ఇక అరెస్టుల పర్వం | Welfare departments, scholarships scam | Sakshi
Sakshi News home page

ఇక అరెస్టుల పర్వం

Published Sat, Apr 30 2016 11:34 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

Welfare departments, scholarships scam

 శ్రీకాకుళం టౌన్ :జిల్లాను కుదిపేసిన సంక్షేమ శాఖల స్కాలర్‌షిప్పుల కుంభకోణం దర్యాప్తు చివరి దశకు చేరుకుంది. నిధులు దారి మళ్లించిన ఉద్యోగులను నిందితుల జాబితాలో చేర్చేందుకు అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రంగరాజు ప్రభుత్వం అనుమతి పొందారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం వాస్తవ నివేదికను ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులకు, ఏసీబీ డైరక్టరు జనరల్‌కు పంపించారు. నిందితుల అరెస్టుకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది.
 
 జిల్లాలో ఎక్కువగా బీసీ జనాభా ఉండటంతో విద్యార్థుల సంక్షేమానికి ఏటా రూ.76 కోట్ల బడ్జెట్ ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ మొత్తం నుంచే ఇంటర్మీడియెట్ నుంచి ఉన్నత విద్య వరకు స్కాలర్‌షిప్‌లతోపాటు డైట్ బిల్లులు, బోధన ఫీజులు చెల్లిస్తున్నారు.  2009 నుంచి ఏటా విడతల వారీగా నిధులు విద్యార్థులకు చేరకుండా, సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు దారి మళ్లిస్తున్నారు. విడతల వారీగా రూ.1.18 కోట్లు బ్యాంక్ ఖాతాల నుంచి డ్రా చేశారు. ఈ వ్యవహారం ఎట్టకేలకు బయటపడింది. ఈ కుంభకోణంపై దృష్టి సారించిన ఏసీబీ అధికారులు గత పది రోజులుగా రేయింబవళ్లు శ్రమించి దోషులను గుర్తించారు.
 
 జిల్లా అధికారులనూ ప్రశ్నించే అవకాశం?
 ఈ వ్యవహారంలో భాగస్వాములైన గిరిజన సంక్షేమ శాఖ వార్డెన్లను శనివారం ఏసీబీ అధికారులు విచారించారు. అనంతరం పాలకొండ పట్టణంలోని ఓంసాయి కళాశాల ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరరావును కూడా శ్రీకాకుళం పిలిపించి సాయంత్రం వరకు విచారించారు. గిరిజన సంక్షేమ శాఖ నుంచి ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న ఏటీడబ్ల్యూఓ ఎర్రంనాయుడుతోపాటు నిధులు మళ్లింపులో కీలకపాత్ర పోషించిన అజయ్‌కుమార్ ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బీసీ సంక్షేమ శాఖ నుంచి నిధులు మళ్లింపులో బాధ్యులను గుర్తిస్తున్నారు. ఈ స్కాంలో బాధ్యులను ఒకటి రెండు రోజుల్లో అరెస్టు చేసే అవకాశం ఉంది. బీసీ సంక్షేమ శాఖ నుంచి జిల్లా అధికారులు బి.రవిచంద్ర, లజపతిరాయ్, అంతకుముందు పనిచేసిన అధికారులను కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఆ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బాలరాజు సస్పెండ్ చేసిన నాటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.
 
  పోలీసుల ఉదాసీనత
 స్కాలర్‌షిప్పుల కుంభకోణం కేసులో జిల్లా పోలీస్ యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం వన్ టౌన్ పోలీస్టేషన్ పరిధిలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరక్టర్ ఎం.వి.వి నాయక్ ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం ఏటీడబ్ల్యూఓ ఎర్రన్నాయుడుతోపాటు వార్డెన్ ఝాన్సీరాణిపై ఆయన ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఇంతవరకు ఎటువంటి పురోగతి కనిపించ లేదు. పాలకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో ముగ్గురు వార్డెన్లపై డీడీ నాయక్ ఫిర్యాదు చేశారు. వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు కేసు నమోదు కాలేదు. పోలీనుల వైఖరిపై జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఉన్నత స్థాయిలో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement