ఈ నెల 5 వరకూ కార్యకలాపాలు బంద్
ఎయిర్ కోస్టా వెల్లడి
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్ కోస్టా తన కార్యకలాపాలను ఈ నెల 5 వరకూ సస్పెండ్ చేసింది. నిధుల సమీకరణలో సమస్యలు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఎయిర్ కోస్టా వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) కవి చౌరాసియా చెప్పారు. రెండు రోజుల పాటు కార్యకలాపాలను నిర్వహించలేమని మంగళవారం ఈ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. నిధుల సమీకరణ విషయమై ఆసక్తిగా ఉన్న ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నామని, ఈ లావాదేవీ ఖరారు కావడానికి మరికొంత సమయం పడుతుందని కవి చౌరాసియా వివరించారు.
ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కార్యకలాపాలను మరికొన్ని రోజులు నిలిపేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. చాలా మంది ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు కూడా చెల్లించలేదని సమాచారం. ఈ సంస్థ రోజుకు ఎనిమిది నగరాలకు 16 విమాన సర్వీసులను నిర్వహించేది. ఈ కంపెనీకి రెండు లీజ్‌డ్ విమానాలున్నాయి. మొత్తం 600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో విమాన సర్వీసులను నిలిపేసిన రెండో కంపెనీ ఇది. ఇంతకు ముందు ఎయిర్ పెగాసస్ ఇలాగే విమాన సర్వీసులను ఆపేసింది.