టీ20 క్రికెట్‌లో పెను సంచలనం నమోదైంది. కృనాల్ పాండ్యా కెప్టెన్సీలోని బరోడా జట్టు 349 పరుగులతో ప్రపంచ రికార్డు సాధించింది. భారత దేశీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో భాగంగా ఈ ఫీట్ నమోదు చేసింది. ఇండోర్ వేదికగా సిక్కింపై ఈ మేర పరుగుల విధ్వంసం సృష్టించింది.
ఆది నుంచే దంచికొట్టారు
ఈ నేపథ్యంలో జింబాబ్వే పేరిట ఉన్న ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన బరోడా.. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు స్కోరు చేసిన జట్టుగా నిలిచింది. అంతేకాదు.. హార్దిక్ పాండ్యా బ్యాట్‌తో రంగంలోకి దిగకుండానే.. బరోడా ప్లేయర్లు తమ వీరబాదుడుతో ఈ అరుదైన ఘనతను జట్టు ఖాతాలో వేశారు.
కాగా ఇండోర్‌లోని ఎమరాల్డ్ హై స్కూల్ గ్రౌండ్‌లో గురువారం సిక్కిం జట్టుతో బరోడా తలపడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బరోడాకు ఓపెనర్లు శశ్వత్ రావత్(16 బంతుల్లో 43), అభిమన్యు సింగ్(53) అదిరిపోయే ఆరంభం అందించారు.
ఊచకోత.. 15 సిక్సర్లు
వీళ్లిద్దరు మెరుపు ఇన్నింగ్స్ ఆడితే.. వన్‌డౌన్‌లో వచ్చిన భాను పనియా మాత్రం తుఫాన్ ఇన్నింగ్స్‌తో సిక్కిం బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 51 బంతులు ఎదుర్కొని ఏకంగా 134 పరుగులతో అజేయంగా నిలిచాడు. భాను పనియా ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు ఉంటే.. సిక్సర్లు ఏకంగా 15 ఉండటం విశేషం.
మిగతా వాళ్లలో శైవిక్ శర్మ(17 బంతుల్లో 55), వికెట్ కీపర్ విష్ణు సోలంకి(16 బంతుల్లో 50) బ్యాట్‌తో వీరవిహారం చేశారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయిన బరోడా జట్టు 349 పరుగులు చేసింది. సిక్కిం బౌలర్లలో పల్జోర్ తమాంగ్, రోషన్ కుమార్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. తరుణ్ శర్మ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
జింబాబ్వే రికార్డు బ్రేక్
కాగా టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో భాగంగా జింబాబ్వే ఇటీవల గాంబియాపై 344-4 స్కోరు చేసింది. ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్లో ఇదే అత్యధిక స్కోరు. అయితే, ఈ రికార్డును ఇప్పుడు బరోడా అధిగమించింది.
చదవండి: Ind vs Aus 2nd Test: పింక్ బాల్ టెస్టు.. అడిలైడ్ పిచ్ వారికే అనుకూలం! క్యూరేటర్ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment