ఎయిర్ కోస్టా.. టేకాఫ్‌కు రెడీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన తొలి విమానయాన సంస్థ ‘ఎయిర్ కోస్టా’ ఈనెల 14 నుంచి తన వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనుంది. ప్రారంభంలో రెండు విమానాలతో ఆరు నగరాలకు సర్వీసులను అందిస్తున్నట్లు ఎయిర్ కోస్టా ప్రకటించింది. మంగళవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఎయిర్ కోస్టా మేనేజింగ్ డెరైక్టర్ రమేష్ లింగమనేని టికెట్ల విక్రయాన్ని అధికారికంగా ప్రారంభించారు. విజయవాడ కేంద్రంగా ప్రారంభంలో ఆరు నగరాలకు సర్వీసులను అందిస్తున్నామని, 2018 నాటికి అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై వంటి నగరాల నుంచి జైపూర్, అహ్మదాబాద్ వంటి నగరాలకు నేరుగా విమాన సర్వీసులు లేవని, ఇలాంటి రూట్లపై అధికంగా దృష్టిసారిస్తున్నట్లు ఆయన తెలిపారు. మొదటిదశలో భాగంగా ఈనెల 14 నుంచి విజయవాడ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, జైపూర్, అహ్మదాబాద్ నగరాలకు సర్వీసులను ప్రారంభిస్తామని, రెండో దశ కింద మదురై, మైసూర్, గోవా, తిరువనంతపురం, విశాఖపట్టణాలకు సేవలను విస్తరించనున్నట్లు రమేష్ తెలిపారు. ప్రస్తుతం ఎంబ్రియర్‌కి చెందిన రెండు ఎయిర్ క్రాఫ్టులతో ఈ సేవలను అందిస్తున్నామని, 2014 నాటికి ఈ సంఖ్యను 4కి, 2018 నాటికి 25కి పెంచాలన్నది లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు రూ.150 కోట్లు ఇన్వెస్ట్ చేశామని, ఇదంతా అంతర్గతంగా సమకూర్చుకున్న నిధులేనని, పూర్తిగా నిలదొక్కుకున్న నమ్మకం ఏర్పడిన తర్వాత రుణాల రూపంలో నిధులు సమీకరించనున్నట్లు తెలిపారు. వచ్చే రెండేళ్లలో విస్తరణ కోసం 100 మిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
2015 నాటికి కార్గో సేవల్లోకి
కార్యకలాపాలు ప్రారంభించిన సంవత్సరంలోగా బ్రేక్ ఈవెన్ సాధించాలన్న భారీ లక్ష్యాన్ని ఎయిర్ కోస్టా నిర్దేశించుకుంది. ఇది కొంత కష్టమే అయినప్పటికీ దీన్ని సాధించగలమన్న ధీమాను ఎయిర్‌కోస్టా ప్రమోటర్ కంపెనీ ఎల్‌ఈపీఎల్ ఫైనాన్స్ డెరైక్టర్ సి.టి.చౌదరి వ్యక్తం చేశారు. ఇన్‌ఫ్రా, రెన్యువబుల్ ఎనర్జీ రంగాల్లో ఉన్న ఎల్‌ఈపీఎల్ రూ.200 కోట్ల వార్షిక టర్నోవర్‌ను, రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్యాసింజర్ సేవలతో పాటు, చార్టర్డ్, కార్గో సేవల్లోకి ప్రవేశించనున్నామని, దీనికి సంబంధించిన అనుమతుల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నామని, 2015లోగా ఈ రంగంలోకి ప్రవేశించాలన్నది లక్ష్యమని చౌదరి పేర్కొన్నారు.