రాబిన్‌ ఊతప్పపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ | Robin Uthappa In Trouble As Arrest Warrant over PF Fraud allegations | Sakshi
Sakshi News home page

రాబిన్‌ ఊతప్పపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ

Published Sat, Dec 21 2024 2:48 PM | Last Updated on Sat, Dec 21 2024 3:42 PM

Robin Uthappa In Trouble As Arrest Warrant over PF Fraud allegations

టీమిండియా మాజీ క్రికెటర్‌ రాబిన్‌ ఊతప్ప చిక్కుల్లో పడ్డాడు. ఎంప్లాయి ప్రొవిడెంట్‌ ఫంఢ్‌(EPF) నిధుల మళ్లింపు కేసులో ఇరుక్కున్నాడు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బెంగళూరులో ఉన్న సెంటారస్‌ లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థకు ఊతప్ప డైరెక్టర్‌గా ఉన్నాడు.

రూ. 23 లక్షల మేర మోసం?
అయితే, ఈ కంపెనీ ఉద్యోగుల జీతం నుంచి పీఎఫ్‌ రూపంలో కట్‌ చేసిన రూ. 23 లక్షలను తిరిగి డిపాజిట్‌ చేయలేదు. ఈ విషయం తమ దృష్టికి రావడంతో ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌, రికవరీ ఆఫీసర్‌ అయిన శదక్షర గోపాలరెడ్డి చర్యలు చేపట్టారు. ఊతప్పపై అరెంస్ట్‌ వారెంట్‌ జారీ చేయాల్సిందిగా డిసెంబరు 4న తూర్పు బెంగళూరులోని పులకేశ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారులను ఆదేశించారు.

అయితే, ప్రస్తుతం రాబిన్‌ ఊతప్ప తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కేఎర్‌ పురం చిరునామాలో అతడు లేకపోవడంతో తాము ఊతప్పను అరెస్ట్‌ చేయలేకపోయినట్లు సంబంధిత పోలీస్‌ ఆఫీసర్‌ తెలిపారు. ప్రస్తుతం అతడు తమ స్టేషన్‌ పరిధిలో లేడన్న విషయాన్ని పీఎఫ్‌ ఆఫీస్‌ వర్గాలకు తెలియజేశామన్నారు.

దుబాయ్‌కు మకాం మార్చిన ఊతప్ప
కాగా రాబిన్‌ ఊతప్ప పులకేశినగర్‌లోని వీలర్‌ రోడ్‌లో గల అపార్టుమెంట్‌లో నివాసం ఉండేవాడు. అయితే, ఏడాది క్రితమే ఆ ఫ్లాట్‌ను ఖాళీ చేసినట్లు సమాచారం. ఇక పీఎఫ్‌ ఫ్రాడ్‌ కేసులో రాబిన్‌  ఊతప్పపై ఇంతవరకు అధికారికంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ చెప్పినట్లు ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ పేర్కొంది.

కర్ణాటకకు చెందిన రాబిన్‌ ఊతప్ప 2006- 2015 మధ్య టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ తన అంతర్జాతీయ కెరీర్‌లో 46 వన్డేలు, 13 టీ20 ఆడి.. ఆయా ఫార్మాట్లలో 934, 249 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 205 మ్యాచ్‌లు ఆడి 4952 రన్స్‌ సాధించాడు. కాగా రాబిన్‌ ఊతప్ప ఇటీవల జరిగిన హాంకాంగ్‌ సిక్సెస్‌ టోర్నీలో భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 

చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌ విధ్వంసకర శతకం.. శివం దూబే మెరుపు ఇన్నింగ్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement