భారత క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. సర్వీసెస్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగుల సునామీ సృష్టించాడు. అయితే, శతకానికి కేవలం మూడు పరుగుల దూరంలో ఉన్నప్పుడు రుతురాజ్ అవుట్ కావడం దురదృష్టకరం.
కాగా దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్ర జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్.. ఇటీవల రంజీ ట్రోఫీ(ఫస్ట్‌క్లాస్ క్రికెట్)లో అదరగొట్టాడు. అయితే, దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం రుతుకు శుభారంభం లభించలేదు. గత నాలుగు మ్యాచ్‌లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ చేసిన పరుగులు వరుసగా.. 1, 19, 4, 2.
48 బంతుల్లోనే 97 పరుగులు
ఈ నేపథ్యంలో రుతు టీ20 బ్యాటింగ్ తీరుపై విమర్శలు రాగా.. సర్వీసెస్‌తో మ్యాచ్ సందర్భంగా బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ఆష్రిన్ కులకర్ణి(29)తో కలిసి మహారాష్ట్ర ఇన్నింగ్స్ ఆరంభించిన రుతు.. 48 బంతుల్లోనే 97 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి.
ఇక 202కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టిన రుతు.. సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఉన్నపుడు అవుటయ్యాడు. సర్వీసెస్ బౌలర్ మోహిత్ రాఠీ బౌలింగ్‌లో వికాస్ హథ్వాలాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
రాహుల్ త్రిపాఠి విఫలం
మిగతా వాళ్లలో రాహుల్ త్రిపాఠి(13) విఫలం కాగా.. సిద్ధార్థ్ మాత్రే మెరుపు ఇన్నింగ్స్(19 బంతుల్లో 32), ధన్‌రాజ్ షిండే(14 బంతుల్లో 32) ధనాధన్ బ్యాటింగ్‌తో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.
చదవండి: టీ20 క్రికెట్‌లో పెను సంచలనం.. బరోడా జట్టు ప్రపంచ రికార్డు.. హార్దిక్ పాండ్యా లేకుండానే!
Comments
Please login to add a commentAdd a comment