శ్రీలంకను చిత్తు చిత్తుగా కొడతాం: కోహ్లీ
వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి, మంచి ఊపుమీదున్న భారత యువ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. హైదరాబాద్లో జరిగే మూడో వన్డేలో కూడా శ్రీలంక జట్టును తుక్కు తుక్కుగా కొట్టడం ఖాయమని చెబుతున్నాడు. తాము ఆడే ప్రతి ఒక్క మ్యాచ్ విషయంలో అలాగే ఉంటామని స్పష్టం చేశాడు. అంబటి రాయుడు మూడో స్థానంలో బాగా ఆడుతున్నాడని, రాయుడిలో విభిన్న రకాల నైపుణ్యం ఉందని కోహ్లీ తెలిపాడు. అయితే.. రాయుడికి పదేళ్ల కిందే ఈ గుర్తింపు రావాల్సి ఉందని, మిడిలార్డర్లో రాయుడు బాగా ఆడగలడని చెప్పాడు. అంబటి రాయుడు బాగా ఆత్మవిశ్వాసంతో ఆడతాడని అన్నాడు.
పరిస్థితిని బట్టి ఆడటం కాకుండా.. ముందునుంచే విరుచుకుపడటానికే తాను ప్రాధాన్యం ఇస్తామన్నాడు. ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీసు చేయడానికి వచ్చిన రాయుడు.. అక్కడ మీడియాతో మాట్లాడాడు. భారీ విజయాలు సాధిస్తేనే జట్టుకు బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ రకమైన ఆకలినే అందరిలో కలిగించడం ద్వారా 2015 ప్రపంచకప్ కోసం సన్నాహాలు చేస్తున్నామని, ఇక మీదట ఆడే ప్రతి ఒక్క మ్యాచ్లోను ప్రత్యర్థిపై భారీ విజయాలు సాధించడమే తమ లక్ష్యమని అన్నాడు. ప్రతి మ్యాచ్ని తమజట్టు నాకౌట్ మ్యాచ్ లాగే భావిస్తోందని, ఏ ఒక్కదాంట్లో ఓడేందుకు సిద్ధంగా లేదని యువ సారథి తెలిపాడు.