ఆగిన ఎయిర్కోస్టా సర్వీసులు!
♦ లీజింగ్ కంపెనీతో వివాదం
♦ సమసిపోయిందన్న కంపెనీ
♦ నేటి నుంచి యదావిధిగా సర్వీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ; దేశీయ విమానయాన రంగ సంస్థ ఎయిర్‌కోస్టా తన సర్వీసులను గురువారం పూర్తిగా నిలిపివేసింది. రోజూ 9 నగరాలకు దాదాపు 24 సర్వీసులను నడుపుతున్న ఈ సంస్థ... గురువారం వాటన్నిటినీ నిలిపేసింది. సాంకేతిక కారణాలతోనే నడవలేదని... కాదు ఆర్థిక కారణాల వల్లేనని రకరకాలుగా వార్తలొచ్చాయి. అయితే ఎయిర్ కోస్టా అధికారి మాత్రం లీజుకిచ్చిన సంస్థతో ఉన్న వివాదమే విమానాల నిలిపివేతకు కారణమని చెప్పారు. ‘‘వివాదం సమసిపోయింది. శుక్రవారం నుంచి సర్వీసులు యథావిధిగా నడుస్తాయి’’ అని ‘సాక్షి ’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారాయన. తమ సంస్థకు ఎలాంటి అప్పులు లేవని, నిధుల లేమి సమస్య అసలే లేదని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యల వల్లే సర్వీసులు నిలిపివేశారన్న వార్తలను ఆయన ఖండించారు.
దేశవ్యాప్తంగా విమానాలు నడపటానికి పాన్ ఇండియా లెసైన్సు కోసం దరఖాస్తు చేసుకున్న ఎయిర్‌కోస్టా... 112 సీట్ల సామర్థ్యం ఉన్న ఎంబ్రాయర్ ఈ-190 రకం విమానాలను నడుపుతోంది. ఈ సెగ్మెంట్లో ఖరీదైన ఈ విమానాలను దేశంలో నడిపిస్తున్న సంస్థ ఇదొక్కటే. అందుబాటు ధరలో ఉత్తమ సేవలందించాలన్న లక్ష్యంలో భాగంగానే వీటిని పరిచయం చే సినట్లు ఎయిర్‌కోస్టా చైర్మన్ రమేష్ లింగమనేని గతంలో చెప్పారు.
ముందుకొస్తే ఆర్థిక సహాయం..
ప్రాంతీయ విమానయాన సంస్థ ఎయిర్ పెగాసస్... జులై 27 నుంచి సర్వీసులను నిలిపివేసింది. 2015 ఏప్రిల్ నుంచి సర్వీసులు ప్రారంభించిన ఈ సంస్థ నిధుల లేమితో సతమతమవుతోంది. పెద్ద ఎత్తున అద్దె బాకీ పడటంతో దీనికి లీజుకిచ్చిన మూడు విమానాలనూ లీజింగ్ కంపెనీ స్వాధీనం చేసుకుంది. ఈ విషయాన్ని డీజీసీఏ దృష్టికి తీసుకెళ్లిన లీజింగ్ కంపెనీ.. ఎయిర్ పెగాసస్ జాబితా నుంచి ఈ విమానాలను తొలగించాలని కోరింది. తాజా పరిణామాల నేపథ్యంలో పౌర విమానయాన శాఖ స్పందించి... విమానయాన సంస్థలు ముందుకొస్తే సహాయం చేసే విషయాన్ని పరిశీలిస్తామంది. సహాయం కోసం ఏ సంస్థ కూడా తమను సంప్రదించలేదని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్.ఎన్.చౌబే పేర్కొన్నారు.