ఎయిర్‌ కోస్టా ఎత్తేస్తారా? | Air Costa's woes worsen; more than 40 pilots quit | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ కోస్టా ఎత్తేస్తారా?

Published Mon, Mar 20 2017 12:50 AM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM

ఎయిర్‌ కోస్టా ఎత్తేస్తారా?

ఎయిర్‌ కోస్టా ఎత్తేస్తారా?

పైలట్లందరూ కంపెనీకి గుడ్‌బై
300 మందికిపైగా ఉద్యోగుల రాజీనామా
రెండు నెలలుగా సిబ్బందికి జీతాల్లేవ్‌
మరో కింగ్‌ఫిషర్‌ అంటున్న సిబ్బంది  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో : ప్రపంచ దేశాల్లో రెక్కలు వాల్చాలని ఆశగా ఎదురు చూసిన ఎయిర్‌ కోస్టా శకం ముగిసినట్టే కనిపిస్తోంది. అప్పుల ఊబిలో చిక్కుకున్న సంస్థను ఆదుకోవడానికి ఇన్వెస్టర్లు ఎవరూ ముందుకు రాకపోవటంతో కంపెనీలో పరిణామాలు వేగంగా  మారిపోతున్నాయి. జనవరి నుంచి తమకు జీతాలు చెల్లించటం లేదని, ఇది మరో  కింగ్‌ఫిషర్‌గా మారుతోందని కొందరు ఉద్యోగులు గట్టిగానే చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఎయిర్‌కోస్టా విమానాలు ఎగరటం నిలిచిపోయాయి.

మొదట్లో ఈ అవాంతరాలు రెండు మూడు రోజులే ఉంటాయని చెబుతూ వచ్చిన సంస్థ ప్రమోటర్లు... ఇప్పటికీ విమాన సర్వీసుల పునరుద్ధరణ జరగకపోయినా మౌనం వీడటం లేదు. వీటన్నిటికీ తోడు ఉద్యోగులు ఒక్కరొక్కరుగా రాజీనామా చేస్తున్నా... ప్రధానంగా పైలట్లు కంపెనీని విడిచి పోతున్నా... వారిని నిలువరించే ప్రయత్నాలు కూడా చేయటం లేదు. ‘‘ఇదంతా చూస్తుంటే సంస్థను మూసివేయటానికే ప్రమోటర్లు ఇష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.

ఒక్కొక్కరుగా సీనియర్‌ ఉద్యోగులంతా వెళ్లిపోతున్నా ఒక్కరిని కూడా ఆపే ప్రయత్నాలు చేయటం లేదు’’ అని కంపెనీలో కీలక స్థానంలో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు సాక్షి బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు.  రాజీనామాలు చేసిన వెంటనే వాటిని ఆమోదించడం చకచకా జరిగిపోతున్నట్లు తెలియజేశారు. ఏడాదిగా వేతనాలు సరిగా రావడం లేదని ఆయన వాపోయారు. ‘‘కొత్త ఇన్వెస్టర్‌ వస్తేనే విమానాలు ఎగురుతాయని కంపెనీ చెబుతున్నప్పటికీ ఇప్పట్లో ఇది సాధ్యపడే అవకాశాలు కనిపించటం లేదు. ఎందుకంటే కంపెనీకి ఉన్నపళంగా రూ.250 కోట్లదాకా నిధులు కావాలి. ఆ స్థాయిలో పెట్టేందుకు ఎవ్వరూ ముందుకొచ్చే అవకాశాలు లేవు’’ అని ఆయన వివరించారు.

బాధితులుగా మిగిలిపోయాం..
కంపెనీలో 40 మంది వరకు పైలట్లు ఉండేవారు. దాదాపుగా వీరందరూ వేరే విమానయాన కంపెనీల్లో చేరిపోయారు. అలాగే ఇతర విభాగాల్లో దాదాపు 600 మంది ఉద్యోగులు పనిచేసేవారు. ఇప్పుడీ సంఖ్య సగానికంటేపైగా తగ్గిపోయింది. మిగిలిన ఉద్యోగులు కూడా ఇతర అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. చాన్స్‌ రాగానే జంప్‌ అవుతా రని ఇంకా కంపెనీలోనే ఉన్న మరో ఉద్యోగి తెలియజేశారు. ప్రమోటర్లకు, ఉద్యోగులకు మధ్య అంతరం ఉందని చెప్పారాయన. ‘రాజీనామాలు చేస్తుంటే వద్దని ఎవరూ వారించడం లేదు.

 ఇప్పటి వరకు కంపెనీలో ఏం జరుగుతోందో పత్రికలు, వార్తా చానెళ్ల ద్వారానే తెలుస్తోంది. ప్రమోటర్లు ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కవి చౌరాసియా మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కింగ్‌ఫిషర్‌ విషయంలో విజయ్‌ మాల్యా కనీసం అప్పుడప్పుడైనా మాట్లాడారు. ఎయిర్‌ కోస్టా విషయంలో అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రభుత్వానికి అంతా తెలుసు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎవరికీ పట్టడం లేదు. మేము ఇప్పుడు బాధితులుగా మిగిలిపోయాం’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎగిరే అవకాశం లేదు..
వేలాది మంది కస్టమర్లు ఎయిర్‌ కోస్టా టికెట్లు బుక్‌ చేసుకున్నారు. సర్వీసులు రద్దు అయిన తర్వాత కస్టమర్ల సొమ్ము తిరిగి చెల్లించేందుకు కంపెనీ ఏర్పాట్లేవీ చేయలేదని మరో ఉద్యోగి చెప్పారు. కస్టమర్‌ కేర్‌ నంబరు సైతం మూగబోయింది. విమానాశ్రయాల్లో కంపెనీ ఏర్పాటు చేసిన ఆఫీసులను ఉద్యోగులు తెరుస్తున్నారా లేదా అన్న విషయమూ కంపెనీ పట్టించుకోవడం లేదని మరో ఉద్యోగి చెప్పారు. కస్టమర్‌తో మాట్లాడేందుకు ఉద్యోగులు ఎవరూ లేరని చెప్పారు.

ఎయిర్‌ కోస్టా బ్రాండ్‌ కథ ముగిసినట్టేనని వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లు ముందుకు వచ్చినా కంపెనీ నిలబడుతుందో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. 2017 మే 31 వరకు సర్వీసులు నిలిపివేసినట్టు కంపెనీ చెబుతున్నా.. మరో నాలుగైదు నెలల దాకా విమానాలు ఎగిరే అవకాశం లేదని, ఆ తరవాతా అనుమానమేనని ఆయన స్పష్టం చేశారు. కాగా విశ్వసనీయ సమాచారం మేరకు శంషాబాద్‌ విమానాశ్రయానికి రూ. కోటి, జైపూర్‌ విమానాశ్రయానికి రూ.40 లక్షలు బాకీ ఉన్నట్టు తెలిసింది. ఉద్యోగులకేగాక ఎయిర్‌ కోస్టాకు సర్వీసులు అందించే అన్ని కంపెనీలకు బకాయిలు పేరుకు పోయాయి.  

ఇంకా ఇన్వెస్టర్ల వేట..
మరో మూడు నెలల దాకా విమానాలు ఎగిరే అవకాశం లేదని కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ కవి చౌరాసియా స్పష్టం చేశారు. ఇన్వెస్టర్ల అన్వేషణ కొనసాగుతోందని వెల్ల డించారు. ఇన్వెస్టర్‌ ఎవరైనా ముందుకు వచ్చారా అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని పేర్కొన్నారు. 250 మంది కంపెనీని విడిచి Ðð ళ్లినట్టు తెలిపారు.

ఏడాదిలో రూ.130 కోట్ల నష్టం
వివిధ వర్గాల సమాచారం మేరకు... జనవరి నెలకు రూ.2.5 కోట్లు, ఫిబ్రవరికి రూ.3 కోట్ల వేతనాలు కంపెనీ బకాయి పడింది. ఉన్న ఉద్యోగుల్లో యాజమాన్యానికి బాగా కావాల్సిన అతి కొద్ది మందికే జనవరి వేతనాలు అందాయి. ఉద్యోగుల ఖాతాల్లో పీఎఫ్‌ జమ కూడా నిలిచిపోయింది. అందరికీ మార్చి 15 నాటికల్లా బకాయిలు చెల్లిస్తానని చెప్పిన కంపెనీ... 20వ తేదీ నాటికి కూడా అలాంటి ప్రయత్నాలేమీ చేయలేదు. వివిధ వ్యాపారాలను నిర్వహిస్తున్న ఎల్‌ఈపీఎల్‌ గ్రూప్‌నకు జీతాల మొత్తం పెద్ద భారం కాదని, అయినా చెల్లించకపోవటంతో కంపెనీ తీరు అనుమానాలకు తావిస్తోందని సీనియర్‌ ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించారు.  పౌర విమానయాన శాఖకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎయిర్‌ కోస్టా 2015–16లో రూ.327 కోట్ల టర్నోవరుపై రూ.130 కోట్ల నష్టం చవిచూసింది. నిర్వహణ వ్యయాలు రూ.457 కోట్లుగా ఉన్నాయి. ఎయిర్‌ కోస్టాకు జీఈ క్యాపిటల్‌ ఏవియేషన్‌ సర్వీసెస్‌ మొత్తం మూడు విమానాలను అద్దెకు సమకూర్చింది. ఈ కంపెనీకి చెల్లించాల్సిన బకాయిలపై వివాదం తలెత్తడంతో 20 రోజులుగా విమానాలు ఎగరడం లేదు. ఇలాంటి వివాదంతోనే 2016 ఆగస్టు తొలివారంలో ఒక రోజు పూర్తిగా, మరోరోజు పాక్షికంగా సర్వీసులను ఎయిర్‌ కోస్టా నిలిపివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement