ఎయిర్‌కోస్టా... ఇక దేశ వ్యాప్తం..!
► వచ్చే వేసవి నుంచి సేవలు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ప్రాంతీయ విమానయాన సర్వీసుల సంస్థ ఎయిర్‌కోస్టాకు దేశ వ్యాప్తంగా సర్వీసులు నడపడానికి అనుమతి లభించింది. కేంద్ర పౌర విమానయాన సంస్థ దేశ వ్యాప్తంగా విమాన సర్వీసులు నడపడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ) ఇచ్చినట్లు ఎయిర్‌కోస్టా ఒక ప్రకటనలో పేర్కొంది. వచ్చే వేసవికి దేశవ్యాప్త సర్వీసులు నడిపే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ఎయిర్‌కోస్టా డిప్యూటీ సీఈవో వివేక్ చౌదరి తెలిపారు.
ఈ నెలల్లో 100 సీట్ల సామర్థ్యం ఉన్న ఎంబారియర్ ఈ-190 విమానం వచ్చి చేరుతుందని, దీంతో మొత్తం విమానాల సంఖ్య 5కు చేరుతుందన్నారు. ఇది కాకుండా ఫిబ్రవరిలో మరో ఈ-190 రానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎయిర్‌కోస్టా నాలుగు విమానాలతో రోజుకు 32 సర్వీసులను నడుపుతోంది. రెండేళ్లలోనే ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయి విమానయాన సంస్థగా ఎదగడంపై ఎయిర్‌కోస్టా చైర్మన్ రమేష్ లింగమనేని సంతోషం వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం 300 సిబ్బంది, రెండు విమానాలు, 5 పట్టణాలతో ప్రారంభమైన ఎయిర్‌కోస్టా ఇప్పుడు 800 మంది సిబ్బంది, నాలుగు విమానాలు, 9 పట్టణాలకు సర్వీసులను అందిస్తున్నట్లు తెలిపారు. రానున్న కాలంలో ఢిల్లీ, భువనేశ్వర్‌కు విమాన సర్వీసులను ప్రారంభించే యోచనలో ఎయిర్‌కోస్టా ఉంది.