నిలుపుదల చట్టవిరుద్ధం! | land registrations stopped in AP Capital | Sakshi
Sakshi News home page

నిలుపుదల చట్టవిరుద్ధం!

Published Sun, Jun 19 2016 10:44 AM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

నిలుపుదల చట్టవిరుద్ధం! - Sakshi

నిలుపుదల చట్టవిరుద్ధం!

రాజధాని ప్రాంతంలో రిజిస్ట్రేషన్ల ఆపివేత చెల్లదు
ప్రభుత్వ పెద్దల ఒత్తిడివల్లే మెమో జారీ
కోర్టుకెళితే అధికారులే ఇరుక్కుంటారు
న్యాయ, రెవెన్యూ నిపుణుల స్పష్టీకరణ

 
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో భూములు, స్థలాల క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం చట్ట విరుద్ధమని న్యాయ, రెవెన్యూ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ)కు సమీకరణ కింద భూములివ్వని రైతులను వాటిని అమ్ముకోకుండా అరికట్టి ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వ పెద్దలు ఇలా చట్ట విరుద్ధ ప్రక్రియకు తెరలేపారని అభిప్రాయపడ్డారు. రైతులను టార్గెట్ చేస్తూ రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో స్థిరాస్తుల క్రయ విక్రయ రిజిస్ట్రేషన్లు ఆపడం అన్యాయమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాజధాని ప్రాంతంలో సీఆర్‌డీఏ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) లేనిదే భూములు, స్థలాల క్రయ విక్రయ రిజిస్ట్రేషన్లు చేసేందుకు సబ్ రిజిస్ట్రార్లు నిరాకరిస్తున్నారు. దీంతో భూములు, స్థలాలు అమ్ముకోవాలనుకునే వారు ఇబ్బంది పడుతున్నారు. ‘ఎన్‌ఓసీ లేనిదే రిజిస్ట్రేషన్ చేయరాదంటే రిజిస్ట్రేషన్లు ఆపివేసినట్లే. ఎందుకంటే భూములు అమ్ముకోవాలనుకుంటున్న రైతులెవరికీ సీఆర్‌డీఏ నిరభ్యంతర పత్రం ఇవ్వదు. అందువల్ల వారు భూములు అమ్ముకోవడానికి అవకాశం ఉండదు. ఈ దురుద్దేశంతోనే ఎన్‌ఓసీ నిబంధన అమలు చేయాలని రిజిస్ట్రేషన్ అధికారులపై కీలక నేత ద్వారా ఒత్తిడి తెప్పించింది.’ అని రెవెన్యూ శాఖలో చర్చ సాగుతోంది.

ప్రభుత్వానికి అధికారం ఉన్నా..
ఎక్కడైనా రిజిస్ట్రేషన్లు నిలిపివేసే అధికారం చట్టపరంగా ప్రభుత్వానికి ఉంటుంది. అయితే రాజధానికి భూసమీకరణ ప్రక్రియ ఆరంభించకముందైతే విశాల ప్రయోజనాల కోసం రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్లు జీవో ఇస్తే ఎవరూ తప్పుబట్టడానికి ఆస్కారం ఉండేదికాదు. అప్పట్లో సీఆర్‌డీఏ ప్రతిపాదన మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఈమేరకు ప్రతిపాదన పంపగా రిజిస్ట్రేషన్లు ఆపివేస్తే భూముల ధరలు పడిపోతాయనే సాకు చూపించి ప్రభుత్వం దీన్ని పక్కన పడేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా అసెంబ్లీలో ఈ విషయం ప్రకటించారు. అందువల్ల ఇప్పుడు రిజిస్ట్రేషన్ల నిలిపివేత ఉత్తర్వులిస్తే విమర్శలు వస్తాయని సర్కారు పెద్దలు భయపడి దొడ్డిదారిన రిజిస్ట్రేషన్ల నిలిపివేతకు చర్యలు తీసుకున్నారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

జరిగిందేమిటి?
పూలింగ్ కింద భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతున్నందున తాము ఎన్‌ఓసీ జారీ చేస్తే మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయాలని సీఆర్‌డీఏ షరతుతో ప్రతిపాదన పంపింది. దీని ప్రకారం వెంటనే మెమో జారీ చేయాలని అక్కడి రిజిస్ట్రేషన్ శాఖ అధికారిపై కీలక మంత్రి ఒత్తిడి తెచ్చారు. నిస్సహాయ స్థితిలో అక్కడి అధికారి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మెమో జారీ చేశారు. ‘రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ లేదా షరతులు విధిస్తూ మెమో ఇచ్చే అధికారం ప్రభుత్వానికి తప్ప ఎవరికీలేదు. ఎవరైనా కోర్టుకు వెళితే ఈ మెమో నిలవదు. దీన్ని జారీ చేసిన అధికారి ఇరుక్కుంటారు. అయితే కీలక నేత మౌఖిక ఆదేశాలను కాదనే సాహసం చేయలేకే అధికారి మెమో జారీ చేసి ఉండవచ్చు.. ఇలా అధికారులను పావులుగా వాడుకోవడం సర్కారు పెద్దలకు సరికాదు..’ అని సచివాలయంలో రెవెన్యూశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
 
ఎలాంటి మెమో పంపలేదు
ఈ విషయమై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా రాజధాని ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు ఆపివేయాలంటూ తాము ఎలాంటి ఆదేశాలు పంపలేదని స్పష్టం చేశారు. జిల్లా రిజిస్ట్రార్ మెమో ఇచ్చి ఉంటే తమకు తెలియదని వారు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement