శ్రీకాకుళం టౌన్/పాతబస్టాండ్ : సంక్షేమ శాఖలను కుదిపేసిన స్కాలర్ షిప్పుల స్కాం లెక్కతేలింది. అవినీతి నిరోధక శాఖ సోధా చివరిదశకు చేరింది. పక్కదారిపట్టిన స్కాలర్‌షిప్పుల వివరాల నిర్థారణ దాదాపు పూర్తయింది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ నుంచి దారిమళ్లిన నిధుల్లో రూ.1.18కోట్లు ఇప్పటికే చేతులు మారినట్టు గుర్తించారు. ఇంకా బ్యాంకు ఖాతాల్లో మరో రూ.74లక్షలు మిగిలింది. ఈనిధులు డ్రా చేయకుండానే స్కాం బయటపడింది. దీంతో ఆ నిధులను కాపాడగలిగారు.
బిల్లు జనరేట్ అయి మరో రూ.60లక్షలు అర్థాంతరంగా నిలిచిపోయిందని తేల్చారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో మంగళవారం అవినీతినిరోధక శాఖ అధికారులు సోదాలు జరిపారు. డీఎస్పీ రంగరాజు బృందం పరిశీలన జరిపింది. ముందుగా ఆ శాఖ ఇన్‌చార్జి అధికారి ధనుంజయరావు, సూపరెండెంట్లు రవికుమార్, మూర్తి, సీనియర్ అసిస్టెంటు పార్వతి, జూనియర్ అసిస్టెంట్ నారాయణరావు, శేఖర్, అరుణ్, కంప్యూటర్ ఆపరేటర్లను విడివిడిగా ప్రశ్నించారు. ఆతర్వాత కార్యాలయంలోని కంప్యూటర్ డేటాను పరిశీలించారు. ఆన్‌లైన్ పత్రాలను పరిశీలించారు. సాయంత్రం వరకు ఈపరిశీలన కొనసాగింది.
సంక్షేమ శాఖలో దారిమళ్లిన స్కాలర్‌షిప్పులన్నీ హాస్టల్ మెస్ బిల్లులుగా చూపడంతో 20వేల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు అందకుండా పోయాయి. విద్యార్థుల చేరాల్సిన రూ.3500 కూడా మెస్ బిల్లుల ఖాతాలో వేసుకుని డ్రా చేసిన తర్వాత తిరిగి విద్యార్థుల ఖాతాలకు జమ చేసేవారు. ఎక్కువ మంది ఉన్నత తరగతులకు వెళ్లిపోవడంతోవారి అకౌం ట్లకు నిధులు చెల్లించకుండా మింగేశారు. విద్యార్థుల్లో 1420మంది బ్యాంకు ఖాతాలకు మాత్రం మొదట విడత రూ1050 వంతున జమ చేశారు. మిగిలిన 18వేల మందిఖాతాలకు మొత్తాలు జమచేయకుండానే మింగేశారు.
మరో నలుగురు వార్డెన్లపై క్రమశిక్షణాచర్యలు?
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పోస్టు మెట్రిక్ హానరరీ డైరక్టర్లుగా వ్యవహరిస్తున్న వారిలో మరో నలుగురిపై వేటు వేయాలని జిల్లా కలెక్టరు డా.పిలక్ష్మీనృసింహం ఆదేశించారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో పాలకొండ వార్డెన్ గేదెల వెంకటనాయుడు, శ్రీకాకుళం పోస్టు మెట్రిక్ హాస్టల్ వార్డెన్ ఝాన్సీరాణి ఇప్పటికే సస్పెండయ్యారు. నిధులు బదలాయింపునకు అంగీకరించిన మరో నలుగురు వార్డెన్లపై క్రమ శిక్షణ చర్యలకు రంగం సిద్దమైంది. వారిఖాతాల్లో రూ.66లక్షలకు సంబంధించి డ్రా చేయక పోయినా ముందుగా ఉన్నతాధికార్లకు తెలియజేయకుండా గోప్యంగా ఉండడాన్ని తప్పుపడుతూ ప్రధాన సూత్రదారులతో చేతులు కలిపినట్టు అభియోగం మోపారు.
ఇందుకు బాధ్యులైన వార్డెన్లపై చర్యతీసుకోవాలని ఐటీడీఏ పీఓను ఆదేశించారు.
పరారీలో అజయ్‌కుమార్
స్కాంలో సూత్రధారి అజయ్‌కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సుమారు రూ.రెండుకోట్ల స్కాలర్‌షిప్పులను దారిమళ్లించడానికి కీలక పాత్ర పోషించినట్టు చెపుతున్న అజయ్‌కుమార్ శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం బుక్కూరు గ్రామ వాసి. సంక్షేమ శాఖల ఉద్యోగులతో సంబంధాలు పెట్టుకున్న అజయ్‌కుమార్‌కు పోలీసుశాఖలోనూ స్నేహితులు ఉన్నారు.
స్కాలర్‌షిప్ స్కాం లెక్క తేలింది
Published Wed, Apr 27 2016 12:17 AM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM