నూతన విద్యావిధానంపై అభిప్రాయ సేకరణ: స్మృతీ ఇరానీ
సాక్షి, హైదరాబాద్: నూతన జాతీయ విద్యావిధానంపై చర్చ ద్వారా అభిప్రాయసేకరణ జరపనున్నట్లు కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రి స్మృతీ జుబిన్ ఇరానీ వెల్లడించారు. ఈ సందర్భంగా వెల్లడయ్యే అభిప్రాయాలు, చర్చల సరళిని అధ్యయనం చేసి భ విష్యత్ విధానాన్ని రూపొందిస్తామని ప్రకటించారు. ఆదివారం కేశవ స్మారక విద్యాసమితి ప్లాటినం జూబ్లీ (75వ వార్షికోత్సవం) సందర్భంగా ‘భారతీయ విలువల దృక్కోణంతో మన విద్యావ్యవస్థ పునర్‌వ్యవస్థీకరణ’ అంశంపై జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు. 1986లో రూపొందించిన జాతీయ విద్యావిధానాన్ని ఇప్పటికీ దేశంలో అనుసరిస్తున్నామని, దీనిని మారిన అవసరాలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త ఆశలు, ఆశయాల సాధనకు ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో భారతదేశం నూతన ఆవిష్కరణలతో కొత్త పుంతలు తొక్కి ముందుకు సాగాలన్నారు.
భ్రూణ హత్యలపై ఆవేదన
తల్లి గర్భంలో ఉండగానే ఆడ శిశువులను హతమార్చడం అత్యంత దుర్మార్గమని కేంద్రమంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. మహారాష్ట్రలోని భీడ్‌లో ఓ డాక్టర్ ఈ దురాగతాలకు పాల్పడమే కాకుండా, గర్భస్థ పిండాలను హతమార్చి బయటకు తీశాక కుక్కలకు ఆహారంగా వేయడం హేయమని ఆవేదన వెలిబుచ్చారు. ఆ డాక్టర్‌కు యూనివర్శిటీ వైద్య విద్యను నేర్పింది కానీ.. మానవత్వాన్ని నేర్పలేదనేది ఇటువంటి ఘటనల ద్వారా స్పష్టమవుతోందన్నారు. 2015, ఫిబ్రవరి 21వ తేదీన మాతృభాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు స్మృతీ ఇరానీ ప్రకటించారు.
పింగళి వెంకయ్య గురించి తెలుసుకోండి
ప్రతిరోజు గూగుల్‌లో ప్రపంచంలో ఏవేవో విషయాలు తెలుసుకునే వారు కొంత సమయాన్ని కేటాయించి జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్యను గురించి, మనదేశ సంస్కృతి, వారసత్వాలను గురించి తెలుసుకోవాలని మంత్రి కోరారు. హైకోర్టు న్యాయమూర్తి ఎల్.నర్సింహారెడ్డి మాట్లాడుతూ గతంలో కుటుంబం, పాఠశాల స్థాయిల్లోనే విలువల బోధన జరిగేదన్నారు. స్వాతంత్య్రానంతరం కొందరు వ్యక్తుల ప్రమేయంతో విద్యా విధానం మారిపోయిందన్నారు. విలువల్లో క్షీణతతో పాటు ఉపాధ్యాయులకు కూడా గౌరవం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. షార్ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ మాట్లాడుతూ గత 50 ఏళ్లలో అంతరిక్ష పరిశోధనలో.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ గణనీయమైన ప్రగతిని సాధించామన్నారు. ఈ సదస్సులో ఐఐటీ-హైదరాబాద్ ఎర్త్‌క్వేక్ ఇంజనీరింగ్ రిసెర్చ్ సెంటర్ అధిపతి ప్రొఫెసర్ ఆర్.ప్రదీప్‌కుమార్, కేశవ్ మెమోరియల్ ఇనిసిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్ నీల్ గోగ్టే మాట్లాడారు.
బాబుతో ఇరానీ భేటీ
కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఆదివారం ముఖ్యమంత్రి బాబును ఆయన నివాసంలో కలిశారు. ఏపీలో నెలకొల్పే 13 కేంద్ర విద్యా సంస్థలకు భూమి కేటాయింపులు పూర్తి చేసినందున, వాటిని త్వరగా ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని బాబు కోరారు. సమావేశంలో ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎం కార్యదర్శులు అజయ్ సహానీ, గిరిధర్ కూడా పాల్గొన్నారు.