⇒ లీజింగ్ సంస్థతో వివాదమే కారణం
⇒ రెండు రోజుల్లో కొలిక్కి: కంపెనీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెండు విమానాలతో సేవలందిస్తున్న ‘ఎయిర్ కోస్టా’ సర్వీసులు మళ్ళీ నిలిచిపోయాయి. లీజింగ్ కంపెనీతో తలెత్తిన వివాదం కారణంగా మంగళ, బుధవారాల్లో సర్వీసులు రద్దయ్యాయి. గురువారం నుంచి సర్వీసులు తిరిగి పునరుద్ధరించనున్నట్లు కంపెనీ తెలిపింది. 2016 ఆగస్టు తొలి వారంలోనూ ఇలాంటి వివాదమే తలెత్తి ఒకరోజు పూర్తిగా, మరోరోజు పాక్షికంగా సర్వీసులు నిలిపివేయాల్సి వచ్చింది. లీజు వ్యయం విషయమై జీఈ క్యాపిటల్ ఏవియేషన్ సర్వీసెస్‌తో చర్చిస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. వ్యయం తగ్గితే మరిన్ని విమానాలను సమకూర్చుకోవచ్చన్నది కంపెనీ ఆలోచన. సంస్థ ప్రస్తుతం 8 నగరాలకుగాను రోజుకు 16 సర్వీసులను నడిపిస్తోంది.
వాటా కొనుగోలుకు కొత్త భాగస్వామి ఆసక్తి!
ఒకవైపు లీజు వ్యయం తగ్గించుకోవటంతో పాటు కొత్త విమానాలు సమకూర్చుకుని సర్వీసులు విస్తరించాలని చూస్తున్న సంస్థ... వాటా విక్రయ ప్రతిపాదనను మరోమారు తెరపైకి తెచ్చింది. ఈ మేరకు ఎన్‌ఆర్‌ఐ ఒకరు ఆసక్తి కనబరుస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రెండు రోజుల్లో ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చే అవకాశాలున్నట్లు కూడా కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎయిర్ కోస్టాలో 24–26 శాతం దాకా వాటా విక్రయిస్తామని, దీంతో విస్తరణ చేపడతామని ఆ వర్గాలు చెప్పాయి.
వాటా విక్రయానికి పలు విదేశీ ఎయిర్‌లైన్స్ కంపెనీలతో కూడా చర్చలు జరిపినా అవి ఫలించలేదు. దేశవ్యాప్తంగా విమానాలు నడిపేందుకు 2016 అక్టోబర్‌లోనే డీజీసీఏ నుంచి అనుమతి రాగా... అందుకు అనుగుణంగా మరో రెండు మూడు ఫ్‌లైట్స్ జత చేయాలని కంపెనీ భావించింది. దీన్ని ఈ ఏడాదైనా పూర్తి చేయాలన్నది కంపెనీ నిశ్చితాభిప్రాయమని సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.