అవినీతిని సహించను | peetala sujata warned to corruption officers | Sakshi
Sakshi News home page

అవినీతిని సహించను

Published Fri, Sep 26 2014 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 PM

peetala  sujata warned  to corruption officers

ఒంగోలు టౌన్ : ‘ఎన్‌వోసీలు లేకుండా యూనిట్లు నడపడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించొద్దు. ఎక్కడైనా అలాంటి యూనిట్లు నడుస్తుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటా. కిందిస్థాయి నుంచి అధికారుల పనితీరు గమనిస్తా.

గతంలో మాదిరిగా పరిస్థితులు ఉండవు. అవినీతికి ఏ రూపంలో పాల్పడినా సహించను’ అని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖామంత్రి పీతల సుజాత హెచ్చరించారు. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల గనులు, భూగర్భ వనరుల శాఖాధికారులతో స్థానిక సీపీవో కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం ఉదయం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. జోన్ పరిధిలో గనులు, భూగర్భ వనరులశాఖ ద్వారా ఈ ఏడాది 1,256 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా నిర్ణయించగా, మొదటి మూడు నెలల్లో 276 కోట్ల రూపాయలు వసూలు చేశారన్నారు.

 అధికారులంతా సమన్వయంతో పనిచేసి పూర్తిస్థాయిలో లక్ష్యాలు అధిగమించాలని ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో మినరల్స్ సమృద్ధిగా ఉన్నా ప్రభుత్వానికి ఆశించినంత ఆదాయం రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా 12 కోట్ల రూపాయలు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా 5 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేశారన్నారు.

జోన్‌లోని మిగిలిన జిల్లాలతో పోల్చితే నెల్లూరు జిల్లా ఆదాయపరంగా అట్టడుగు స్థానంలో ఉందని అసహనం వ్యక్తం చేశారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, సర్వేయర్ స్థాయి నుంచి సిబ్బంది, అధికారులంతా కష్టపడి పనిచేసి లక్ష్యాలు సాధించాలని ఆదేశించారు. కృష్ణపట్నం పోర్టు నుంచి 17 కోట్ల రూపాయల బకాయిలు వసూలు కావాల్సి ఉండగా, వారు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా, తాను హైదరాబాద్ వెళ్లిన తరువాత ఈ విషయాన్ని పరిశీలించి ఆ సంస్థకు నోటీసులు జారీ చేస్తానని మంత్రి పేర్కొన్నారు.

 లీజులు ప్రారంభించకుంటే రద్దు చేయాలి...
 మూడేళ్ల కంటే ముందు గనులు లీజుకు తీసుకుని ఇప్పటికీ ప్రారంభించని యూనిట్లను గుర్తించి రద్దు చేయాలని మంత్రి సుజాత ఆదేశించారు. వాటిని కొత్తవారికి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనధికార ఇసుక తవ్వకాలను అరికట్టాలని, పర్యావరణానికి హాని జరగకుండా చూడాలని చెప్పారు. గనుల శాఖలో సిబ్బంది కొరత తీర్చేందుకు ఔట్ సోర్సింగ్ ద్వారా నియామకాలకు అనుమతి ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. సమావేంలో కలెక్టర్ విజయకుమార్, పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు, గనులశాఖ ఉపసంచాలకుడు ప్రసాద్, మూడు జిల్లాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement