ఎయిర్ కోస్టాలో వాటా విక్రయం!.
♦ విదేశీ ఎయిర్‌లైన్స్‌తో చర్చలు
♦ కొత్త విమానాలకై త్వరలో ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగంలో ఉన్న ఎయిర్ కోస్టా వాటా విక్రయానికి రెడీ అయింది. గల్ఫ్ ప్రాంతానికి చెందిన విమానయాన సంస్థలతో సహా పలు అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. 26 శాతం వాటా విక్రయానికై ఖతర్ ఎయిర్‌వేస్, ఎయిర్ కోస్టా మధ్య ఇటీవల చర్చలు జరిగాయి. అయితే ఎటువంటి నిర్ణయానికి ఇరు సంస్థలు రానట్టు తెలుస్తోంది.
ఎయిర్ కోస్టాలో ఎమిరేట్స్, ఎతిహాద్, గల్ఫ్ ఎయిర్‌లలో ఏదో ఒక కంపెనీ వాటా తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా విమానాలను నడిపేందుకు ఎయిర్ కోస్టాకు ఈ నెల 3న డీజీసీఏ లెసైన్సు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వాటా విక్రయానికి ఇదే సరైన సమయమని కంపెనీ భావిస్తోంది. దేశవ్యాప్త లెసైన్సుతో సంస్థ విలువ పెరగడం ఇందుకు కారణం. ఇప్పటి వరకు ప్రాంతీయ విమానయాన సంస్థగా ఉన్న ఎయిర్‌కోస్టా హైదరాబాద్‌సహా 8 నగరాలకు సర్వీసులను నడిపింది.
మరిన్ని విమానాలకై..
ప్రస్తుతం ఎయిర్ కోస్టా వద్ద ఒక్కొక్కటి 110 సీట్ల సామర్థ్యం గల మూడు ఎంబ్రార్ ఇ-190 ఫ్లైట్స్ ఉన్నాయి. ప్రతి రోజు 24 సర్వీసులను నడిపిస్తోంది. ఈ నెలలోనే మరో విమానం తోడవుతోంది. కొత్తగా ఆరు ఎయిర్‌క్రాఫ్ట్స్ కోసం సింగపూర్‌కు చెందిన జీఈ క్యాపిటల్ ఏవియేషన్ సర్వీసెస్‌తో అక్టోబరులోనే ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు ఎయిర్ కోస్టా సీఈవో వివేక్ చౌదరి తెలిపారు. 2017 జనవరి నుంచి కంపెనీలోకి వీటి రాక ప్రారంభం అవుతుందన్నారు. వచ్చే ఏడాది డిసెంబరుకల్లా సంస్థ చేతిలో ఎంబ్రార్ ఇ-190 రకం 10 విమానాలు ఉండనున్నాయి. రెండేళ్లలో మొత్తం 18 నగరాల కు సర్వీసులను అందించాలన్నది సంస్థ ప్రణాళిక. ఈ ఏడాది డిసెంబరు నుంచి కొత్త నగరాలను జోడించనుంది.