లక్నో : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 15 ఏళ్ల పాటు ఇక్కడ అధికారాన్ని ఎంజాయ్ చేసి.. ఇప్పుడు మరో లోక్‌సభస్థానం కోసం అమేథీని విడిచి వెళ్లిపోయారు. ఈ మోసాన్ని ప్రజలు క్షమించరు.. తప్పక బదులు తీర్చుకుంటారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. బీజేపీ తరఫున అమేథీ నుంచి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి సారి ఆమె నియోజకవర్గంలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ.. ‘మా పార్టీ అమేథీని అభివృద్ధి చేయడం కోసం నన్ను ఇక్కడుకు పంపింది. ఎందుకంటే గత 15 ఏళ్లుగా ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచిన వ్యక్తి అమేథీని నాశనం చేశాడు. ఆయన ఇక్కడ పదిహేనేళ్ల పాటు అధికారాన్ని ఎంజాయ్ చేసి.. ఇప్పుడు అర్థాంతరంగా వదిలి వెళ్లి పోయాడు. ఇన్నేళ్ల పాటు అమేథీలో తనను నమ్ముకుని ఉన్న కార్యకర్తలను మోసం చేశారు. ఈ మోసాన్ని, అవమానాన్ని, అన్యాయాన్ని అమేథీ సహించదు. తగిన సమాధానం చెప్తుంద’ని తెలిపారు.
అంతేకాక ‘వయనాడ్‌లో రాహుల్ గాంధీకి ఓటు వేయాలనుకునేవారు ఒక్కసారి అమేథీలో పర్యటించండి. అభివృద్ధిలో ఈ నియోజకవర్గం ఎంత వెనకడి ఉందో మీకే తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోండి’ అని పిలుపునిచ్చారు. మోదీ కూడా ఓ ర్యాలీలో ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ... హిందువుల కోపాన్ని తప్పించుకోవడానికే రాహుల్ గాంధీ మైనార్టీలు అధికంగా ఉండే నియోజకవర్గానికి పారిపోయారని ఎద్దేవా చేశారు.
స్మృతి ఇరానీ అమేథీ నుంచి పోటీ చేయడం ఇది రెండో సారి. తొలుత 2014 ఎన్నికల్లో అమేథీ నుంచి బీజేపీ తరఫున రాహుల్‌కు వ్యతిరేకంగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే సారి మాత్రం తాను తప్పక గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు స్మృతి ఇరానీ
Comments
Please login to add a commentAdd a comment