
లక్నో : కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం అమేథీలో నమాజ్ చేస్తారు.. ఉజ్జయినిలో పూజలు నిర్వహిస్తారంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మీద ఆమె విమర్శల వర్షం కురపించారు. ఈ సందర్భంగా స్మృతి మాట్లాడుతూ.. ‘అమేథీలో కాంగ్రెస్ చాలా తొందరపాటుతనాన్ని ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి. ఓట్ల కోసం ఆమె పడే పాట్లు చూస్తే.. చాలా జాలేస్తుంది. ఓట్ల కోసం అమేథీలో నమాజ్ చేస్తారు.. వెంటనే ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహిస్తారు’ అంటూ ప్రియాంక గాంధీ పేరు ప్రస్తావించకుండా పరోక్ష విమర్శలు చేశారు స్మృతి ఇరానీ.
ఇక ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ లోక్‌సభ ఎన్నికల్లో ముఖాముఖి తలపడుతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో భారీ తేడాతో రాహుల్ చేతిలో ఓడిన స్మృతి ఇరానీ.. ఈ దఫా గెలిచి తీరాలనే కసితో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వయనాడ్‌లో పోటీ చేయడం ద్వారా రాహుల్ తనను గెలిపించిన అమేథీ ప్రజలను అవమానించారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment