ఉతప్ప అనూహ్య నిర్ణయం
న్యూఢిల్లీ: సొంత టీమ్ కర్ణాటకతో 15 ఏళ్లు అనుబంధాన్ని క్రికెటర్ రాబిన్ ఉతప్ప తెంచుకోనున్నాడు. హోమ్ టీమ్‌ను వీడాలని నిర్ణయించుకోవడంతో అతడికి కర్ణాటక క్రికెట్ సంఘం(కేఎస్‌సీఏ) నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) ఇచ్చింది. ఇక అతడు వేరే రాష్ట్ర జట్టుకు ఆడినా ఇబ్బంది ఉండదు. రానున్న రంజీ సీజన్లో వేరే జట్టుకు ఆడనున్నాడు.
ఉతప్ప నిర్ణయానికి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని కేఎస్‌సీఏ కార్యదర్శి సుధాకర్‌రావు తెలిపారు. ‘ ఉతప్ప నిర్ణయం బాధాకరం. ఏ జుట్టుకు ఆడినా అతడు బాగా రాణించాలని కోరుకుంటున్నాం. అండర్-14 స్థాయి నుంచి కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. వేరే టీమ్ తరపున ఆడేందుకు అతడు ఉత్సాహం చూపించాడు. మేము అతడి నిర్ణయానికి అడ్డుచెప్పలేద’ని సుధాకర్‌రావు అన్నారు. గత వారమే అతడికి ఎన్‌వోసీ ఇచ్చినట్టు వెల్లడించారు.
31 ఏళ్ల ఉతప్ప 130 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 46 వన్డేలు, 13 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అతడు ఏ రాష్ట్ర జట్టు తరపున ఆడేది ఇంకా స్పష్టం కాలేదు. రెండు రాష్ట్రాలు అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సుధాకర్‌రావు వెల్లడించారు. కేరళ తరపున ఉతప్ప ఆడే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.