ఎయిర్‌లైన్స్ దీపావళి ధమాకా
మరోసారి పోటాపోటీగా ఆఫర్లు
స్పైస్‌జెట్, ఎయిర్‌కోస్టా, జెట్ చౌక టికెట్లు
ముంబై: పండుగ సీజన్‌లో దేశీ విమానయాన సంస్థలు మరోసారి పోటాపోటీగా డిస్కౌంటు ఆఫర్లు ప్రకటించాయి. మంగళవారం ముందుగా స్పైస్‌జెట్ రూ. 899-రూ. 2,499 శ్రేణిలో (వన్ -వే, అన్ని చార్జీలు కలిపి) టికెట్లను అందిస్తున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత కొద్ది సేపటికే జెట్ ఎయిర్‌వేస్, ఎయిర్‌కోస్టా తదితర సంస్థలు డిస్కౌంట్ స్కీమ్స్ ప్రకటించాయి. స్పైస్‌జెట్ ఆఫర్ కింద అక్టోబర్ 26 దాకా బుకింగ్ చేసుకోవచ్చు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 దాకా ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది.
స్వల్ప దూరాలకు (బెంగళూరు-చెన్నై-కోచి వంటి రూట్లు ) టికెట్ చార్జీ రూ. 899 నుంచి ఉంటుంది. అదే బెంగళూరు-గోవా వంటి రూట్లలో రూ. 1,599 మేర, మిగతా రూట్లలో రూ. 2,499 స్థాయిలో చార్జీలు ఉంటాయి. రైలు టికెట్ల కన్నా తక్కువ చార్జీలకు విమాన టికెట్లను తరచూ ఆఫర్ చేస్తూ దేశీయంగా విమానయానాన్ని మరింతగా అందుబాటులోకి తెస్తున్నామని స్పైస్‌జెట్ సీవోవో సంజీవ్ కపూర్ తెలిపారు. మొత్తం మీద ఈ ఆఫర్ల కారణంగా రాబోయే రోజుల్లో బుకింగ్స్ గణనీయంగా పెరగగలవని అంచనా వేస్తున్నట్లు ట్రైవెల్ పోర్టల్ యాత్రాడాట్‌కామ్ ప్రెసిడెంట్ శరత్ ధాల్ తెలిపారు.
జెట్ డీల్..: ఇక, జెట్ ఎయిర్‌వేస్ అయిదు రోజుల పాటు ఎకానమీ తరగ తిలో రూ. 899కి (ఆల్ ఇన్‌క్లూజివ్) టికెట్లు అందిస్తోంది. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 దాకా దేశీయంగా ప్రయాణాల కోసం ఈ నెల 26 లోగా వీటిని బుక్ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది.
ఎయిర్‌కోస్టా ఆఫర్లు..
దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 25లోపు బుకింగ్ చేసుకున్న ప్రతీ టికెట్‌పై రూ. 500 తగ్గింపు ఆఫర్ అందిస్తున్నట్లు విజయవాడ కేంద్రంగా పనిచేసే ఎయిర్‌కోస్టా ప్రకటించింది. ఈ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లతో మార్చి 28, 2015 వరకు ఎప్పుడైనా ప్రయాణించొచ్చని తెలిపింది. అలాగే దేశంలోనే తొలిసారిగా చెన్నై-జైపూర్ మధ్య తొలి నాన్‌స్టాప్ ఫ్లైట్‌ను అక్టోబర్ 26 నుంచి ప్రవేశపెడుతున్నట్లు వివరించింది. ఈ టిక్కెట్ ప్రారంభ ధరను రూ.4,999గా నిర్ణయించారు.