Air Costa
-
ఎయిర్ కోస్టాకు మళ్లీ రెక్కలు?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెక్కలు తెగి ఆగిపోయిన ఎయిర్ కోస్టా... మళ్లీ రెక్కలు తొడుక్కోనుందా? 50 విమానాల కోసం ఎయిర్ కోస్టా ఇచ్చిన ఆర్డరింకా రద్దు కాలేదని ఎంబ్రాయిర్ సంస్థ స్పష్టం చేయడంతో ఈ ఊహాగానాలు నిజం కావచ్చనే అనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రారంభం అయిన తొలి విమానయాన సంస్థ ఎయిర్ కోస్టా.. నిధుల సమస్యతో 2016 జూలై నుంచి తన సర్వీసులను నిలిపేయటం తెలిసిందే. సమస్య నుంచి బయట పడేందుకు ఎయిర్ కోస్టా ప్రయత్నిస్తోందని ఎంబ్రాయిర్ కమర్షియల్ ఏవియేషన్ ఆసియా పసిఫిక్ వైస్ ప్రెసిడెంట్ సీజర్ పెరీరా వెల్లడించారు. ఇక్కడ జరుగుతున్న వింగ్స్ ఇండియా 2018లో భాగంగా శుక్రవారం ఆయన మీడియాతో ఈ విషయాలు చెప్పారు. ‘50 విమానాల కోసం ఎయిర్ కోస్టా ఇచ్చిన ఆర్డరింకా మా పుస్తకాల్లో ఉంది. రద్దు కాలేదు. ఆ సంస్థ తిరిగి సర్వీసులు ప్రారంభించవచ్చు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే తప్ప ఆర్డరు రద్దు చేయం. ఆ సంస్థతో సంప్రతింపులు జరుపుతున్నాం. సమస్య నుంచి బయటపడేందుకు ఎయిర్ కోస్టా కృషి చేస్తోంది. ఆ సంస్థ ఆర్డర్లు వేరే కంపెనీకి బదిలీ చేయలేదు’ అని పేర్కొన్నారు. యెస్.. నిజమే: ఎయిర్ కోస్టా.. విజయవాడకు చెందిన లింగమనేని గ్రూప్ ఎయిర్ కోస్టాను ప్రమోట్ చేస్తోంది. పెరీరా వ్యాఖ్యలు నిజమేనని ఎల్ఈపీఎల్ ప్రతినిధి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘మీరు విన్నది నిజమే. త్వరలోనే ఎయిర్ కోస్టాకు రెక్కలు రానున్నాయి. అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాదే సర్వీసులు తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన వెల్లడించారు. ఎంబ్రాయిర్తో సంప్రతింపులు కొనసాగుతున్నాయని ధ్రువీకరించారు. -
ఎయిర్ కోస్టా చేజారిన విమానాలు
⇒ ఉన్న రెండూ జీఈ క్యాపిటల్ వద్ద లీజుకు తీసుకున్నవే ⇒ జీఈ అభ్యర్థనతో రద్దు చేసిన డీజీసీఏ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న విమానయాన సంస్థ ఎయిర్ కోస్టాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఎయిర్ కోస్టా పేరున నమోదైన రెండు విమానాలను కేంద్ర పౌర విమానయాన శాఖ (డీజీసీఏ) రద్దు చేసింది. ఇప్పటికే పైలట్లతో సహా సగానికిపైగా సిబ్బంది కంపెనీకి గుడ్‌బై చెప్పేసిన సంగతి తెలిసిందే. తాజాగా డీజీసీఏ తీసుకున్న నిర్ణయం కంపెనీకి పెద్ద షాక్ అని చెప్పవచ్చు. 112 సీట్లున్న ఎంబ్రార్ ఈ–190 రకానికి చెందిన ఈ విమానాలను జీఈ క్యాపిటల్ ఏవియేషన్ సర్వీసెస్ సమకూర్చింది. విమానాలను లీజుకు తీసుకున్న ఎయిర్ కోస్టా అద్దె చెల్లించకపోవడంతో జీఈ అభ్యర్థన మేరకు డీజీసీఏ తాజా నిర్ణయం తీసుకుంది. రెండు విమానాలను జీఈ తన స్వాధీనంలోకి తీసుకుంది. 2017 ఫిబ్రవరి 28 నుంచి విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మే 31 వరకు సర్వీసులు రద్దు చేస్తున్నట్టు ఎయిర్ కోస్టా ఇది వరకే ప్రకటించింది. ఆందోళనకు సిబ్బంది రెడీ..: ఉద్యోగులకు చెల్లించాల్సిన జనవరి, ఫిబ్రవరి వేతనాలను కంపెనీ ఇప్పటికీ చెల్లించలేదు. మొత్తం 600 మంది ఉద్యోగుల్లో సగానికి పైగా కంపెనీకి రాజీనామా చేశారు. మిగిలినవారూ ఒక్కరొక్కరుగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. 40 మంది పైలట్లు సైతం ఇతర సంస్థల్లో చేరిపోయారు. వేతనాలు ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో మిగిలిన ఉద్యోగులు పోరాటానికి దిగాలని నిర్ణయించినట్టు ఒక సీనియర్ ఉద్యోగి సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. విజయవాడలోని కంపెనీ కార్యాలయం ముందు నిరసన తెలియజేయనున్నట్లు చెప్పారాయన. ఇంత జరుగుతున్నా ఎల్ఈపీఎల్ ఇప్పటి వరకు స్పందించకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. మే 31 తర్వాత కూడా ఎయిర్ కోస్టా సర్వీసులు పునరుద్ధరించే చాన్స్ లేదని స్పష్టమవుతోందన్నారు. -
ఎయిర్ కోస్టా ఎత్తేస్తారా?
► పైలట్లందరూ కంపెనీకి గుడ్‌బై ► 300 మందికిపైగా ఉద్యోగుల రాజీనామా ► రెండు నెలలుగా సిబ్బందికి జీతాల్లేవ్ ► మరో కింగ్‌ఫిషర్ అంటున్న సిబ్బంది హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రపంచ దేశాల్లో రెక్కలు వాల్చాలని ఆశగా ఎదురు చూసిన ఎయిర్ కోస్టా శకం ముగిసినట్టే కనిపిస్తోంది. అప్పుల ఊబిలో చిక్కుకున్న సంస్థను ఆదుకోవడానికి ఇన్వెస్టర్లు ఎవరూ ముందుకు రాకపోవటంతో కంపెనీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జనవరి నుంచి తమకు జీతాలు చెల్లించటం లేదని, ఇది మరో కింగ్‌ఫిషర్‌గా మారుతోందని కొందరు ఉద్యోగులు గట్టిగానే చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఎయిర్కోస్టా విమానాలు ఎగరటం నిలిచిపోయాయి. మొదట్లో ఈ అవాంతరాలు రెండు మూడు రోజులే ఉంటాయని చెబుతూ వచ్చిన సంస్థ ప్రమోటర్లు... ఇప్పటికీ విమాన సర్వీసుల పునరుద్ధరణ జరగకపోయినా మౌనం వీడటం లేదు. వీటన్నిటికీ తోడు ఉద్యోగులు ఒక్కరొక్కరుగా రాజీనామా చేస్తున్నా... ప్రధానంగా పైలట్లు కంపెనీని విడిచి పోతున్నా... వారిని నిలువరించే ప్రయత్నాలు కూడా చేయటం లేదు. ‘‘ఇదంతా చూస్తుంటే సంస్థను మూసివేయటానికే ప్రమోటర్లు ఇష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక్కొక్కరుగా సీనియర్ ఉద్యోగులంతా వెళ్లిపోతున్నా ఒక్కరిని కూడా ఆపే ప్రయత్నాలు చేయటం లేదు’’ అని కంపెనీలో కీలక స్థానంలో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. రాజీనామాలు చేసిన వెంటనే వాటిని ఆమోదించడం చకచకా జరిగిపోతున్నట్లు తెలియజేశారు. ఏడాదిగా వేతనాలు సరిగా రావడం లేదని ఆయన వాపోయారు. ‘‘కొత్త ఇన్వెస్టర్ వస్తేనే విమానాలు ఎగురుతాయని కంపెనీ చెబుతున్నప్పటికీ ఇప్పట్లో ఇది సాధ్యపడే అవకాశాలు కనిపించటం లేదు. ఎందుకంటే కంపెనీకి ఉన్నపళంగా రూ.250 కోట్లదాకా నిధులు కావాలి. ఆ స్థాయిలో పెట్టేందుకు ఎవ్వరూ ముందుకొచ్చే అవకాశాలు లేవు’’ అని ఆయన వివరించారు. బాధితులుగా మిగిలిపోయాం.. కంపెనీలో 40 మంది వరకు పైలట్లు ఉండేవారు. దాదాపుగా వీరందరూ వేరే విమానయాన కంపెనీల్లో చేరిపోయారు. అలాగే ఇతర విభాగాల్లో దాదాపు 600 మంది ఉద్యోగులు పనిచేసేవారు. ఇప్పుడీ సంఖ్య సగానికంటేపైగా తగ్గిపోయింది. మిగిలిన ఉద్యోగులు కూడా ఇతర అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. చాన్స్ రాగానే జంప్ అవుతా రని ఇంకా కంపెనీలోనే ఉన్న మరో ఉద్యోగి తెలియజేశారు. ప్రమోటర్లకు, ఉద్యోగులకు మధ్య అంతరం ఉందని చెప్పారాయన. ‘రాజీనామాలు చేస్తుంటే వద్దని ఎవరూ వారించడం లేదు. ఇప్పటి వరకు కంపెనీలో ఏం జరుగుతోందో పత్రికలు, వార్తా చానెళ్ల ద్వారానే తెలుస్తోంది. ప్రమోటర్లు ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ కవి చౌరాసియా మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కింగ్‌ఫిషర్ విషయంలో విజయ్ మాల్యా కనీసం అప్పుడప్పుడైనా మాట్లాడారు. ఎయిర్ కోస్టా విషయంలో అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రభుత్వానికి అంతా తెలుసు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎవరికీ పట్టడం లేదు. మేము ఇప్పుడు బాధితులుగా మిగిలిపోయాం’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎగిరే అవకాశం లేదు.. వేలాది మంది కస్టమర్లు ఎయిర్ కోస్టా టికెట్లు బుక్ చేసుకున్నారు. సర్వీసులు రద్దు అయిన తర్వాత కస్టమర్ల సొమ్ము తిరిగి చెల్లించేందుకు కంపెనీ ఏర్పాట్లేవీ చేయలేదని మరో ఉద్యోగి చెప్పారు. కస్టమర్ కేర్ నంబరు సైతం మూగబోయింది. విమానాశ్రయాల్లో కంపెనీ ఏర్పాటు చేసిన ఆఫీసులను ఉద్యోగులు తెరుస్తున్నారా లేదా అన్న విషయమూ కంపెనీ పట్టించుకోవడం లేదని మరో ఉద్యోగి చెప్పారు. కస్టమర్‌తో మాట్లాడేందుకు ఉద్యోగులు ఎవరూ లేరని చెప్పారు. ఎయిర్ కోస్టా బ్రాండ్ కథ ముగిసినట్టేనని వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లు ముందుకు వచ్చినా కంపెనీ నిలబడుతుందో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. 2017 మే 31 వరకు సర్వీసులు నిలిపివేసినట్టు కంపెనీ చెబుతున్నా.. మరో నాలుగైదు నెలల దాకా విమానాలు ఎగిరే అవకాశం లేదని, ఆ తరవాతా అనుమానమేనని ఆయన స్పష్టం చేశారు. కాగా విశ్వసనీయ సమాచారం మేరకు శంషాబాద్ విమానాశ్రయానికి రూ. కోటి, జైపూర్ విమానాశ్రయానికి రూ.40 లక్షలు బాకీ ఉన్నట్టు తెలిసింది. ఉద్యోగులకేగాక ఎయిర్ కోస్టాకు సర్వీసులు అందించే అన్ని కంపెనీలకు బకాయిలు పేరుకు పోయాయి. ఇంకా ఇన్వెస్టర్ల వేట.. మరో మూడు నెలల దాకా విమానాలు ఎగిరే అవకాశం లేదని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కవి చౌరాసియా స్పష్టం చేశారు. ఇన్వెస్టర్ల అన్వేషణ కొనసాగుతోందని వెల్ల డించారు. ఇన్వెస్టర్ ఎవరైనా ముందుకు వచ్చారా అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని పేర్కొన్నారు. 250 మంది కంపెనీని విడిచి Ðð ళ్లినట్టు తెలిపారు. ఏడాదిలో రూ.130 కోట్ల నష్టం వివిధ వర్గాల సమాచారం మేరకు... జనవరి నెలకు రూ.2.5 కోట్లు, ఫిబ్రవరికి రూ.3 కోట్ల వేతనాలు కంపెనీ బకాయి పడింది. ఉన్న ఉద్యోగుల్లో యాజమాన్యానికి బాగా కావాల్సిన అతి కొద్ది మందికే జనవరి వేతనాలు అందాయి. ఉద్యోగుల ఖాతాల్లో పీఎఫ్ జమ కూడా నిలిచిపోయింది. అందరికీ మార్చి 15 నాటికల్లా బకాయిలు చెల్లిస్తానని చెప్పిన కంపెనీ... 20వ తేదీ నాటికి కూడా అలాంటి ప్రయత్నాలేమీ చేయలేదు. వివిధ వ్యాపారాలను నిర్వహిస్తున్న ఎల్ఈపీఎల్ గ్రూప్‌నకు జీతాల మొత్తం పెద్ద భారం కాదని, అయినా చెల్లించకపోవటంతో కంపెనీ తీరు అనుమానాలకు తావిస్తోందని సీనియర్ ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించారు. పౌర విమానయాన శాఖకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎయిర్ కోస్టా 2015–16లో రూ.327 కోట్ల టర్నోవరుపై రూ.130 కోట్ల నష్టం చవిచూసింది. నిర్వహణ వ్యయాలు రూ.457 కోట్లుగా ఉన్నాయి. ఎయిర్ కోస్టాకు జీఈ క్యాపిటల్ ఏవియేషన్ సర్వీసెస్ మొత్తం మూడు విమానాలను అద్దెకు సమకూర్చింది. ఈ కంపెనీకి చెల్లించాల్సిన బకాయిలపై వివాదం తలెత్తడంతో 20 రోజులుగా విమానాలు ఎగరడం లేదు. ఇలాంటి వివాదంతోనే 2016 ఆగస్టు తొలివారంలో ఒక రోజు పూర్తిగా, మరోరోజు పాక్షికంగా సర్వీసులను ఎయిర్ కోస్టా నిలిపివేసింది. -
ఎగరాలంటే పార్టనర్ రావాలి
-
ఎగరాలంటే పార్టనర్ రావాలి
అందుకు సమయం పడుతుంది:ఎయిర్ కోసా అంత వరకు బుకింగ్‌లు రద్దు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : విమానయాన సంస్థ ఎయిర్ కోస్టాకు కష్టాలు తీరేందుకు మరికొన్ని రోజులు పట్టేలా ఉంది. గత వారం నుంచి సంస్థ విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. విమానాలు మళ్లీ ఎప్పుడు ఎగిరేది అన్న విషయంలో ఇంకా సంధిగ్ధత నెలకొంది. ప్రస్తుతానికి ఎటువంటి బుకింగ్‌లను కంపెనీ స్వీకరించడం లేదు. కంపెనీ తన వెబ్సైట్ ద్వారా ఏప్రిల్ నెలకు కూడా బుకింగ్‌లను తీసుకోవట్లేదు. నిధుల లేమితో కంపెనీ సతమతమవుతోంది. ఎయిర్ కోస్టాలోకి కొత్త భాగస్వామి వస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని సంస్థ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ కవి చౌరాసియా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘భాగస్వామ్యం తీసుకునే ప్రక్రియ సాధారణ విషయం కాదు. వాటా విక్రయం విషయంలో ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి. ఒక రోజులో అంతా పూర్తి అయ్యేదీ అసలే కాదు. ఇందుకు సమయం పడుతుంది’ అని వివరించారు. మార్చి 15కల్లా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. అన్ సీజన్లో ఇలా.. సంక్రాంతి తర్వాత నుంచి భారత విమానయాన రంగంలో అన్ సీజన్ మొదలవుతుంది. తిరిగి వేసవి సెలవులు ప్రారంభం అయితేనే సీజన్ మొదలయ్యేది. కొన్ని సంస్థల దూకుడుతో ఇప్పటికే ఇతర కంపెనీల విమానాల్లో సీట్లు నిండడం లేదు. నూరు శాతం సీట్లతో నడిస్తేనే విమాన కంపెనీలకు లాభాలు వస్తాయని ఎయిర్ కోస్టా ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఉన్నత తరగతి రైలు టికెట్ల కంటే విమాన ప్రయాణం ఇప్పుడు చవక. దేశంలో ధరల యుద్ధం జరుగుతోంది. అసలే అన్ సీజన్. విమానాలు అద్దెకు ఇచ్చిన కంపెనీకి చెల్లించాల్సిన మొత్తం బాకీ పడ్డాం. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీకి సమస్య రావడం దురదృష్టకరం. త్వరలోనే గట్టెక్కుతామన్న ధీమా ఉంది’ అని వ్యాఖ్యానించారు. జీఈ కొనసాగుతుంది.. పౌర విమానయాన శాఖకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎయిర్ కోస్టాకు 2015–16లో రూ.327 కోట్ల ఆదాయంపై సుమారు రూ.130 కోట్ల నష్టం వాటిల్లింది. నిర్వహణ వ్యయాలు రూ.457 కోట్లుగా ఉంది. జీఈ క్యాపిటల్ ఏవియేషన్ సర్వీసెస్ సమకూర్చిన రెండు విమానాలను కంపెనీ నడుపుతోంది. ఈ కంపెనీతో ఎటువంటి వివాదం లేదని ఎయిర్ కోస్టా ప్రతినిధి స్పష్టం చేశారు. తమ కంపెనీలో వాటా తీసుకోవడానికి ఒక భాగస్వామి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వాటా విక్రయానంతరం కూడా జీఈ విమానాలే నడుస్తాయని ఆయన వివరించారు. ఇప్పటికే ఎయిర్ కోస్టా 50 ఎంబ్రార్ విమానాలకు ఆర్డరు ఇచ్చింది. 2018 నుంచి ఇవి జతకూడనున్నాయి. దేశవ్యాప్తంగా సర్వీసులు అందించేందుకు లైసెన్సు కూడా దక్కించుకుంది. వచ్చే ఏడాది విదేశాలకు విమానాలు నడపాలన్నది కంపెనీ ఆశయం. -
ఈ నెల 5 వరకూ కార్యకలాపాలు బంద్
ఎయిర్ కోస్టా వెల్లడి న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్ కోస్టా తన కార్యకలాపాలను ఈ నెల 5 వరకూ సస్పెండ్ చేసింది. నిధుల సమీకరణలో సమస్యలు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఎయిర్ కోస్టా వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) కవి చౌరాసియా చెప్పారు. రెండు రోజుల పాటు కార్యకలాపాలను నిర్వహించలేమని మంగళవారం ఈ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. నిధుల సమీకరణ విషయమై ఆసక్తిగా ఉన్న ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నామని, ఈ లావాదేవీ ఖరారు కావడానికి మరికొంత సమయం పడుతుందని కవి చౌరాసియా వివరించారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కార్యకలాపాలను మరికొన్ని రోజులు నిలిపేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. చాలా మంది ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు కూడా చెల్లించలేదని సమాచారం. ఈ సంస్థ రోజుకు ఎనిమిది నగరాలకు 16 విమాన సర్వీసులను నిర్వహించేది. ఈ కంపెనీకి రెండు లీజ్డ్ విమానాలున్నాయి. మొత్తం 600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో విమాన సర్వీసులను నిలిపేసిన రెండో కంపెనీ ఇది. ఇంతకు ముందు ఎయిర్ పెగాసస్ ఇలాగే విమాన సర్వీసులను ఆపేసింది. -
మళ్లీ ఆగిన ఎయిర్ కోస్టా
⇒ లీజింగ్ సంస్థతో వివాదమే కారణం ⇒ రెండు రోజుల్లో కొలిక్కి: కంపెనీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెండు విమానాలతో సేవలందిస్తున్న ‘ఎయిర్ కోస్టా’ సర్వీసులు మళ్ళీ నిలిచిపోయాయి. లీజింగ్ కంపెనీతో తలెత్తిన వివాదం కారణంగా మంగళ, బుధవారాల్లో సర్వీసులు రద్దయ్యాయి. గురువారం నుంచి సర్వీసులు తిరిగి పునరుద్ధరించనున్నట్లు కంపెనీ తెలిపింది. 2016 ఆగస్టు తొలి వారంలోనూ ఇలాంటి వివాదమే తలెత్తి ఒకరోజు పూర్తిగా, మరోరోజు పాక్షికంగా సర్వీసులు నిలిపివేయాల్సి వచ్చింది. లీజు వ్యయం విషయమై జీఈ క్యాపిటల్ ఏవియేషన్ సర్వీసెస్‌తో చర్చిస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. వ్యయం తగ్గితే మరిన్ని విమానాలను సమకూర్చుకోవచ్చన్నది కంపెనీ ఆలోచన. సంస్థ ప్రస్తుతం 8 నగరాలకుగాను రోజుకు 16 సర్వీసులను నడిపిస్తోంది. వాటా కొనుగోలుకు కొత్త భాగస్వామి ఆసక్తి! ఒకవైపు లీజు వ్యయం తగ్గించుకోవటంతో పాటు కొత్త విమానాలు సమకూర్చుకుని సర్వీసులు విస్తరించాలని చూస్తున్న సంస్థ... వాటా విక్రయ ప్రతిపాదనను మరోమారు తెరపైకి తెచ్చింది. ఈ మేరకు ఎన్ఆర్ఐ ఒకరు ఆసక్తి కనబరుస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రెండు రోజుల్లో ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చే అవకాశాలున్నట్లు కూడా కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎయిర్ కోస్టాలో 24–26 శాతం దాకా వాటా విక్రయిస్తామని, దీంతో విస్తరణ చేపడతామని ఆ వర్గాలు చెప్పాయి. వాటా విక్రయానికి పలు విదేశీ ఎయిర్‌లైన్స్ కంపెనీలతో కూడా చర్చలు జరిపినా అవి ఫలించలేదు. దేశవ్యాప్తంగా విమానాలు నడిపేందుకు 2016 అక్టోబర్‌లోనే డీజీసీఏ నుంచి అనుమతి రాగా... అందుకు అనుగుణంగా మరో రెండు మూడు ఫ్లైట్స్ జత చేయాలని కంపెనీ భావించింది. దీన్ని ఈ ఏడాదైనా పూర్తి చేయాలన్నది కంపెనీ నిశ్చితాభిప్రాయమని సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
ఎయిర్ కోస్టాలో వాటా విక్రయం!.
♦ విదేశీ ఎయిర్‌లైన్స్‌తో చర్చలు ♦ కొత్త విమానాలకై త్వరలో ఒప్పందం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగంలో ఉన్న ఎయిర్ కోస్టా వాటా విక్రయానికి రెడీ అయింది. గల్ఫ్ ప్రాంతానికి చెందిన విమానయాన సంస్థలతో సహా పలు అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. 26 శాతం వాటా విక్రయానికై ఖతర్ ఎయిర్వేస్, ఎయిర్ కోస్టా మధ్య ఇటీవల చర్చలు జరిగాయి. అయితే ఎటువంటి నిర్ణయానికి ఇరు సంస్థలు రానట్టు తెలుస్తోంది. ఎయిర్ కోస్టాలో ఎమిరేట్స్, ఎతిహాద్, గల్ఫ్ ఎయిర్‌లలో ఏదో ఒక కంపెనీ వాటా తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా విమానాలను నడిపేందుకు ఎయిర్ కోస్టాకు ఈ నెల 3న డీజీసీఏ లెసైన్సు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వాటా విక్రయానికి ఇదే సరైన సమయమని కంపెనీ భావిస్తోంది. దేశవ్యాప్త లెసైన్సుతో సంస్థ విలువ పెరగడం ఇందుకు కారణం. ఇప్పటి వరకు ప్రాంతీయ విమానయాన సంస్థగా ఉన్న ఎయిర్కోస్టా హైదరాబాద్‌సహా 8 నగరాలకు సర్వీసులను నడిపింది. మరిన్ని విమానాలకై.. ప్రస్తుతం ఎయిర్ కోస్టా వద్ద ఒక్కొక్కటి 110 సీట్ల సామర్థ్యం గల మూడు ఎంబ్రార్ ఇ-190 ఫ్లైట్స్ ఉన్నాయి. ప్రతి రోజు 24 సర్వీసులను నడిపిస్తోంది. ఈ నెలలోనే మరో విమానం తోడవుతోంది. కొత్తగా ఆరు ఎయిర్‌క్రాఫ్ట్స్ కోసం సింగపూర్‌కు చెందిన జీఈ క్యాపిటల్ ఏవియేషన్ సర్వీసెస్‌తో అక్టోబరులోనే ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు ఎయిర్ కోస్టా సీఈవో వివేక్ చౌదరి తెలిపారు. 2017 జనవరి నుంచి కంపెనీలోకి వీటి రాక ప్రారంభం అవుతుందన్నారు. వచ్చే ఏడాది డిసెంబరుకల్లా సంస్థ చేతిలో ఎంబ్రార్ ఇ-190 రకం 10 విమానాలు ఉండనున్నాయి. రెండేళ్లలో మొత్తం 18 నగరాల కు సర్వీసులను అందించాలన్నది సంస్థ ప్రణాళిక. ఈ ఏడాది డిసెంబరు నుంచి కొత్త నగరాలను జోడించనుంది. -
ఎయిర్ కోస్టా.. ఇక దేశవ్యాప్తం!
♦ కంపెనీకి పాన్ ఇండియా లైసెన్సు ♦ చిన్న నగరాలకూ విమాన సేవలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రాంతీయ విమానయాన రంగంలో ఉన్న ఎయిర్ కోస్టా ప్రయాణంలో మరో కీలక మలుపు. ఇక నుంచి దేశవ్యాప్తంగా ఏ నగరం నుంచైనా సేవలు అందించేందుకు కంపెనీకి మార్గం సుగమం అయింది. ఈ మేరకు డీజీసీఏ నుంచి లైసెన్సు దక్కించుకుంది. ఇప్పటి వరకు ప్రాంతీయ లైసెన్సు కలిగిన ఈ సంస్థ విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, జైపూర్, అహ్మదాబాద్, తిరుపతి, వైజాగ్ నగరాలకు సర్వీసులను నడిపింది. పాన్ ఇండియా లెసైన్సుతో కొత్త నగరాల్లో అడుగు పెట్టేందుకు కంపెనీ కసరత్తు ప్రారంభించింది. తాజా లైసెన్సుతో సంస్థ ఢిల్లీ, ముంబై, లక్నో, భువనేశ్వర్, చండీగఢ్, ఇండోర్ వంటి నగరాల పై దృష్టి పెట్టనుంది. చిన్న పట్టణాలు, నగరాలను మెట్రోలతో అనుసంధానించాలన్న సంస్థ విధానాన్ని కొనసాగిస్తామని ఎయిర్ కోస్టా సీఈవో వివేక్ చౌదరి ఈ సందర్భంగా తెలిపారు. ఢిల్లీ, ముంబైని దేశవ్యాప్తంగా ఉన్న చిన్న నగరాలతో కనెక్ట్ చేస్తామని చెప్పారు. డిసెంబరు నుంచే..: కొత్త నగరాల కు ఈ ఏడాది డిసెంబరు నుంచి ఎయిర్ కోస్టా విమానాలు ఎగరనున్నాయి. ప్రస్తుతం కంపెనీ ప్రతి రోజు 24 సర్వీసులను నడిపిస్తోంది. సంస్థ వద్ద ఒక్కొక్కటి 110 సీట్ల సామర్థ్యం గల మూడు ఎంబ్రార్ ఇ-190 ఫ్లైట్స్ ఉన్నాయి. అక్టోబరులో మరో విమానం వచ్చి చేరుతోంది. ఏడాదిలో మరో రెండు మూడు ఫ్లైట్స్ జత కూడనున్నాయి. 2018 నాటికి అంతర్జాతీయంగా సేవలు అందించాలని ఎయిర్ కోస్టా చైర్మన్ రమేష్ లింగమనేని కృతనిశ్చయంతో ఉన్నారు. 2013 అక్టోబరు 15 నుంచి కంపెనీ తన సేవలను ప్రారంభించింది. ఇ-195ఇ2, ఇ190ఇ2 రకం 50 విమానాల కోసం 2014లో సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ విమానాలు 2018 నుంచి ఎయిర్ కోస్టా ఖాతాలోకి రానున్నాయి. అంతర్జాతీయ సేవలను దృష్టిలో పెట్టుకునే సంస్థ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఇప్పటి దాకా 20 లక్షల పైచిలుకు కస్టమర్లు ఎయిర్ కోస్టా విమానాల్లో ప్రయాణించినట్టు సమాచారం. -
సెప్టెంబర్ నుంచి ఎయిర్కోస్టా సర్వీసుల పెంపు
గన్నవరం: విమాన సంస్థ ఎయిర్కోస్టా సెప్టెంబర్ నుంచి కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి సర్వీసులను పెంచనుంది. ప్రస్తుతం నడుస్తున్న బెంగళూరుకు మరో అదనపు సర్వీస్ తో పాటు విశాఖపట్నం వరకు సర్వీసులను విస్తరించనుంది. సెప్టెంబర్ 11 నుంచి హైదరాబాద్ మీదుగా జైపూర్‌కు కొ త్త సర్వీస్ ప్రారంభించనుంది. సెప్టెంబర్ ఒకటి నుంచి ఉదయం సర్వీస్ 7.15కు ఇక్కడ్నుంచి బయలుదేరి 8.15కు బెంగళూరు చేరుకుంటుంది. అక్కడినుంచి వైజాగ్‌కు 10.10 గంటలకు చేరుకుంటుంది. తిరిగి అదే విమానం సాయంత్రం 18.15కు వైజాగ్‌లో బయలుదేరి 19.50కు బెంగళూరు చేరుకుని, అక్కడినుంచి రాత్రి 21.25కు గన్నవరం చేరుకుంటుంది. రెండవ సర్వీస్ ఉదయం 10.30కు వైజాగ్ నుంచి బయలుదేరి బెంగళూరు మీదుగా 13.35కు ఇక్కడికి చేరుకుంటుంది. తిరిగి ఇక్కడి నుంచి 15.00కు బయలుదేరి బెంగళూరు మీదుగా సాయంత్రం 17.55కు వైజాగ్‌కు చేరుకుంటుంది. ఉదయం 8.00కు ఇక్కడి నుంచి బయలుదేరి 08.50కు హైదరాబాద్ చేరుకుని కొద్ది విరామం అనంతరం బయలుదేరి 11.15కు జైపూర్‌కు చేరుకుంటుం ది. తిరిగి జైపూర్ నుంచి సాయంత్రం 16.00కు బయలుదేరి హైదరాబాద్ మీదుగా రాత్రి 21.15కు ఇక్కడికి చేరుకుంటుందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. -
ఎగిరిన ఎయిర్ కోస్టా విమానాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రాంతీయ విమానయాన సంస్థ ఎయిర్కోస్టా తన సర్వీసులను పునరుద్ధరించింది. విమానాలను లీజుకిచ్చిన సంస్థతో తలెత్తిన వివాదం కారణంగా గురువారం సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఎయిర్కోస్టా శుక్రవారం తొమ్మిది సర్వీసులను నడిపింది. శనివారం నుంచి యదావిధిగా 24 సర్వీసులూ నడుస్తాయని సంస్థ సీఈవో వివేక్ చౌదరి వెల్లడించారు. వివాదం సమసిపోయిందని, భవిష్యత్తులో ఎటువంటి సమస్యా రాదని చెప్పారు. -
ఆగిన ఎయిర్కోస్టా సర్వీసులు!
♦ లీజింగ్ కంపెనీతో వివాదం ♦ సమసిపోయిందన్న కంపెనీ ♦ నేటి నుంచి యదావిధిగా సర్వీసులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ; దేశీయ విమానయాన రంగ సంస్థ ఎయిర్కోస్టా తన సర్వీసులను గురువారం పూర్తిగా నిలిపివేసింది. రోజూ 9 నగరాలకు దాదాపు 24 సర్వీసులను నడుపుతున్న ఈ సంస్థ... గురువారం వాటన్నిటినీ నిలిపేసింది. సాంకేతిక కారణాలతోనే నడవలేదని... కాదు ఆర్థిక కారణాల వల్లేనని రకరకాలుగా వార్తలొచ్చాయి. అయితే ఎయిర్ కోస్టా అధికారి మాత్రం లీజుకిచ్చిన సంస్థతో ఉన్న వివాదమే విమానాల నిలిపివేతకు కారణమని చెప్పారు. ‘‘వివాదం సమసిపోయింది. శుక్రవారం నుంచి సర్వీసులు యథావిధిగా నడుస్తాయి’’ అని ‘సాక్షి ’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారాయన. తమ సంస్థకు ఎలాంటి అప్పులు లేవని, నిధుల లేమి సమస్య అసలే లేదని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యల వల్లే సర్వీసులు నిలిపివేశారన్న వార్తలను ఆయన ఖండించారు. దేశవ్యాప్తంగా విమానాలు నడపటానికి పాన్ ఇండియా లెసైన్సు కోసం దరఖాస్తు చేసుకున్న ఎయిర్కోస్టా... 112 సీట్ల సామర్థ్యం ఉన్న ఎంబ్రాయర్ ఈ-190 రకం విమానాలను నడుపుతోంది. ఈ సెగ్మెంట్లో ఖరీదైన ఈ విమానాలను దేశంలో నడిపిస్తున్న సంస్థ ఇదొక్కటే. అందుబాటు ధరలో ఉత్తమ సేవలందించాలన్న లక్ష్యంలో భాగంగానే వీటిని పరిచయం చే సినట్లు ఎయిర్కోస్టా చైర్మన్ రమేష్ లింగమనేని గతంలో చెప్పారు. ముందుకొస్తే ఆర్థిక సహాయం.. ప్రాంతీయ విమానయాన సంస్థ ఎయిర్ పెగాసస్... జులై 27 నుంచి సర్వీసులను నిలిపివేసింది. 2015 ఏప్రిల్ నుంచి సర్వీసులు ప్రారంభించిన ఈ సంస్థ నిధుల లేమితో సతమతమవుతోంది. పెద్ద ఎత్తున అద్దె బాకీ పడటంతో దీనికి లీజుకిచ్చిన మూడు విమానాలనూ లీజింగ్ కంపెనీ స్వాధీనం చేసుకుంది. ఈ విషయాన్ని డీజీసీఏ దృష్టికి తీసుకెళ్లిన లీజింగ్ కంపెనీ.. ఎయిర్ పెగాసస్ జాబితా నుంచి ఈ విమానాలను తొలగించాలని కోరింది. తాజా పరిణామాల నేపథ్యంలో పౌర విమానయాన శాఖ స్పందించి... విమానయాన సంస్థలు ముందుకొస్తే సహాయం చేసే విషయాన్ని పరిశీలిస్తామంది. సహాయం కోసం ఏ సంస్థ కూడా తమను సంప్రదించలేదని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్.ఎన్.చౌబే పేర్కొన్నారు. -
పుష్కరాలకు ఎయిర్కోస్టా ప్రత్యేక సర్వీసులు..
విమానాశ్రయం (గన్నవరం): కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడకు మరో 4 విమానాలు నడపనున్నట్లు ఎయిర్కోస్టా తెలిపింది. వచ్చే నెల 10 నుంచి 25 వరకు హైదరాబాద్, బెంగళూరు నుంచి ఈ అదనపు సర్వీసులను నడిపేందుకు షెడ్యూల్ సిద్ధం చేసింది. వివరాలివీ.. -
లాభాల గాల్లో విమానాలు..!
♦ అన్‌సీజన్‌లోనూ ప్రయాణికుల జోరు.. ♦ గత మూడు నెలల్లో 24 శాతం వృద్ధి ♦ బ్రేక్ ఈవెన్ స్థాయిని దాటి నిండుతున్న సీట్లు ♦ డిమాండ్‌కు తగ్గట్టు సర్వీసులు పెంచుకుంటున్న సంస్థలు ♦ వచ్చే నెల్లో మరో చౌక విమాన సంస్థ రంగంలోకి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కింగ్‌ఫిషర్... పారమౌంట్... దమానియా... ఈస్ట్ వెస్ట్... స్పైస్ జెట్... జెట్ ఎయిర్వేస్... ఇవన్నీ ఒకప్పుడు నష్టాల్లో మునిగి తేలినవే. కాకపోతే ఆ నష్టాల్ని తట్టుకుని నిలబడగలిగే శక్తి కొన్నిటికి మాత్రమే వచ్చింది. ఆ శక్తి లేకపోవటంతో కింగ్‌ఫిషర్... పారమౌంట్, దమానియా, ఈస్ట్ వెస్ట్ వంటివి మూతపడ్డాయి. ఎయిర్ దక్కన్ వంటివి వేరే సంస్థల ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. స్పైస్‌జెట్ యజమాని మారగా, జెట్ ఎయిర్వేస్ ఎతిహాద్ అండతో నిలదొక్కుకుంది. ఇదంతా ఎందుకంటే... అప్పుడప్పుడే భారతీయులకు విమాన ప్రయాణం అలవాటవుతున్న తరుణంలో వచ్చిన సంస్థలివి. కానీ అవి చేసిన అలవాటు ఇపుడు తారస్థాయికి చేరుకుంది. ఫలితం!! విమానాలు నిండిపోతున్నాయి. విమాన ప్రయాణికుల్లో రికార్డు వృద్ధి నమోదవుతోంది. విమానయాన సంస్థలు లాభాల బాట పడుతున్నాయి. అదీ కథ. ఇపుడు విమాన యాన సంస్థలకు అన్‌సీజన్ లేదు. మార్చి, ఏప్రిల్ నెలలు ఇప్పటిదాకా అన్సీజనే అయినా... ఈ సారి ఆ నెలల్లో కూడా గణనీయమైన వృద్ధి కనిపించింది. ప్రస్తుతం దేశంలో సర్వీసులందిస్తున్న 11 విమానయాన సంస్థల్లోనూ సీట్లు రికార్డు స్థాయిలో భర్తీ అవుతున్నాయి. మార్చి నెలల్లో అన్ని విమానాల సగటు లోడ్ ఫ్యాక్టర్ (సీట్లు నిండటం) రికార్డు స్థాయిలో 83 శాతానికి చేరుకుంది. అమెరికా తర్వాత విమానాల్లో సీట్లు ఈ స్థాయిలో భర్తీ అవుతున్నది ఇక్కడే కావటం విశేషం. సాధారణంగా 100 సీట్ల సామర్థ్యం ఉన్న విమానాల్లో సీట్లు 75-80 శాతం నిండితే బ్రేక్ ఈవెన్‌కి వచ్చినట్లేనని, ఇప్పుడు చాలా సర్వీసుల్లో అంతకంటే ఎక్కువ శాతం సీట్లు భర్తీ అవుతున్నాయని పరిశ్రమ ప్రతినిధి ఒకరు చెప్పారు. కొన్నాళ్ళు పరిస్థితులిలాగే ఉంటే అన్ని ఎయిర్‌లైన్స్ కూడా లాభాల్లోకి వస్తాయన్నారు. స్పైస్ జెట్ టాప్; విస్తారా లాస్ట్ గత నెలలో స్పైస్ జెట్ సగటు లోడ్ ఫ్యాక్టర్ 91 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, 75 శాతంతో విస్తారా చివరి స్థానంలో ఉంది. నిజానికి 75 శాతమంటే అది కూడా బ్రేక్ ఈవెన్ పరిస్థితే. అంటే దాదాపు ఏ విమానయాన సంస్థా నికరకంగా సీట్లకు సంబంధించి నష్టాల్ని మూటగట్టుకోవటం లేదన్న మాట. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎయిర్కోస్టా లోడ్ ఫ్యాక్టర్ 82.1 ఉండగా, తరచు కొన్ని విమానాలు రద్దవుతున్నా ట్రూజెట్ కూడా 77.9 శాతం ఎస్ఎల్ఎఫ్ను సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమానయాన ప్రయాణీకుల సంఖ్య 10 కోట్లు దాటుతుందని ఎడల్వైజ్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో 8.5 కోట్ల మంది ప్రయాణించారు. ఇదే సమయంలో విమాన ఇంధన ధరలు కూడా బాగా తగ్గడంతో దాదాపు అన్ని విమానయాన సంస్థలు నిర్వహణ లాభాల్లో నడుస్తున్నాయి. డిమాండ్ ఇదే విధంగా కొనసాగితే ఆర్టీసీ బస్సుల్లాగా టాప్ ఎక్కి ప్రయాణించే పరిస్థితి కనపడుతోందని ఒక ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రతినిధి నవ్వుతూ వ్యాఖ్యానించారంటే డిమాండ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ప్రస్తుత సీజన్లో ఎయిర్‌లైన్ సంస్థలు ఆఫర్లు ప్రకటించడాన్ని తగ్గించాయి. మరో కొత్త ఎయిర్‌లైన్... పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో చౌక విమానయాన రంగంలోకి కొత్తగా మరో సంస్థ ప్రవేశించబోతోంది. తమిళనాడుకు చెందిన సీఎంసీ విద్యాసంస్థ ‘ఎయిర్ కార్నివాల్’ పేరుతో రంగంలోకి రాబోతోంది. మే నెల్లో ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. దీంతో దేశీయంగా విమాన సర్వీసులు అందిస్తున్న సంస్థల సంఖ్య 12కి పెరగనుంది. మిగిలిన సంస్థలు కూడా డిమాండ్‌కు తగ్గట్టుగా విమానాల సంఖ్యను పెంచుకోవడంపై దృష్టిసారించాయి. ఈ ఏడాది కొత్తగా మరో 50 విమానాల సేవలు అందుబాటులోకి రానున్నట్లు అంచనా. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఎయిర్కోస్టా ఈ డిసెంబర్ నాటికి విమానాల సంఖ్యను 4 నుంచి 8కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ట్రూజెట్ కూడా తన విమానాల సంఖ్యను ఈ ఏడాదిలోగా మూడు నుంచి 10కి పెంచుకోవాలనుకుంటోంది. వృద్ధి నమోదవుతోందిలా... ♦ అన్‌సీజన్‌గా భావించే ఫిబ్రవరిలో ఈ ఏడాది 79 లక్షల మంది ప్రయాణించారు. గతేడాదికన్నా దాదాపు 25% అధికం. ♦ 2016 తొలి మూడు నెలల్లో ప్రయాణించిన వారి సంఖ్య 2.3 కోట్లు. గతేడాది ఇదే కాలంలో ప్రయాణించిన 1.85 కోట్ల మందికన్నా దాదాపు 23 శాతం అధికం. -
డిసెంబర్‌లోగా మరో ఐదు కొత్త విమానాలు
దేశ వ్యాప్తంగా సర్వీసులు ప్రారంభించడానికి అనుమతులు రావడంతో కొత్త విమానాలు సమకూర్చుకోవడంపై ఎయిర్కోస్టా దృష్టిసారించింది. ఈ ఏడాది 110 సీట్ల సామర్థ్యం ఉన్న ఆరు ఎంబ్రాయర్ ఈ-190 ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకుంటున్నట్లు ఎయిర్ కోస్టా ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది తొలి ఈ- 190 ఎయిర్‌క్రాఫ్ట్‌ను శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చిందని, మిగిలిన ఐదు ఎయిర్‌క్రాఫ్ట్‌లు డిసెంబర్‌లోగా వస్తాయని ఎయిర్కోస్టా డిప్యూటీ సీఈవో వివేక్ చౌదరి తెలిపారు. ఈ కొత్త విమానం రాకతో ఈ-190 ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య మూడుకు చేరగా, ఒక ఈ-170 ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. ప్రస్తుతం ఉన్న 67 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ-170 స్థానంలో 110 సీట్లు ఉన్న ఈ-190ని నడపనున్నట్లు తెలిపారు. -
కబ్జా చక్రవర్తి లింగమనేని (సీఎంగారికి వెరీక్లోజ్)
⇒‘సాక్షి’ వద్ద పేదలిచ్చిన డాక్యుమెంట్లు.. ⇒ఎస్టేట్‌లో పేదల భూములు స్వాహా.. ⇒ 300 ఎకరాల కబ్జా భూములు.. ⇒వాటి విలువ రూ. 1,500 కోట్లు పైనే... ⇒సమీకరణ నుంచి ఎస్టేట్‌కు మినహాయింపు ⇒ కొద్ది దూరంలో ఆగిపోయిన రాజధాని సరిహద్దు ఎవరీ లింగమనేని?... జస్ట్ ఎయిర్ కోస్టా విమానాలకు బాస్ మాత్రమేనా..? కాదు. చట్టాన్ని ఎగతాళి చేస్తూ, కృష్ణా నదిని కూడా కబ్జా చేసి ప్యాలెస్ లాంటి భవంతి కట్టుకున్న ‘పనిమంతుడు’ మాత్రమే కాదు. ఆ భవంతిని తన ఇష్టదైవం లాంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి సమర్పించుకున్న భక్త ‘హనుమంతుడు’ మాత్రమే కాదు.... కోస్తాంధ్రలోని రెండు ప్రధాన పట్టణాలయిన విజయవాడ - గుంటూరుల నట్టనడుమ మూడు వందల ఎకరాల విలువైన భూమిని అవలీలగా చెరబట్టిన కబ్జా కాలకేయుడు కూడా. కబ్జా చేసుకున్న భూమికి సరిహద్దు గోడను కూడా నిర్మించుకున్న సమర్ధుడు. ఎంత సమర్ధుడంటే.. భూ సమీకరణ చట్టం ఆయన సరిహద్దు గోడదాకా వచ్చి వంగి సలామ్ కొట్టి పక్కకు తిరిగి వెళ్లింది... రాజధాని అమరావతిలో ‘బాబు’ల బినామీ భూ బాగోతాలు కోకొల్లలుగా బైటపడుతున్నాయి. లింగమనేని రమేష్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య ఉన్న బంధాన్ని రుజువుచేసే మరో పక్కా ఆధారం గురువారం ‘సాక్షి’కి లభించింది. ఈ ఆధారం ‘సాక్షి’ తవ్వితీసింది కాదు. పేదలు స్వయంగా వచ్చి ‘సాక్షి’ చేతికి అందించింది. పేదల భూములను లింగమనేని కలిపేసుకున్నారని తెలిపే ఆధారాలవి. భూ సమీకరణ విషయంలో బినా మీలైతే ఒకరకంగా.. బడుగు రైతులైతే మరో రకంగా బాబు వ్యవహరించారనేందుకు అనేక ఆధారాలు న్నాయి. మూడు పంటలు పండే పేదల భూములను బలవంతంగా సమీకరించిన చంద్రబాబు ప్రభుత్వం లింగమనేని వంటివారిని మాత్రం ‘దయ’తో వదిలేసింది. నిడమర్రు సమీపంలోని లింగమనేని ఎస్టేట్‌ను రాజధాని భూ సమీకరణనుంచి తప్పిం చడం... ప్రతిఫలంగా లింగమనేనివారు ముఖ్య మంత్రికి కృష్ణానదీ గర్భంలో అక్రమంగా నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను నజరానాగా సమర్పించడం మనకు తెలిసిన విషయాలే. ఈ ఎస్టేట్‌లో 300 ఎకరాల పేదల భూములు కలిపేసుకున్న విషయం తెలిసినా ఎలాంటి చర్యలూ తీసుకోకుండా లింగమనేని విషయంలో చంద్రబాబు ఉదారంగా వ్యవహరిం చారు. ఆ వివరాలు చూద్దామా.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలో సుమారు 300 ఎకరాల్లో సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. వీటిని 1937వ సంవత్సరంలో గుర్తించిన బాంబేకు చెందిన అసోసియేట్స్ సిమెంట్స్ కంపెనీ లిమిటెడ్ (ఏసీసీ) యాజమాన్యం ఈ భూములను రైతుల దగ్గర నుంచి 99 ఏళ్ళ లీజు విధానంలో సేకరించింది. అప్పట్లో ఏసీసీ సిమెంట్స్ ఎండీ డబ్ల్యూహెచ్ బెన్నిట్స్ తరఫున కూర్మరాజు గోపాలస్వామి రైతులందరి భూములు కేవలం విక్రయ కాంట్రాక్ట్ మాత్రమే తీసుకుంటున్నట్లు రైతులకు అగ్రిమెంట్ (ఒప్పంద పత్రం) రాసిచ్చారు. సిమెంట్ కంపెనీ యాజమాన్యం సున్నపురాయి నిక్షేపాలు తవ్వడం ఆపివేసిన పక్షంలో.. లీజు కాలం వరకూ ఈ భూముల్లో పంటలు వేసుకునేందుకు రైతులకు హక్కు కల్పించారు. లీజు గడువు ముగిసిన తరువాత ఆ భూములు వాటి యజమానులైన రైతుల స్వాధీనంలోకి వచ్చేలా విక్రయ కాంట్రాక్ట్ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే అసలు మతలబు ఇక్కడే జరిగింది. లీజు గడువుకు ముందే ఏసీసీ లిమిటెడ్ ఈ భూముల్లో తవ్వకాలు నిలిపివేసి సిమెంట్ కంపెనీని తరలిపోయింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే.. పేదల భూములను ఆక్రమించిన లింగమనేని.. చంద్రబాబు అధికారంలోకి రావడంతోనే అనేక చర్యలు తీసుకున్నారు. రైతులను మభ్యపెట్టి, మాయచేసి, బెదిరించి ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారు. అనంతరం ఆ స్టాంప్ పేపర్లలో తమకు నచ్చినట్లు రాసుకుని ముఖ్యమంత్రి అండతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల సహకారంతో రూ.1500 కోట్ల విలువ చేసే భూముల్ని తన వశం చేసుకున్నారు. రాజధాని ప్రాంతం ప్రకటనకు కొద్ది రోజుల ముందే లింగమనేని ఈ 300 ఎకరాల విలువైన భూములను ఓ ఎస్టేట్ మాదిరిగా మార్చారు. భద్రతా సిబ్బంది, సీసీ కెమెరాలు, ఎక్కడికక్కడ చెక్‌పోస్టులతో పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఎస్టేట్ మొత్తాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ఎకరం రూ.ఐదు కోట్ల వర కూ పలుకుతోంది. కాజ గ్రామానికి చెందిన కొంత మంది రైతుల వద్ద ఇంకా లీజు అగ్రిమెంట్లు ఉండటంతో లింగమనేని కబ్జా భాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ భూముల పక్కనే ‘చినబాబు’ కొట్టేసిన అగ్రిగోల్డ్ హాయ్‌ల్యాండ్ కూడా ఉండటం గమనార్హం. లీజుకు ఇచ్చిన తమ భూములు ఎక్కడు న్నాయో తెలుసుకునేందుకు కాజ గ్రామస్తులు ప్రయత్నించగా, లింగమనేని ఎస్టేట్‌లో ఉన్నట్లు తేలింది. పేదల వద్ద పక్కా ఆధారాలు... లింగమనేని ఎస్టేట్స్ యాజమాన్యం అధీనంలో ఉన్న భూముల్లో తమ భూములు కూడా ఉన్నాయని, వాటికి సంబంధించిన పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని బాధిత రైతులు తెలిపారు. అయితే తమ భూములను చూసేందుకు కూడా వీలు లేకుండా ప్రై వేట్ సైన్యాన్ని పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని వాపోతున్నారు. సీఎం చంద్రబాబు అండదండలు ఉండటం వల్లే లింగమనేని ఎస్టేట్స్ వైపు కన్నెత్తి చూసేందుకు అటు రెవెన్యూ.. ఇటు పోలీసు అధికారులు సాహసించడం లేదు. సర్వే నెంబరు 191, 192, 226 ఇలా అనేక సర్వే నెంబర్లలో ఉన్న 300 ఎకరాల భూమిని లింగమనేని యాజమాన్యం కొట్టేసిందని బాధితుల కథనం. రాజధాని దురాక్రమణపై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో బాధితులు తమ వద్ద ఉన్న విక్రయ డాక్యుమెంట్ల ఆధారాలతో ‘సాక్షి’ ప్రతినిధులను ఆశ్రయించడంతో లింగమనేని గ‘లీజు’ దందా వెలుగులోకి వచ్చింది. -
ఎయిర్ కోస్టా ‘రీ ఫ్రెష్’ ఆఫర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ప్రాంతీయ విమాన సర్వీసుల సంస్థ ఎయిర్కోస్టా ‘రీఫ్రెష్ మంత్’ పేరుతో ప్రయాణికులకు ఉచిత అల్పాహారాన్ని అందిస్తోంది. ఫిబ్రవరి నెలల్లో ఎయిర్‌కోస్టాలో ప్రయాణించే ప్రయాణికులకు కాంప్లిమెంటరీ స్నాక్స్‌ను అందిస్తున్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. విజయవాడ-బెంగళూరు, విజయవాడ-హైదరాబాద్, విశాఖపట్నం-హైదరాబాద్ సర్వీసుల్లో ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. -
ఎగిరిన విమానం.. ఫార్మాకు గాయం
► ఆస్తులు విక్రయించి గట్టెక్కుతున్న ఇన్ఫ్రా కంపెనీలు ► 2016లో నష్టాలు మరింత తగ్గి లాభాలు చూసే అవకాశం ► ఐటీలో అత్యున్నత పదవులకు ఎగుస్తున్న తెలుగు తేజాలు ► ఆసుపత్రుల్లో వాటాలకు విదేశీ ఇన్వెస్టర్ల భారీ ఆఫర్లు ఎగిరే అవకాశాలను అందుకోవటానికి విమానయానంలోకి కొత్త కంపెనీలొచ్చాయి. ఇప్పటికే ఉన్న కంపెనీలు విస్తరణ దిశగా మరింత పెకైగిశాయి. కొన్నేళ్లుగా నష్టాలతో కునారిల్లుతున్న ఇన్ఫ్రా రంగం కాస్తంత తేరుకుంది. కంపెనీలు ఆస్తులు విక్రయించి రుణ భారం దించుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలు కాస్త సఫలమయ్యాయి. ఐటీలో మనవాళ్లు విజయబావుటాలు ఎగురవెయ్యగా... హెల్త్కేర్లోకి పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. ఆసుపత్రుల విలువలు అమాంతం ఎగిశాయి. కానీ మన ఫార్మా రంగం మాత్రం బోలెడంత అప్రదిష్ట మూటగట్టుకుంది. వచ్చే ఏడాది ఈ మచ్చను తుడిచేసే ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే... ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో పరిశ్రమలకు సానుకూలంగా గడవగా... వచ్చే ఏడాది మరిన్ని ఆశలు రేపుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలకు తోడు, వడ్డీరేట్లు, చమురు, లోహాల ధరలు దిగిరావడంతో ఇన్ఫ్రా కంపెనీలు కవరీ బాట పట్టాయి. ఎన్సీసీ, గాయత్రీ వంటి కంపెనీలు లాభాల బాట పట్టగా, జీవీకే, జీఎంఆర్, ల్యాంకో సంస్థలు నష్టాలు తగ్గించుకున్నాయి. కేంద్రం ఈ రంగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పెండింగ్ ప్రాజెక్టుల క్లియరెన్స్‌కు ప్రోత్సాహకాలు ప్రకటిస్తుండటంతో వచ్చే ఏడాది అన్ని కంపెనీలూ లాభాల్లోకి రావచ్చనేది అంచనా. అప్పుల ఊబిలో కూరుకున్న జీవీకే, జీఎంఆర్, ల్యాంకో, ఐవీఆర్సీఎల్లు ఆస్తులను విక్రయించడం ద్వారా అప్పుల భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ఐవీఆర్‌సీఎల్‌కు ఈ సంవ త్సరం చేదు అనుభవం మిగిలింది. అప్పుల భారం తప్పటానికి చేసిన యత్నాలు విఫలం కావటంతో కంపెనీపై యాజమాన్య హక్కులను పొందడానికి బ్యాంకులు ఎస్డీఆర్ అస్త్రాన్ని ప్రయోగించాయి. అంతేకాకుండా కంపెనీని ఈపీసీ, అసెట్స్‌గా విడదీయాలని నిర్ణయించాయి. ఫార్మాకి మాయని మచ్చ దేశంలో రెండో అతిపెద్ద ఫార్మా కంపెనీగా ఉన్న డాక్టర్ రెడ్డీస్‌కి చెందిన మూడు తయారీ కేంద్రాలకు యూఎస్ఎఫ్డీఏ వార్నింగ్ లేఖలను జారీ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయమయ్యింది. సన్ ఫార్మా, మైలాన్ యూనిట్లకూ ఈ తరహా లేఖలు వచ్చినా ఇంత పెద్ద చర్చ జరగలేదు. కారణం... రెడ్డీస్‌కి చెందిన మూడు యూనిట్లకు ఒకేసారి హెచ్చరిక లేఖలు రావడమే. విజయనగరం ఏపీఐ యూనిట్లో సమస్యలున్న సంగతి తెలుసుకానీ, తెలంగాణలోని మిర్యాలగూడ ఏపీఐ యూనిట్, విశాఖ సమీపంలోని దువ్వాడ వద్ద ఉన్న క్యాన్సర్ యూనిట్లో సమస్యలున్నట్లు ఇప్పటిదాకా వెల్లడి కాకపోవటం సమస్య తీవ్రతను పెంచింది. డాక్టర్ రెడ్డీస్ తర్వాత అంత చర్చజరిగిన అంశం ఏదైనా ఉందంటే అది క్లినికల్ ట్రయల్స్ సంస్థ జీవీకే బయోదే. ఈ సంస్థ జరిపిన క్లినికల్ ట్రయల్స్ నివేదికలు తప్పులతడకలుగా ఉన్నాయంటూ జీవీకే బయో పరీక్షలు నిర్వహించిన 700 జెనరిక్ డ్రగ్స్‌ను యూరోపియన్ యూనియన్ నిషేధించింది. ఇది కంపెనీ పేరు ప్రతిష్టలకు పెద్ద విఘాతం కల్గించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దేశీయ ఫార్మా కంపెనీలు కొత్త ఔషధాలకు అనుమతులు బాగానే పొందాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అరబిందో, నాట్కో, డాక్టర్ రెడ్డీస్, సువెన్‌లైఫ్ వంటి కంపెనీలు అనేక జెనరిక్ ఔషధాలకు అనుమతులు, పేటెంట్లను దక్కించుకున్నాయి. జపాన్, ఆఫ్రికా దేశాల వంటి కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడంతో రానున్న కాలంలో దేశీ ఫార్మా మరింత వేగంగా వృద్ధి చెందుతుందని అంచనా. విమానయానంలో జెట్ స్పీడ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది అత్యధిక సానుకూల పరిణామాలు చోటు చేసుకున్న రంగాలేమైనా ఉంటే అవి విమానయాన, తత్సంబంధిత రంగాలే. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఎయిర్‌కోస్టాకు ఈ ఏడాది నేషనల్ కారియర్‌గా ప్రమోషన్ లభించింది. హైదరాబాద్ కేంద్రంగా ట్రూజెట్ పేరుతో మరో ప్రాంతీయ విమాన సర్వీసు సంస్థ ప్రారంభమయింది. ఈ కంపెనీకి టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ డైరక్టర్‌గా ఉండటమే కాకుండా ట్రూజెట్‌కు బ్రాండ్ అంబాసిడర్ కూడా. కొత్తగా కడప విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. విశాఖ దగ్గర మరో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు వుర్గం సుగమమైంది.. తిరుపతి సమీపంలోని రేణుగుంటలో కొత్త అంతర్జాతీయ టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్.. బోయింగ్‌తో కలిసి ‘ఏహెచ్ 64’ హెలికాప్టర్లను తయారు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఐపీవోల సందడి కొనేళ్ల విరామం తర్వాత తెలుగు రాష్ట్ర కంపెనీలు తిరిగి స్టాక్ మార్కెట్లో సందడి చేశాయి. ఇప్పటికే రెండు కంపెనీలు ఐపీవోకి రాగా, మరొక కంపెనీకి అనుమతులు లభించాయి. ఇన్ఫ్రా రంగానికి చెందిన పెబ్స్ పెన్నార్, పవర్‌మెక్ కంపెనీలు స్టాక్ మార్కెట్ ద్వారా రూ.330 కోట్లు సమీకరించాయి. ఇందులో పెబ్స్ పెన్నార్ ఇన్వెస్టర్లను నిరాశపర్చగా, పవర్‌మెక్ స్వల్ప లాభాలు అందించింది. ఐపీవోకి రావడానికి అనుమతులు పొందిన విత్తన కంపెనీ నూజివీడు సీడ్స్ సరైన పరిస్థితుల కోసం ఎదురు చూస్తోంది. ఐటీలో తెలుగు వెలుగులు ఈ ఏడాది ఐటీలో తెలుగు తేజాలు మెరిశాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్‌కి తెలుగు తేజం సత్య నాదెళ్ల సీఈవోగా నియమితులయ్యారు. అలాగే దేశంలో ఐటీ రంగాన్ని ప్రోత్సహించడానికి ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసుకున్న నాస్కామ్‌కి చైర్మన్‌గా బీ.వి.ఆర్. మోహన్ రెడ్డి నియమితులు కావడం విశేషం. సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ సీఈవోగా విజయవాడకు చెందిన పద్మశ్రీ వారియర్ పోటీ పడినా చివర్లో ఆ అవకాశాన్ని కోల్పోయారు. హాస్పిటల్స్ విలువలు జూమ్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న హాస్పిటల్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. కేర్, గ్లోబల్, కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో వాటాలను విదేశీ సంస్థలు అత్యధిక ధరకు కైవసం చేసుకున్నాయి. ఈ మధ్యనే కేర్ హాస్పిటల్స్‌లో 72 శాతం వాటాను అడ్వెంట్ ఇంటర్నేషనల్ నుంచి రూ. 1,800 కోట్లకు సింగపూర్‌కు చెందిన టెమాసెక్ కొనుగోలు చేసింది. ఈ వాటాను 2012లో అడ్వెంట్ రూ. 680 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే గ్లోబల్ హాస్పిటల్స్‌లో 74 శాతం వాటాను మలేషియా కంపెనీ పార్క్‌వే హాస్పిటల్ (ఐహెచ్‌హెచ్ గ్రూపు) రూ. 2,150 కోట్లకు కొన్నది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో 51% వాటాకోసం ఐహెచ్‌హెచ్ గ్రూపు రూ. 300 కోట్లు వెచ్చించింది. చిన్నాచితకా హాస్పిటల్స్ కూడా చేతులు మారాయి. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న నోవా హాస్పిటల్స్‌ను రూ. 140 కోట్లకు అపోలో కొనుగోలు చేసింది. ఇప్పటికే రెయిన్బో, కిమ్స్ హాస్పిటల్స్‌లో ఇన్వెస్ట్ చేసిన విదేశీ ఇన్వెస్టర్లు తమ వాటాలను మరింత పెంచుకునే అంశాలను పరిశీలిస్తున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే 2016లో హాస్పిటల్స్ విలువ మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఎయిర్కోస్టా... ఇక దేశ వ్యాప్తం..!
► వచ్చే వేసవి నుంచి సేవలు ప్రారంభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ప్రాంతీయ విమానయాన సర్వీసుల సంస్థ ఎయిర్‌కోస్టాకు దేశ వ్యాప్తంగా సర్వీసులు నడపడానికి అనుమతి లభించింది. కేంద్ర పౌర విమానయాన సంస్థ దేశ వ్యాప్తంగా విమాన సర్వీసులు నడపడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) ఇచ్చినట్లు ఎయిర్కోస్టా ఒక ప్రకటనలో పేర్కొంది. వచ్చే వేసవికి దేశవ్యాప్త సర్వీసులు నడిపే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ఎయిర్కోస్టా డిప్యూటీ సీఈవో వివేక్ చౌదరి తెలిపారు. ఈ నెలల్లో 100 సీట్ల సామర్థ్యం ఉన్న ఎంబారియర్ ఈ-190 విమానం వచ్చి చేరుతుందని, దీంతో మొత్తం విమానాల సంఖ్య 5కు చేరుతుందన్నారు. ఇది కాకుండా ఫిబ్రవరిలో మరో ఈ-190 రానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎయిర్కోస్టా నాలుగు విమానాలతో రోజుకు 32 సర్వీసులను నడుపుతోంది. రెండేళ్లలోనే ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయి విమానయాన సంస్థగా ఎదగడంపై ఎయిర్కోస్టా చైర్మన్ రమేష్ లింగమనేని సంతోషం వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం 300 సిబ్బంది, రెండు విమానాలు, 5 పట్టణాలతో ప్రారంభమైన ఎయిర్కోస్టా ఇప్పుడు 800 మంది సిబ్బంది, నాలుగు విమానాలు, 9 పట్టణాలకు సర్వీసులను అందిస్తున్నట్లు తెలిపారు. రానున్న కాలంలో ఢిల్లీ, భువనేశ్వర్‌కు విమాన సర్వీసులను ప్రారంభించే యోచనలో ఎయిర్కోస్టా ఉంది. -
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన
చెన్నై : చెన్నై నుంచి హైదరాబాద్‌కు శనివారం ఉదయం బయలుదేరవలసిన ఎయిర్ కోస్టా విమాన సర్వీసు రద్దు అయింది. సదురు విమానంలో హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయాణికులు ఈ రోజు తెల్లవారుజామునే చెన్నై ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. విమాన సర్వీసు రద్దు విషయం తెలియని ప్రయాణికులు ఎయిర్ పోర్ట్‌లో పడిగాపులు పడతున్నారు. విమానం ఎందుకు రద్దు అయిందని ఎయిర్ పోర్ట్ అధికారులను ప్రయాణికులు ప్రశ్నించారు. ఎయిర్ కోస్టా అధికారుల నుంచి మాత్రం ఎటువంటి సమాధానాలు రాలేదు. దీంతో ఎయిర్ కోస్టా యాజమాన్యం నిర్లక్ష్యంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎయిర్ పోర్ట్ లో ఆందోళనకు దిగారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇదే పరిస్థితి హైదరాబాద్ : బెంగళూరు నగరానికి ఎయిర్ ఇండియా విమానం శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో నిలిచిపోయింది. ఆ విమానంలో బెంగళూరు వెళ్లేందుకు అప్పటికే ప్రయాణికులు ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. బెంగళూరు వెళ్లవలసిన విమాన సర్వీస్ లేదని తెలుసుకున్న ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలా వ్యవహరించడం దారుణమని ఎయిర్ ఇండియా అధికారులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా ప్రయాణికులు ఆందోళనకు దిగారు. -
ఎయిర్కోస్టా నిధుల సేకరణకు బ్రేక్!
మంచి ధర కోసం బ్రాండ్ బిల్డింగ్‌పైనే దృష్టి కొత్త ఎయిర్‌లైన్ విధానం వచ్చాకే నిధుల సమీకరణ ఇండిగో ఐపీవో విజయవంతంతో పెరిగిన నమ్మకం దేశవ్యాప్త కార్యకలాపాలపై దృష్టి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రాంతీయ విమానయాన సర్వీసుల సంస్థ ఎయిర్కోస్టా నిధుల సమీకరణ ప్రక్రియను తాత్కాలికంగా పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. కొత్తగా విడుదల చేసిన పౌర విమానయాన విధాన ముసాయిదా విదేశీ పెట్టుబడులను స్వీకరించడానికి అనుకూలంగా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కొన్నాళ్లుగా వాటాలను విక్రయించడం ద్వారా వ్యాపార విస్తరణకు నిధులు సేకరించాలని ఎయిర్కోస్టా చూస్తోంది. ఇప్పటికే చాలా దేశీ, విదేశీ సంస్థలతో చర్చలు జరిపినప్పటికీ ఆయా సంస్థలు ఆఫర్ చేస్తున్న ధర చాలా తక్కువగా ఉండటంతో ఈ చర్చలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. త్వరలోనే ఎయిర్కోస్టా ప్రాంతీయ విమానయాన సంస్థ నుంచి నేషనల్ కారియర్‌గా మారనుండటంతో తమ బ్రాండ్ విలువ కూడా పెరుగుతుందని, అప్పుడు అధిక ధర వస్తుందన్నది కంపెనీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. వచ్చే నెలలో నేషనల్ కారియర్ అనుమతులు లభిస్తే, జనవరి నెలాఖరుకు ఢిల్లీ, భువనేశ్వర్‌కు విమాన సర్వీసులు ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ప్రస్తుతం ఉన్న 67 సీటర్ల ఈ-170 విమానాల స్థానంలో 112 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ-190 విమానాలను తీసుకురానున్నారు. దీనివల్ల కంపెనీ నిర్వహణ లాభం మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్రాండ్ బిల్డింగ్‌పైనే ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని, వచ్చే ఏప్రిల్, మే తర్వాతనే నిధుల సేకరణ జరపాలని అంతర్గతంగా నిర్ణయించుకున్నట్లు ఈ వ్యవహారాలతో నేరుగా సంబంధం ఉన్న కంపెనీ ప్రతినిధి చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా బ్రాండ్ బిల్డింగ్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, మార్చిలోగా మొబైల్ యాప్‌ను కూడా తీసుకురానున్నట్లు తెలిపారు. -
ఎయిర్కోస్టా రూ.1,000 డిస్కౌంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇప్పటి వరకు ఎయిర్‌కోస్టాలో పది లక్షల మంది ప్రయాణం చేసినందుకు గాను అన్ని టికెట్లపై రూ. 1,000 డిస్కౌంట్‌ను ప్రకటించింది. జూలై 10 ఉదయం10 గంటల నుంచి జూలై 14 సాయంత్రం ఆరు గంటల లోపు బుక్ చేసుకున్న టికెట్లపై ఈ తగ్గింపు వర్తిస్తుందని ఎయిర్కోస్టా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లతో ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 24లోపు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. -
ఎయిర్కోస్టా ‘మాన్సూన్ ఆఫర్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సేవలందిస్తున్న ఎయిర్కోస్టా మాన్సూన్ సేల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా చార్జీలపై ఫ్లాట్ డిస్కౌంట్లను అందిస్తోంది. టికెట్ల ధర రూ.1,499 మొదలుకుని ప్రారంభం. జూన్ 15 నుంచి సెప్టెంబరు 30 మధ్య ప్రయాణ తేదీలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. టికెట్లను మే 25-29 మధ్య బుక్ చేసుకోవాలి. ఎకానమీ క్లాస్ టికెట్లపై మాత్రమే ఆఫర్ పొందవచ్చు. -
నేషనల్ క్యారియర్‌గా ఎయిర్కోస్టా!
⇒ సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్తంగా సర్వీసులు ⇒ ఈ ఏడాది మరో ఆరు విమానాలు రాక ⇒ ఎయిర్కోస్టా చైర్మన్ రమేష్ లింగమనేని హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో తొలి ప్రాంతీయ విమాన సర్వీసులను ప్రారంభించిన ఎయిర్కోస్టా త్వరలోనే నేషనల్ క్యారియర్‌గా మారనుంది. జాతీయ స్థాయి విమానయాన సంస్థగా గుర్తింపును కోరుతూ ఒకటి రెండు రోజుల్లో కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేయనున్నట్లు ఎయిర్కోస్టా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణాలకు విమాన సర్వీసులను అందించే ఉద్దేశంతో రీజనల్ కారియర్ నుంచి నేషనల్ క్యారియర్‌గా మారాలని నిర్ణయించినట్లు ఎయిర్కోస్టా చైర్మన్ రమేష్ లింగమనేని తెలిపారు. దీనికి సంబంధించి దరఖాస్తులను ఒకటి రెండు రోజుల్లో సమర్పించనున్నామని, సెప్టెంబర్ నాటికి నేషనల్ క్యారియర్‌గా గుర్తింపు లభిస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఈ ఏడాది కొత్తగా మరో ఆరు విమానాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఎయిర్కోస్టా నాలుగు విమానాలతో తొమ్మిది పట్టణాల నుంచి 34 డైలీ సర్వీసులను అందిస్తోంది. ప్రాంతీయ విమానయాన రంగంలోకి కొత్త కంపెనీలు ప్రవేశిస్తున్న దానిపై స్పందిస్తూ... దేశీయ విమానయాన రంగంలో చాలా అవకాశాలున్నాయని, ఏ కంపెనీ ఎవరికీ పోటీ కాద.న్నారు. ప్రస్తుతం ఎయిర్కోస్టా నిర్వహణా లాభాల్లోకి వచ్చినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ఎయిర్కోస్టా వేసవి ఆఫర్లు
హైదరాబాద్: ఎయిర్కోస్టా ‘సమ్మర్ బొనంజా సేల్’ పేరుతో రూ. 1,099 నుంచి రూ. 3,990లకే విమాన టికెట్లను అందిస్తోంది. విజయవాడ - విశాఖ పట్నం మధ్య రూ. 1,099, విజయవాడ - చెన్నై మధ్య రూ. 1,499, హైదరాబాద్ - వైజాగ్, బెంగళూర్-హైదరాబాద్, బెంగళూరు-విజయవాడ, హైదరాబాద్- విజయవాడ పట్టణాల మధ్య రూ. 1,699లకు, చెన్నై-జైపూర్ రూ. 3,990లకే టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఏప్రిల్ 22 ఉదయం 10 గంటల నుంచి ఏప్రిల్ 24 మధ్యాహ్నం 12 గంటల లోపు టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఈ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లతో జూన్ 10 నుంచి సెప్టెంబర్ 30లోపు ప్రయాణం చేయొచ్చు.