శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లకు నిబంధనలు అడ్డంకిగా నిలుస్తున్నాయి. దీంతో ప్రజ లు ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఆర్డీవో నుంచి నో అబ్జెక్షన్ ధ్రువపత్రాల (ఎన్‌ఓసీ)తో రిజిస్ట్రేషన్లు అయిన ప్రభు త్వ భూములకు కూడా ప్రస్తుతం మళ్లీ రిజిస్ట్రేషన్ జరగడం లేదు. అలాగే పొరపాటున రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా నమోదైన ప్రయివేటు భూముల పరిస్థితి ఇలాగే ఉంది. వాస్తవ భూ పరిస్థితులను పరిశీలించకుండానే కొందరు సబ్ రిజిస్ట్రార్లు అడ్డుతగులుతున్నారు. దీంతో అవసరాలకు అమ్ముకునే వారు అవస్థ పడుతున్నారు.
ఎన్‌ఓసీ కలెక్టర్ ఇవ్వాల్సిందే!
భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి గతంలో ఆర్డీవో ఎన్‌ఓసీ ఇస్తే సరిపోయేది. కొత్తగా కలెక్టర్ మంజూరి చేసిన ఎన్‌ఓసీ, రిజిస్ట్రేషన్ డెరైక్టర్ జనరల్ ఆదేశాలతో అన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తేనే భూముల రిజిస్ట్రేషన్ అని సబ్ రిజిస్ట్రేషన్ అధికారులు చెబుతున్నారు. దీనిపై గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం జీవో ను విడుదల చేసిందని వారంటున్నారు. దీంతో గతంలో రిజిస్ట్రేషన్ జరిగి, ఎటువంటి అభ్యంతరాలు లేని భూములకు ఎన్‌ఓసీ కోసం జిల్లాలో పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఇలా కలెక్టరేట్‌లో 12 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. భూమి స్వరూపం ఇతర పరిస్థితులపై మండల రెవెన్యూ అధికారులు ఆర్డీవో సిఫార్సు చేసిన దరఖాస్తులే అవి. అయినా దరఖాస్తుల పరిశీలనలో ఉన్నతాధికారులు కొర్రీలు వేయడంతో కలెక్టరేట్‌లోనే మూలుగుతున్నాయి. నరసన్నపేట మండలానికి సంబంధించి రెండు, ఆమదాలవలస మండలం నుంచి రెండు, ఎచ్చెర్ల మండలం రెండు, శ్రీకాకుళం మండలం మూడు, కోట బొమ్మాళి, కొత్తూరు , పాలకొండ మండలాలకు సంబంధించి ఒక్కో దరఖాస్తు వీటిలో ఉన్నాయి.
నేడు కలెక్టర్ సమావేశం
ఈ మేరకు మంగళవారం జిల్లాలో భూమి రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ రిజిస్ట్రేషన్ అధికారులలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే పెండింగ్ దరఖాస్తులపై ఓ నిర్ణయానికి రానున్నట్టు దరఖాస్తుదారులు ఆశాభావంతో ఉన్నారు. నిబంధనలు సడలిస్తే తప్ప భూ క్రయ విక్రయాలు చేయలేమని పలువురు అంటున్నారు.
భూముల రిజిస్ట్రేషన్లకు ని‘బంధనాలు’
Published Tue, Nov 18 2014 1:53 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement