
విరాట్ కోహ్లి (PC: IPL/BCCI)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో ఐదు జట్లకు కొత్త కెప్టెన్లు వచ్చారు. లక్నో సూపర్ జెయింట్స్‌కు రిషభ్ పంత్ (Rishabh Pant), పంజాబ్ కింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు అక్షర్ పటేల్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు రజత్ పాటిదార్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అజింక్య రహానే సారథ్యం వహించనున్నారు.
అయితే, వీరిలో రజత్ (Rajat Patidar), అక్షర్‌లకు ఐపీఎల్‌లో కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం లేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఈ ఇద్దరు కఠిన సవాళ్లు ఎదుర్కోబోతున్నారని టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. అయితే, వీరిద్దరిలో రజత్‌తో పోలిస్తే అక్షర్‌పై ఒత్తిడి కాస్త తక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
కోహ్లి సూపర్‌స్టార్‌డమ్‌తోనూ పోటీ
ఇందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ.. ‘‘అక్షర్ పటేల్, రజత్ పాటిదార్‌లను పోల్చి చూస్తే అక్షర్‌కు కాస్త వెసలుబాటు ఉంటుంది. జట్టు, సారథ్య బాధ్యతలు తీసుకోవడం కొత్తే అయినా.. కొంతమంది పాతవాళ్లు కూడా ఉండటం అక్షర్‌కు సానుకూలాంశం.
రజత్‌కు కూడా జట్టులో కొంతమంది ఆటగాళ్లతో గతంలో ఆడిన అనుభవం ఉంది. కానీ.. అతడు మిగతా విషయాలతో పాటు.. విరాట్ కోహ్లి సూపర్‌స్టార్‌డమ్‌తోనూ పోటీ పడాల్సి ఉంటుంది. అతడిపై కోహ్లి ప్రభావం కచ్చితంగా ఉంటుంది. కెప్టెన్సీ నైపుణ్యాలు మెరగుపరచుకునే క్రమంలో ఒక్కోసారి కోహ్లిపైనే ఆధారపడాల్సి ఉంటుంది.
కోహ్లి నీడలో కాకుండా..
అయితే, నాకు తెలిసి రజత్‌కు ఆర్సీబీ మేనేజ్‌మెంట్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉంటుందనిపిస్తోంది. కోహ్లి నీడలో కాకుండా.. రజత్ తన మార్కు చూపిస్తే బాగుంటుంది. ఏదేమైనా ఈసారి ఆర్సీబీ, కోల్‌కతా, ఢిల్లీ జట్లు తమ కొత్త కెప్టెన్లతో ఎలాంటి ఫలితాలు సాధిస్తాయో చూడాలని ఆతురతగా ఉంది.
ముఖ్యంగా రజత్‌పైనే ఎక్కువ మంది దృష్టి సారిస్తారు అనడంలో సందేహం లేదు. ఆర్సీబీకి ఉన్న క్రేజ్ అలాంటిది. ఈ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు.. కాబట్టి రజత్ ఆ రాతను మారుస్తాడో లేదో చూడాలి. దేశవాళీ క్రికెట్‌లో మధ్యప్రదేశ్ జట్టుకు విజయాలు అందించిన ఘనత అతడికి ఉంది.
అయితే, ఐపీఎల్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయడం అంత సులువేమీ కాదు’’ అని రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22న కోల్‌కతా- బెంగళూరు మధ్య మ్యాచ్‌తో మొదలుకానుంది.
ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టు
విరాట్ కోహ్లి, రజత్ పటిదార్, యశ్ దయాళ్, జోష్ హాజల్‌వుడ్, ఫిల్ సాల్ట్,జితేశ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, లియామ్ లివింగ్‌స్టోన్, రసిక్ ధార్, కృనాల్ పాండ్యా , టిమ్ డేవిజ్, జాకబ్ బెథెల్, సుయాశ్ శర్మ, దేవ్‌దత్ పడిక్కల్, తుషార, రొమరియో షెఫర్డ్, లుంగి ఎంగిడి, స్వప్నిల్ సింగ్, మనోజ్, మోహిత్ రాఠి, అభినందన్, స్వస్తిక్ చికార.
చదవండి: ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టం: హార్దిక్ పాండ్యా
Comments
Please login to add a commentAdd a comment