ఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గ ఎన్నికల అఫిడవిట్‌లో పొంతన లేని సమాచారం ఇచ్చారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు మండిపడ్డారు. రాహుల్ విద్యార్హతలు, పౌరసత్వంపై చాలాకాలంగా వివాదాలున్నాయన్నారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ తరఫున రిటర్నింగ్ ఆఫీసర్ వివరణ కోరారని, అయితే రాహుల్ గాంధీ తరఫు వివరణ ఇచ్చే న్యాయవాది వద్ద తగిన సమాచారం లేదన్నారు. అందుకే సోమవారం వరకు గడువు కావాలని కోరారని తెలిపారు.
జీవీఎల్ మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ 94లో డిగ్రీ చేసి, 95లో ఎమ్‌ఫిల్ చేసినట్టు అఫిడవిట్లలో పేర్కొన్నారు. డిగ్రీ తర్వాత పీజీ చేయకుండా ఎమ్‌ఫిల్ ఎలా చేస్తారో ఆయనకే తెలియాలి. పైగా డెవలప్మెంట్ ఎకనామిక్స్‌లో ఎమ్‌ఫిల్ చేసినట్టు ఓసారి, డెవలప్మెంట్ స్టడీస్‌లో చేసినట్టు మరోసారి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బ్రిటీష్ కంపెనీలో డైరక్టర్‌గా ఉన్నట్టు కూడా ఓసారి పేర్కొన్నారు. ఆ కంపెనీ ఇచ్చిన వివరాల్లో రాహుల్ గాంధీని బ్రిటీష్ పౌరుడిగా వెల్లడించారు. దీనిపై రాహుల్ గాంధీ నుంచి ఎటువంటి వివరణ లేదు. ఇప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థ వివరణ అడిగింది. రాహుల్ సరైన వివరణ ఇస్తారా లేక తప్పించుకుని పారిపోతారా చూడాలి. ఇతర దేశ పౌరసత్వం కలిగి ఉంటే భారతదేశ పౌరసత్వం కోల్పోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన భారతదేశంలో ఎన్నికల్లో పోటీచేయడానికి రాహుల్‌కి అర్హత ఉండదు. ఒకవేళ పౌరసత్వం లేకుండా అక్కడి కంపెనీకి తప్పుడు సమాచారం ఇచ్చినట్టయితే అక్కడి చట్టాల ప్రకారం శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment