
సాక్షి, అమరావతి: ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి, అతని పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నప్పుడు, ఆ క్రిమినల్ కేసును సంబంధిత కోర్టు విచారణకు(కాగ్నిజెన్స్) స్వీకరించినప్పుడు మాత్రమే.. నిందితుడు విదేశాలకు వెళ్లాలంటే సంబంధిత కోర్టు నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. కేసు సంబంధిత కోర్టులో పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన, ఆ కేసును పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుగా భావించడానికి వీల్లేదంది.
సంబంధిత కోర్టు ఆ కేసును విచారణకు తీసుకోనంత వరకు విదేశీయానం విషయంలో ఆ కోర్టు నుంచి ఎన్‌ఓసీ అవసరం లేదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ఇటీవల తీర్పునిచ్చారు. పిటిషనర్ నుంచి స్వాధీనం చేసుకున్న పాస్‌పోర్ట్‌ను తిరిగి అతనికి ఇచ్చేయాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. కేసు విచారణకు హాజరయ్యే హామీతో రూ.2 లక్షలను విజయవాడ రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో డిపాజిట్ చేయాలని పిటిషనర్‌ను ఆదేశించారు.
తూర్పు గోదావరి జిల్లా, ఆలమూరు మండలానికి చెందిన డీవీ సూర్యనారాయణమూర్తిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఖతార్‌లో ఉద్యోగం చేస్తున్న సూర్యనారాయణమూర్తి మన దేశానికి రాగానే విజయవాడ దిశా పోలీసులు అతని పాస్‌పోర్టును సీజ్ చేశారు. అంతేకాక అతని పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకోవాలంటూ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధి కారికి లేఖ రాశారు. దీనిపై సూర్యనారాయణమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.