టీమిండియా మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై సంచలన ఆరోపణలు చేశాడు. టీమిండియా మాజీ ఆటగాడు, ఆంధ్ర ప్లేయర్ అంబటి రాయుడు అంటే విరాట్ కోహ్లికి నచ్చేది కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ కారణంగానే రాయుడు 2019 వన్డే వరల్డ్‌కప్ జట్టు నుంచి చివరి నిమిషంలో తప్పించబడ్డాడని అన్నాడు. వరల్డ్‌కప్‌కు సంబంధించిన కిట్‌బ్యాగ్‌లు, బట్టలు, సూట్‌లు రాయుడు ఇంటికి చేరాయని, ఆతర్వాత కోహ్లి జోక్యం చేసుకోవడంతో రాయుడుకు వరల్డ్‌కప్ బెర్త్ దక్కలేదని బాంబు పేల్చాడు.
కోహ్లికి ఎవరైనా నచ్చకపోతే జట్టులో చోటు దక్కేది కాదని అన్నాడు. టీమిండియా కెప్టెన్‌గా కోహ్లి తీసుకున్న నిర్ణయాలను ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూ సందర్భంగా ఎండగట్టాడు. అంబటి రాయుడు విషయంలో కోహ్లి చాలా అన్యాయంగా ప్రవర్తించాడని దుయ్యబట్టాడు. రాయుడుకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని వాపోయాడు. రాయుడు వరల్డ్‌కప్ జట్టులో ఉంటానని ఎన్నో కలలు కన్నాడని, అలాంటి వ్యక్తికి చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు.
కాగా, 2019 వన్డే వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో అంబటి రాయుడును కాదని చివరి నిమిషంలో తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. విజయ్ శంకర్ త్రీడి ప్లేయర్ అని.. అందుకే రాయుడు స్థానంలో అతన్ని ఎంపిక చేశామని అప్పటి చీఫ్ సెలెక్టర్, తెలుగువాడు ఎంఎస్‌కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు. దీనిపై రాయుడు త్రీడి అద్దాలు పెట్టుకుని బహిరంగంగా తన అసంతృప్తికి వెల్లగక్కాడు.
కోహ్లితో పోలిస్తే రోహిత్ గ్రేట్ లీడర్
రాబిన్ ఉతప్ప కోహ్లి కెప్టెన్సీని రోహిత్ శర్మ కెప్టెన్సీతో కంపేర్ చేశాడు. కెప్టెన్‌గా నిర్ణయాలు తీసుకున్న తర్వాత వాటిని అమలు చేయడంలో కోహ్లికి రోహిత్ శర్మకు చాలా తేడా ఉందని అన్నాడు.
రాయుడుకు జరిగినట్టే 2024 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు ముందు సంజూ శాంసన్‌కు జరిగిందని గుర్తు చేశాడు. అయితే ఆ సందర్భంలో రోహిత్ సంజూ శాంసన్ దగ్గరికి వెళ్లి అతన్ని ఎందుకు పక్కకు పెట్టాల్సి వచ్చిందో స్పష్టంగా వివరించాడని తెలిపాడు. రోహిత్ సర్ది చెప్పాక శాంసన్ ఆ విషయాన్ని పెద్దగా పట్టంచుకోలేదని పేర్కొన్నాడు. ఇలాంటి విషయాలను హ్యాండిల్ చేయడంలో కోహ్లితో పోలిస్తే రోహిత్ చాలా బెటర్ అని కొనియాడాడు.
కాగా, 2024 వరల్డ్‌కప్ ఫైనల్లో సంజూ శాంసన్ ఆడాల్సి ఉండిది. అయితే చివరి నిమిషంలో శాంసన్ స్థానంలో శివమ్ దూబే తుది జట్టులోకి వచ్చాడు. ఫైనల్ మ్యాచ్ టాస్ తర్వాత రోహిత్ శాంసన్ దగ్గరికి పర్సనల్‌గా వెళ్లి అతన్ని ఎందుకు పక్కకు పెట్టాల్సి వచ్చిందో వివరించాడు. రోహిత్ వివరణ తర్వాత శాంసన్ కామ్ అయిపోయాడు. ఈ విషయంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
యువరాజ్ సింగ్ కెరీర్ ముగియడానికి కూడా కోహ్లినే కారణం..!
రాయుడు విషయాన్ని ప్రస్తావించడానికి ముందు ఉతప్ప కోహ్లికి వ్యతిరేకంగా సంచలన ఆరోపణలు చేశాడు. సిక్సర్ల వీరుడు, వన్డే, టీ20 వరల్డ్‌కప్ విన్నర్ యువరాజ్ సింగ్ కెరీర్ అర్దంతరంగా ముగిసిపోవడానికి కూడా కోహ్లినే కారణమని అన్నాడు. క్యాన్సర్‌పై విజయం సాధించిన అనంతరం యువరాజ్ కోహ్లి కోరుకున్నట్లు ఫిట్‌నెస్ సాధించలేకపోయాడని.. ఈ కారణంగానే కోహ్లి యువరాజ్‌కు మెల్లమెల్లగా చెక్ పెట్టాడని వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment