజల్లో ఆమె పేరుని మర్చిపోకుండా చేశాయనీ, అవే ఈ ఎన్నికల్లో ఆమెకు కలిసొచ్చే విషయాలని విశ్లేషకులు భావిస్తున్నారు. వాటికి తోడు దేశభక్తి ప్రాధాన్యంగా తీసిన ‘యూరీ– ది సర్జికల్‌ స్ట్రయిక్‌’ సినిమాని జనంలో విస్తృతంగా ప్రదర్శించడం కూడా ఆమెకు ప్లస్‌ అవుతుందని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement