నామినేషన్ వేయడానికి ముందు రోడ్ షోలో పాల్గొన్న రాహుల్, ప్రియాంక, వాద్రా, తన కొడుకు, కూతురితో సెల్ఫీ దిగుతున్న ప్రియాంక గాంధీ
అమేథీ (ఉత్తరప్రదేశ్): కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం అమేథీ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన భారీ రోడ్‌షోలో సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, వారి ఇద్దరు పిల్లలు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింథియా రాహుల్ వెంట ఉన్నారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేర సాగిన ఈ రోడ్‌షోలో తల్లి సోనియాగాంధీ పాల్గొనలేదు. అనంతరం అమేథీ కలెక్టరేట్‌లో నామినేషన్ పత్రాల దాఖలు సమయంలో తనయుడు రాహుల్ వెంట ఆమె ఉన్నారు.
నామినేషన్ సందర్భంగా అమేథీ పట్టణం కాంగ్రెస్ జెండాలు, బ్యానర్లు, రాహుల్, ప్రియాంక కటౌట్లతో నిండిపోయింది. ఎండను సైతం లేక్కచేయని కార్యకర్తలు అమేథీలో రాహుల్, ఆయన కుటుంబసభ్యులకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రహదారికి రెండు వైపులా ఎదురు చూస్తున్న అభిమానులకు రాహుల్ అభివాదం చేసుకుంటూ ముందుకు సాగగా అభిమానులు ఓపెన్ టాప్ వాహనంలో ఉన్న రాహుల్ తదితరులపై పూలవర్షం కురిపించారు.
అమేథీ మాకు పవిత్ర భూమి
అమేథీ నియోజకవర్గం తమ తండ్రి(రాజీవ్‌గాంధీ) కర్మభూమి, తమ కుటుంబానికి పవిత్రమైన చోటు అని ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. రాహుల్ నామినేషన్ అనంతరం ఆమె ట్విట్టర్‌లో..‘ కొన్ని అనుబంధాలు హృదయపూర్వకమైనవి. మా సోదరుని నామినేషన్ దాఖలు సందర్భంగా మా కుటుంబం మొత్తం హాజరయింది. ఇది మా తండ్రి కర్మభూమి, మాకు పవిత్రమైన ప్రాంతం’ అని తెలిపారు.
అమేథీలో ద్విముఖ పోరు
ఎస్‌పీ–బీఎస్‌పీ–ఆర్‌ఎల్‌డీ కూటమి అమేథీలో తమ అభ్యర్థిని నిలపకపోవడంతో రాహుల్‌కు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. అమేథీతోపాటు కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ బరిలోఉన్నారు. బీజేపీ తరఫున స్మృతి ఇరానీ గురువారం నామినేషన్ వేయనున్నారు. పొరుగునే ఉన్న రాయ్‌బరేలీ సీటుకు యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ గురువారం నామినేషన్ వేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment