scholarships Scam
-
Scholarship Scam: మైనారిటీ స్కాలర్షిప్.. భారీ కుంభకోణం
న్యూఢిల్లీ: మైనారిటీల్లోని పేద కుటుంబాల పిల్లలకు అందాల్సిన ఉపకార వేతనాలు భారీగా పక్కదారి పట్టాయి. అనర్హులు వాటిని కాజేశారు. ఏళ్లుగా అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ దందాకు వివిధ స్థాయిల్లో నోడల్ అధికారులు కొమ్ముకాశారు. స్కాలర్షిప్ పథకానికి ఆమోదం పొందిన విద్యా సంస్థల్లో 53 శాతం నకిలీవని తాజాగా తేలింది. అయిదేళ్లలో రూ.144.83 కోట్లు అనర్థులు జేబుల్లో వేసినట్లు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంతర్గత విచారణలో వెల్లడైంది. దీంతో, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఈ అక్రమాలపై కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ జూలై 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ శాఖ అంతర్గత విచారణ జరిపిన 1,572 విద్యా సంస్థల్లో 830 వరకు బోగస్‌వేనని గుర్తించారు. ప్రస్తుతానికి 830 విద్యాసంస్థల బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నకిలీ ఆధార్ కార్డులు, కేవైసీ పత్రాలతో లబ్ధిదారులకు బోగస్ అకౌంట్లను బ్యాంకులు ఎలా ఇచ్చాయనే దానిపైనా దృష్టి సారించనుంది. రాష్ట్రాల వారీగా అక్రమాలు.. ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలోని పరిశీలన జరిపిన మొత్తం 62 విద్యాసంస్థలూ బోగస్‌వే. రాజస్తాన్: పరిశీలన జరిపిన 128 విద్యాసంస్థల్లో 99 నకిలీవి. అస్సాం: రాష్ట్రంలోని స్కాలర్షిప్ అందుకుంటున్న మొత్తం విద్యా సంస్థల్లో 68శాతం ఉత్తుత్తివే. కర్ణాటక: కర్ణాటకలోని 64 శాతం విద్యాసంస్థలు బోగస్‌వి. ఉత్తరప్రదేశ్: 44 శాతం విద్యాసంస్థలు నకిలీవి. పశ్చిమబెంగాల్: 39 శాతం సంస్థలు నకిలీవి. పక్కదారి పలు విధాలు ► కేరళలోని మలప్పురంలో ఒక బ్యాంకు శాఖలో 66 వేల స్కాలర్షిప్పులు పంపిణీ అయ్యాయి. ఇక్కడ రిజిస్టరయిన మైనారిటీ విద్యార్థుల కంటే ఉపకారవేతనాలు తీసుకున్న వారి సంఖ్యే ఎక్కువ. ► జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌కు చెందిన ఒక కాలేజీలో 5 వేల మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 7 వేల మంది స్కాలర్షిప్పులు అందుకున్నారు. తొమ్మిదో తరగతి చదువుకుంటున్న 22 మంది విద్యార్థులకు ఒకే మొబైల్ నంబర్ ఒక్క తండ్రి పేరుతోనే రిజిస్టరయి ఉంది. మరో విద్యాసంస్థకు అనుబంధంగా హాస్టల్ లేకున్నా విద్యార్థులందరూ స్కాలర్షిప్ పొందారు. ► అస్సాంలో.. ఒక బ్యాంక్ బ్రాంచిలో 66 వేల మంది స్కాలర్షిప్ లబ్ధిదారులున్నారు. సంబంధిత మదర్సాకు వెళ్లి పరిశీలనకు యత్నించగా నిర్వాహకులు అధికారులను బెదిరింపులకు గురిచేశారు. ► పంజాబ్‌లో.. స్కూల్లో పేరు నమోదు చేయించుకోని మైనారిటీ విద్యార్థులు సైతం ఉపకారవేతనాలు అందుకున్నారు. -
ఉపకారం..అందనంత దూరం!
కర్నూలు, ఆళ్లగడ్డ: స్వయం సహాయక సంఘాల సభ్యుల పిల్లలకు ఉపకారవేతనాల పంపిణీ కార్యక్రమం అటకెక్కింది. నాలుగేళ్ల క్రితం వరకు ఆమ్ ఆద్మీ బీమా యోజన, అభయ హస్తం, జనశ్రీ బీమా యోజన పేరుతో ప్రతి ఏటా ఆగస్టులో స్కాలర్షిప్లు ఇచ్చేవారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా పథకాలను చంద్రన్న బీమా కిందకు తీసుకొచ్చారు కానీ అమలు చేయడం లేదు. ఏటా ప్రీమియం చెల్లిస్తున్న పొదుపు మహిళలు మాత్రం తమ పిల్లలకు స్కాలర్షిప్లు ఎప్పుడు ఇస్తారోనని ఎదురుచూస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో పొదుపు మహిళల పిల్లలకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం మొదలైంది. నాటి నుంచి 2014 వరకు ఈ కార్యక్రమం సక్రమంగా సాగింది. ఆమ్ఆద్మీ, జనశ్రీ బీమా యోజన (ప్రస్తుతం చంద్రన్న బీమా) పథకం కింద లబ్ధిదారులు ఏడాదికి రూ. 115 చొప్పున కమ్యూనిటీ మేనేజ్డ్ మైక్రో ఇన్సూరెన్స్‌కు ప్రీమియం చెల్లించాలి. అభయ హస్తం పథకంలో ఉన్నవారు ఏడాదికి రూ. 385 చెల్లించాలి. అలా చెల్లించిన వారి పిల్లలకు ఏడాదికి రూ. 1200 చొప్పున స్కాలర్షిప్లు ఇస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు ఇందుకు అర్హులు. నాలుగేళ్లుగా ఎదురుచూపు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ బీమా , అభయహస్తంను చంద్రన్న బీమాలోకి విలీనం చేశారు. ఏటా జిల్లా వ్యాప్తంగా 1,18,780 మంది పొదుపు మహిళలు ప్రీమియం చెలిస్తున్నారు. అయితే, చదువు కుంటున్న వీరి పిల్లలకు ఇప్పటి వరకు పైసా ఉపకార వేతనం అందలేదు. 2015 – 16, 2016 – 17, 2017 – 18 విద్యా సంవత్సరాలకు సంబంధించి ఇప్పటి వరకు మంజూరు కాలేదు. మరికొద్దిరోజులు గడిచితే 2018 – 19 విద్యా సంవత్సరం కూడా పూర్తవుతుంది. స్కాలర్షిప్లు మంజూరైతే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎంతో కొంత ఊరట లభించేది. సన్నగిల్లుతున్న ఆశలు పొదుపులో ఉన్న వారు ఎక్కువగా పేదలు. పనిచేస్తే కానీ పూటగడవదు. అలాంటి వీరు పిల్లలకు ఉపకారవేతనాలు వస్తే చదివించుకోవచ్చని ఆశించి ప్రీమియం చెలిస్తున్నారు. అయితే, వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లేలా వ్యవహరిస్తుంది. ఉపకారవేతనాలు మంజూరు చేస్తుందో లేదో అధికారులకు సైతం తెలియని పరిస్థితి. చాలా మంది మహిళలు ప్రతి రోజు పొదుపు సంఘాల లీడర్లు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో ఆమ్ ఆద్మీ బీమా యోజన కింద 22,794మంది, చంద్రన్న బీమా కింద 78,820 మంది, అభయహస్తం కింద 16,166 మంది ఉపకారవేతనాల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. సభ్యులకు సమాధానం చెప్పలేకపోతున్నాం నేను జనశ్రీ బీమా యోజన కింద ఒక్కో సభ్యురాలితో రూ. 115 లెక్కన 40 మంది, అభయ హస్తం కింద రూ. 385 ప్రకారం 15 మంది, ఆమ్ఆద్మీ బీమా కింద రూ. 115 ప్రకారం 20 మందితో ప్రీమియం వసూలు చేసి కార్యాలయంలో చెల్లించా. 5 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా చెల్లిస్తూనే ఉన్నాం. ఇంతవరకు ఒక్క సభ్యురాలికి కూడా పైసా రాలేదు. ఎందుకు రావడం లేదని సభ్యులు అడిగితే సమాధానం చెప్పలేక పోతున్నాం. అధికారులను అడిగితే తెలియదంటున్నారు.– ప్రమీల, ఐక్య సంఘం లీడర్ -
ఉపకారానికి ‘ఐఎఫ్ఎస్సీ’ బ్రేకులు
సాక్షి, హైదరాబాద్ : పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాల పంపిణీలో కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యాయి. 2016–17, 2017–18 విద్యా సంవత్సరాలకు చెందిన ఉపకారవేతన నిధులను ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు. ఈక్రమంలో వాటిని విద్యార్థుల ఖాతాకు ఆన్లైన్ ద్వారా బదిలీ చేస్తుం డగా మెజారిటీ ఖాతాలకు ఈ ప్రక్రియ విఫలమవుతోంది. దరఖాస్తు సమయంలో వివరాలన్నీ పూరిం చినప్పటికీ ఆన్లైన్ బదిలీల్లో విఫలం కావడం ఇబ్బందికరంగా మారుతోంది. లోపం ఎక్కడుందనే అంశంపై అధికారులు ఆరా తీయగా బ్యాంకుల ఐఎఫ్ ఎస్సీ కోడ్లలో తప్పులు దొర్లినట్లు గుర్తిం చారు. వాస్తవానికి విద్యార్థులంతా దరఖాస్తులప్పుడు సరైన కోడ్లే ఇచ్చినా బ్యాంకుల విలీనప్రక్రియతో అవి మారిపోయాయి. మెజారిటీ ఖాతాల న్నీ ఎస్బీఐలోనే రాష్ట్రంలో లీడ్ బ్యాంక్‌గా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కొనసాగుతోంది. గతం లో ఈ స్థానంలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) ఉండగా విలీనంతో ఇప్పుడు ఎస్బీఐ లీడ్ బ్యాంక్‌గా మారింది. దీంతో ఎస్బీహెచ్ శాఖల ఐఎఫ్ఎస్సీ కోడ్లు మారిపోయాయి. రాష్ట్రంలో మెజారిటీ విద్యార్థులు స్టేట్‌బ్యాంకు ఖాతాలనే తెరిచారు. పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఇతర బ్యాంకు ఖాతాలు తెరిచినప్పటికీ గ్రామీణ విద్యార్థులకు మాత్రం 91శాతం స్టేట్‌బ్యాంకు ఖాతాలే ఉన్నాయి. ఈక్రమంలో 2016–17 విద్యాసంవత్సరంలో ఫ్రెషర్స్, రెన్యువల్ విద్యార్థులు దరఖాస్తుల్లో నమోదు చేసిన స్టేట్‌బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్లు 78 శాతం మారిపోయాయి. అదేవిధంగా 2017–18 సంవత్సరంలో కోడ్లు మారినప్పటికీ విద్యార్థులకు అవగాహన లేక పాత వాటినే నమోదు చేశారు. ప్రస్తుతం 2016–17 విద్యా సంవత్సరం ఉపకారవేతన బకాయిలను సంక్షేమాధికారులు చెల్లింపులు చేస్తున్నారు. ఈమేరకు టోకెన్లు జనరేట్ చేసి ఖజానా శాఖకు పంపుతున్నారు. ఖజానా శాఖ అధికారులు బ్యాంకు ఖాతాలకు నగదును బదిలీ చేసే క్రమంలో ప్రక్రియ విఫలమవుతుండటంతో ఆయా ఫైళ్లను జిల్లా సంక్షేమాధికారులకు తిప్పి పంపిస్తున్నారు. ప్రస్తుతం 2016–17 సంవత్సరానికిగాను 3.75లక్షల మంది విద్యార్థులకు ఉపకార నిధులు పంపిణీ చేయాలి.అలాగే 2017–18 కి 7.58లక్షల మందికి చెల్లించాల్సి ఉంది. ఐఎఫ్ఎస్సీ కోడ్లు తప్పుగా ఉండటంతో ఆయా విద్యార్థులకు ఉపకారవేతనాల పంపిణీ సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. కోడ్లను సరిచేసుకున్న తర్వాతే పంపిణీ చేయనున్నారు. -
'సీబీసీఐడీతో విచారణ జరపాలి'
► రూ.కోట్లు మింగేసిన పెద్దలను పట్టుకోవాలి ► ఉపకార వేతనాలపై ఎమ్మెల్యే కళావతి శ్రీకాకుళం: కోట్లాది రూపాయల ఉపకార వేతనాలను కాజేసిన పెద్దలను పట్టుకోవాలని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి డిమాండ్ చేశారు. మండలంలోని వడ్డంగి, నులకజోడు, చిన్నదిమిలి గ్రామాల్లో ఆమె ఆదివారం పర్యటించారు. ప్రజా సమస్యలు గుర్తించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2009 సంవత్సరం నుంచి జిల్లాలో ఉపకారవేతనాల స్వాహాకు తెరలేచిందన్నారు. దీనిపై సీబీసీఐడీ విచారణ జరపాలని కోరారు. కుంభకోణంతో సంబంధమున్న చాలామంది పెద్దలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారన్నారు. వారిని బయటకు లాగాలన్నారు. చిరుద్యోగులను బలిచేసి బడాబాబులను వదిలేయడం విచారణ అధికారులకు తగదన్నారు. కరువు నిరసనకు పిలుపు వర్షాభావంతో జిల్లాలో కరువు తాండవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. అక్రమాలకు తావిస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తోందన్నారు. కరువు సాయం అందజేసేవరకు పోరాటం సాగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాగునీటి వెతలు తీర్చాలని అధికారులను నిలదీయాలని కోరారు. చివరిగా నులకజోడుకు చెందిన పి.శ్రీనివాసరావు మృతిచెందడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్నదిమిలిలో మాతృవియోగం పొందిన ఆర్ఐ ఎస్.రాంబాబును పరామర్శించారు. ఆమె వెంట మనుమ కొండ ఎంపీటీసీ సభ్యురాలు బోదెపు స్వాతి, వైఎస్సార్ సీపీ మండలాధ్యక్షుడు తోట సింహాచలం, సహకార డెరైక్టర్ బోదెపు రఘుపతినాయుడు, రైతు విభాగం అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు, ఎస్టీ సెల్ కార్యదర్శి పి.శ్రీను, మాజీ సర్పంచ్ అర్లిరాజు, కిల్లాన భూషణరావు, నీటి సంఘ అధ్యక్షుడు ఎస్.విశ్వనాథం, వలరౌతు పాపినాయుడు, ఏఎంసీ మాజీ చెర్మైన్ కె.చిరంజీవి, బి.ధర్మారావులు ఉన్నారు. -
ఇక అరెస్టుల పర్వం
శ్రీకాకుళం టౌన్ :జిల్లాను కుదిపేసిన సంక్షేమ శాఖల స్కాలర్‌షిప్పుల కుంభకోణం దర్యాప్తు చివరి దశకు చేరుకుంది. నిధులు దారి మళ్లించిన ఉద్యోగులను నిందితుల జాబితాలో చేర్చేందుకు అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రంగరాజు ప్రభుత్వం అనుమతి పొందారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం వాస్తవ నివేదికను ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులకు, ఏసీబీ డైరక్టరు జనరల్‌కు పంపించారు. నిందితుల అరెస్టుకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. జిల్లాలో ఎక్కువగా బీసీ జనాభా ఉండటంతో విద్యార్థుల సంక్షేమానికి ఏటా రూ.76 కోట్ల బడ్జెట్ ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ మొత్తం నుంచే ఇంటర్మీడియెట్ నుంచి ఉన్నత విద్య వరకు స్కాలర్‌షిప్‌లతోపాటు డైట్ బిల్లులు, బోధన ఫీజులు చెల్లిస్తున్నారు. 2009 నుంచి ఏటా విడతల వారీగా నిధులు విద్యార్థులకు చేరకుండా, సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు దారి మళ్లిస్తున్నారు. విడతల వారీగా రూ.1.18 కోట్లు బ్యాంక్ ఖాతాల నుంచి డ్రా చేశారు. ఈ వ్యవహారం ఎట్టకేలకు బయటపడింది. ఈ కుంభకోణంపై దృష్టి సారించిన ఏసీబీ అధికారులు గత పది రోజులుగా రేయింబవళ్లు శ్రమించి దోషులను గుర్తించారు. జిల్లా అధికారులనూ ప్రశ్నించే అవకాశం? ఈ వ్యవహారంలో భాగస్వాములైన గిరిజన సంక్షేమ శాఖ వార్డెన్లను శనివారం ఏసీబీ అధికారులు విచారించారు. అనంతరం పాలకొండ పట్టణంలోని ఓంసాయి కళాశాల ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరరావును కూడా శ్రీకాకుళం పిలిపించి సాయంత్రం వరకు విచారించారు. గిరిజన సంక్షేమ శాఖ నుంచి ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న ఏటీడబ్ల్యూఓ ఎర్రంనాయుడుతోపాటు నిధులు మళ్లింపులో కీలకపాత్ర పోషించిన అజయ్‌కుమార్ ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బీసీ సంక్షేమ శాఖ నుంచి నిధులు మళ్లింపులో బాధ్యులను గుర్తిస్తున్నారు. ఈ స్కాంలో బాధ్యులను ఒకటి రెండు రోజుల్లో అరెస్టు చేసే అవకాశం ఉంది. బీసీ సంక్షేమ శాఖ నుంచి జిల్లా అధికారులు బి.రవిచంద్ర, లజపతిరాయ్, అంతకుముందు పనిచేసిన అధికారులను కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఆ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బాలరాజు సస్పెండ్ చేసిన నాటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. పోలీసుల ఉదాసీనత స్కాలర్‌షిప్పుల కుంభకోణం కేసులో జిల్లా పోలీస్ యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం వన్ టౌన్ పోలీస్టేషన్ పరిధిలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరక్టర్ ఎం.వి.వి నాయక్ ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం ఏటీడబ్ల్యూఓ ఎర్రన్నాయుడుతోపాటు వార్డెన్ ఝాన్సీరాణిపై ఆయన ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఇంతవరకు ఎటువంటి పురోగతి కనిపించ లేదు. పాలకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో ముగ్గురు వార్డెన్లపై డీడీ నాయక్ ఫిర్యాదు చేశారు. వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు కేసు నమోదు కాలేదు. పోలీనుల వైఖరిపై జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఉన్నత స్థాయిలో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. -
అవినీతి మూలాలపై ఏసీబీ ఆరా
శ్రీకాకుళం టౌన్/పాతబస్టాండ్: జిల్లాలో ఉపకార వేతనాల కుంభకోణంలో మూలాలను తెలుసుకునేందుకు ఏసీబీ అధికారులు లోతైన విచారణ ఆరంభించారు. జిల్లాకు చేరుకున్న మాజీ బీసీ సంక్షేమ శాఖాధికారి బి.రవిచంద్రను ఏసీబీ కార్యాలయంలో డీఎస్పీ రంగరాజు బుధవారం విచారించారు. విద్యార్థులకు మంజూరుచేసిన ఉపకారవేతనాలను వారి ఖాతాలకు ఎలా మళ్లిస్తారని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ప్రైవేటు ఖాతాలకు ఎలా వెళ్లాయని ప్రశ్నించారు. అలాగే, గిరిజన సంక్షేమ శాఖ నుంచి గిరిజన పోస్టు మెట్రిక్ వసతిగృహాల్లో బీసీ విద్యార్థుల జాబితాలు లేకుండా బీసీ సంక్షేమశాఖ పరిధిలో బిల్లులు ఎలా చెల్లించారని, శాఖాపరంగా ఉన్న లోపాలను సరిదిద్దడంలో ఎదురైన సమస్యలను గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టురుగా ఉన్న ఎంవీ వీ నాయక్‌ను ప్రశ్నించి తెలుసుకున్నారు. గిరిజన వసతిగృహాల్లో ఉన్న 3శాతం విద్యార్థుల వివరాలను బీసీ సంక్షేమ శాఖకు పంపించక పోవడానికి గల కారణాల ను అడిగితెలుసుకున్నారు. తనిఖీలు చేయకపోవడం పై ఆరా తీశారు. ఆర్థిక లావాదేవీలు గిరిజనసంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు తెలియకుండానే వార్డెన్లు ఎలా తీసుకున్నారని ప్రశ్నించినట్టు తెలిసింది. బీసీ సంక్షేమ శాఖ, ప్రైవేటు కాలేజీల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలను పరిశీలించాలని భావిస్తున్న ఏసీబీ అధికారులు ఇప్పటికే కొందరి ఖాతాలను పరిశీలించారు. రికార్డుల పరిశీలనకు నిర్ణయం బీసీ సంక్షేమ శాఖ పరిధిలో పని చేస్తున్న పోస్టు మెట్రిక్ వసతి గృహాల్లో 2009 నుంచి జరిపిన ఆర్థిక లావాదేవీ లు, రికార్డులను పరిశీలించేందుకు ఏసీబీ అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా పోస్టుమె ట్రిక్ కాలేజీ వసతిగృహాల రికార్డులను మూడు రోజుల్లోగా అందజేయాలని వార్డెన్లకు ఆదేశిం చారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 2009 నుం చి మంజూరైన డైట్ బిల్లులతో పాటు ఉపకారవేతనాల మంజూరును పరిశీలించనున్నారు. బ్యాంకు ఖాతాలపై ఆంక్షలు ఉపకార వేతనాల మంజూరులో అక్రమాలపై జరుగుతున్న విచారణ నేపథ్యంలో గిరిజన సంక్షేమ వసతిగృహ అధికారుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశామని ఐటీడీఏ పీవో జె.వెంకటరావు తెలిపారు. వార్డెన్ల ఖాతాల్లో మూడేళ్లుగా జరిగిన లావాదేవీల వివరాలను సంబంధిత బ్యాంకుల సమన్వయంతో మధింపు చేస్తున్నామన్నారు. అనుమానిత పోస్టుమెట్రిక్ వసతి గృహాల ఆన్లైన్ ఈ-పాస్ ఉపకా ర వేతనాల స్టేట్మెంట్లను పరిశీలిస్తున్నట్టు వెల్లడించా రు. ప్రాథమిక నిర్ధారణ అనంతరం శ్రీకాకుళం పోస్టు మెట్రిక్ వసతి గృహ సంక్షేమాధికారి ఎస్.ఝాన్సీరాణి, సహాయ గిరిజన సంక్షేమాధికారి బి.ఎర్నన్నాయుడుపై శ్రీకాకుళం 1వ పట్టణ పోలీసు స్టేషన్లో క్రిమినల్ కేసుల నమోదయ్యాయన్నారు. ఝాన్సీ రాణిని సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. -
స్కాలర్షిప్ స్కాం లెక్క తేలింది
శ్రీకాకుళం టౌన్/పాతబస్టాండ్ : సంక్షేమ శాఖలను కుదిపేసిన స్కాలర్ షిప్పుల స్కాం లెక్కతేలింది. అవినీతి నిరోధక శాఖ సోధా చివరిదశకు చేరింది. పక్కదారిపట్టిన స్కాలర్‌షిప్పుల వివరాల నిర్థారణ దాదాపు పూర్తయింది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ నుంచి దారిమళ్లిన నిధుల్లో రూ.1.18కోట్లు ఇప్పటికే చేతులు మారినట్టు గుర్తించారు. ఇంకా బ్యాంకు ఖాతాల్లో మరో రూ.74లక్షలు మిగిలింది. ఈనిధులు డ్రా చేయకుండానే స్కాం బయటపడింది. దీంతో ఆ నిధులను కాపాడగలిగారు. బిల్లు జనరేట్ అయి మరో రూ.60లక్షలు అర్థాంతరంగా నిలిచిపోయిందని తేల్చారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో మంగళవారం అవినీతినిరోధక శాఖ అధికారులు సోదాలు జరిపారు. డీఎస్పీ రంగరాజు బృందం పరిశీలన జరిపింది. ముందుగా ఆ శాఖ ఇన్చార్జి అధికారి ధనుంజయరావు, సూపరెండెంట్లు రవికుమార్, మూర్తి, సీనియర్ అసిస్టెంటు పార్వతి, జూనియర్ అసిస్టెంట్ నారాయణరావు, శేఖర్, అరుణ్, కంప్యూటర్ ఆపరేటర్లను విడివిడిగా ప్రశ్నించారు. ఆతర్వాత కార్యాలయంలోని కంప్యూటర్ డేటాను పరిశీలించారు. ఆన్లైన్ పత్రాలను పరిశీలించారు. సాయంత్రం వరకు ఈపరిశీలన కొనసాగింది. సంక్షేమ శాఖలో దారిమళ్లిన స్కాలర్షిప్పులన్నీ హాస్టల్ మెస్ బిల్లులుగా చూపడంతో 20వేల మంది విద్యార్థులకు స్కాలర్షిప్పులు అందకుండా పోయాయి. విద్యార్థుల చేరాల్సిన రూ.3500 కూడా మెస్ బిల్లుల ఖాతాలో వేసుకుని డ్రా చేసిన తర్వాత తిరిగి విద్యార్థుల ఖాతాలకు జమ చేసేవారు. ఎక్కువ మంది ఉన్నత తరగతులకు వెళ్లిపోవడంతోవారి అకౌం ట్లకు నిధులు చెల్లించకుండా మింగేశారు. విద్యార్థుల్లో 1420మంది బ్యాంకు ఖాతాలకు మాత్రం మొదట విడత రూ1050 వంతున జమ చేశారు. మిగిలిన 18వేల మందిఖాతాలకు మొత్తాలు జమచేయకుండానే మింగేశారు. మరో నలుగురు వార్డెన్లపై క్రమశిక్షణాచర్యలు? గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పోస్టు మెట్రిక్ హానరరీ డైరక్టర్లుగా వ్యవహరిస్తున్న వారిలో మరో నలుగురిపై వేటు వేయాలని జిల్లా కలెక్టరు డా.పిలక్ష్మీనృసింహం ఆదేశించారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో పాలకొండ వార్డెన్ గేదెల వెంకటనాయుడు, శ్రీకాకుళం పోస్టు మెట్రిక్ హాస్టల్ వార్డెన్ ఝాన్సీరాణి ఇప్పటికే సస్పెండయ్యారు. నిధులు బదలాయింపునకు అంగీకరించిన మరో నలుగురు వార్డెన్లపై క్రమ శిక్షణ చర్యలకు రంగం సిద్దమైంది. వారిఖాతాల్లో రూ.66లక్షలకు సంబంధించి డ్రా చేయక పోయినా ముందుగా ఉన్నతాధికార్లకు తెలియజేయకుండా గోప్యంగా ఉండడాన్ని తప్పుపడుతూ ప్రధాన సూత్రదారులతో చేతులు కలిపినట్టు అభియోగం మోపారు. ఇందుకు బాధ్యులైన వార్డెన్లపై చర్యతీసుకోవాలని ఐటీడీఏ పీఓను ఆదేశించారు. పరారీలో అజయ్‌కుమార్ స్కాంలో సూత్రధారి అజయ్‌కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సుమారు రూ.రెండుకోట్ల స్కాలర్‌షిప్పులను దారిమళ్లించడానికి కీలక పాత్ర పోషించినట్టు చెపుతున్న అజయ్‌కుమార్ శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం బుక్కూరు గ్రామ వాసి. సంక్షేమ శాఖల ఉద్యోగులతో సంబంధాలు పెట్టుకున్న అజయ్‌కుమార్‌కు పోలీసుశాఖలోనూ స్నేహితులు ఉన్నారు.