syed mushtaq ali trophy
-
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతగా పంజాబ్..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023 విజేతగా పంజాబ్ జట్టు నిలిచింది. సోమవారం మొహాలీ వేదికగా జరిగిన ఫైనల్లో బరోడాను ఓడించిన పంజాబ్.. తొలిసారి టైటిల్‌ను ముద్దాడింది. 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 203 పరుగులు మాత్రమే చేయగల్గింది. బరోడా బ్యాటర్లలో అభిమన్యు సింగ్(61), కెప్టెన్ కృనాల్ పాండ్యా(45) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 4 వికెట్లతో అదరగొట్టగా.. కౌల్, బ్రార్, మార్కండే తలా వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో అన్మోల్ప్రీత్ సింగ్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. 61 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 113 పరుగులు చేశాడు. అతడితో పాటు వాదేరా(61) పరుగులతో ఆఖరిలో అదరగొట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు చేశాడు. బరోడా బౌలర్లలో కృనాల్ పాండ్యా, సోపారియా, సేథ్ చెరో వికెట్ పడగొట్టారు. -
ముంబైకు చుక్కెదురు
ముల్లన్పూర్ (చండీగఢ్): సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు కథ క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బరోడా జట్టు మూడు వికెట్ల తేడాతో ముంబైను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ముందుగా ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 148 పరుగులు చేసింది. శివమ్ దూబే (36 బంతుల్లో 48; 1 ఫోర్, 3 సిక్స్‌లు), సర్భరాజ్ ఖాన్ (22 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం బరోడా జట్టు 18.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి నెగ్గింది. విష్ణు సోలంకి (30 బంతుల్లో 49 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బరోడా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో ఉత్తరప్రదేశ్‌పై, ఢిల్లీ 39 పరుగుల తేడాతో విదర్భ జట్టుపై, కేరళ జట్టుపై అస్సాం ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ చేరుకున్నాయి. -
మరీ అంత అతి పనికిరాదు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి! పరాగ్‌పై ట్రోల్స్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అస్సాం కెప్టెన్ రియాన్ పరాగ్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం బెంగాల్‌తో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో తన హాఫ్ సెంచరీతో మార్క్‌ను అందుకున్నాడు. అస్సాం విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా టోర్నీలో ఇది పరాగ్‌కు 7వ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. ఇప్పటివరకు ఆడిన 8 ఇన్నింగ్స్‌లలో పరాగ్ 490 పరుగులు చేశాడు. తన కెరీర్లోనే భీకర ఫామ్‌లో ఉన్న పరాగ్‌పై ఒకవైపు ప్రశంసల వర్షం కురుస్తుంటే.. మరోవైపు విమర్శల వర్షం కురుస్తోంది. ఏం జరిగిందంటే? బెంగాల్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోగానే పరాగ్ తనదైన స్టైల్లో సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. అయితే అతడి సెలబ్రేషన్స్ శృతి మించాయి. ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లను పరాగ్ అవమానపరిచాడు. హాఫ్ సెంచరీ సాధించిన వెంటనే పరాగ్ డ్రెస్సింగ్ రూమ్ వైపూ చూస్తూ.. "నేనే అందరికంటే తోపు, నన్నే అపేవారు ఇక్కడ లేరంటూ" సైగలు చేశాడు. దీంతో పరాగ్విమర్శకులకు మరోసారి తోవనిచ్చాడు.. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పటికే చాలా సార్లు పరాగ్ ట్రోల్స్‌కు గురైన సంగతి తెలిసిందే. ఓవరాక్షన్ స్టార్ అంటూ అభిమానులు ఓ ట్యాగ్ కూడా ఇచ్చేసారు. చదవండి: World cup 2023: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. మ్యాక్స్‌వెల్‌కు ప్రమాదం! తలకు తీవ్ర గాయం Celebration by Riyan Parag after his 7th consecutive 50 in T20 Cricket.pic.twitter.com/Z6PitN1XYc — Riyan Parag FC (@riyanparagfc_) October 31, 2023 Riyan Parag celebration myan 😭😭😭. He fucking just said, these guy's aren't on my level. I am fucking couple level ahead of them 😭😭😭 Proper Chad pic.twitter.com/Gd8fbECfM7 — HS27 (@Royal_HaRRa) October 31, 2023 -
హ్యాట్రిక్ వికెట్లు తీసిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చెన్నై సూపర్ కింగ్స్ పేసర్, ముంబై ఫాస్ట్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం మిజోరాంతో జరిగిన మ్యాచ్‌లో దేశ్‌పాండే హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. మిజోరాం బ్యాటర్లు వికాష్ కుమార్, జెహూ ఆండర్సన్, జోసెఫ్ లాల్థాన్ఖుమాను ఔట్ చేసిన దేశ్‌పాండే.. హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 3.3 ఓవర్లు బౌలింగ్ చేసిన తుషార్ 13 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన దేశ్‌పాండే 15 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మిజోరాం ముంబై బౌలర్ల ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 76 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో దేశ్‌పాండేతో పాటు రాయ్స్టన్ డయాస్, మోహిత్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం 77 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 6 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టపోయి ఛేదించింది. ముంబై బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్(46 నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. చదవండి: World Cup 2023: మరీ ఇంత బద్దకమా? క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రనౌట్.. వీడియో వైరల్ -
తిలక్ వర్మ కెప్టెన్సీ అదుర్స్.. ముంబైకి ఊహించని షాక్
Syed Mushtaq Ali Trophy 2023- Hyderabad won by 23 runs: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు సంచలనం సృష్టించింది. రహానే సారథ్యంలోని డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టును తిలక్ వర్మ కెప్టెన్సీలోని హైదరాబాద్ జట్టు 23 పరుగుల తేడాతో ఓడించింది. ఈ టోర్నీలో హైదరాబాద్‌కిది ఐదో విజయం. జైపూర్‌లో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (46 బంతుల్లో 59; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), రాహుల్ సింగ్ (26 బంతుల్లో 37; 4 ఫోర్లు), చందన్ సహని (23 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. కెప్టెన్ తిలక్ వర్మ (6), రోహిత్ రాయుడు (8) తక్కువ స్కోరుకే అవుటయ్యారు. అనంతరం 156 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు చేసి ఓడిపోయింది. మీడియం పేసర్ రవితేజ 32 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... తిలక్ వర్మ 2 వికెట్లు తీసి ముంబై జట్టును దెబ్బ కొట్టారు. ప్రస్తుతం ముంబై, హైదరాబాద్, బరోడా జట్లు 20 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. చదవండి: BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా రాజస్తాన్ రాయల్స్ మాజీ కోచ్ -
చెలరేగిన భువనేశ్వర్ కుమార్.. 9 బంతుల్లో 5 వికెట్లు
జాతీయ జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. దేశీవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉత్తర ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భువీ నిప్పలు చేరుగుతున్నాడు. ఈ టోర్నీలో భాగంగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ 5వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 3.3 ఓవర్లు వేసిన భువనేశ్వర్ కేవలం 16 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తొలి రెండు ఓవర్లలో వికెట్లు సాధించికపోయిన భువీ.. డెత్ ఓవర్లలో 9 బంతుల్లో 5 వికెట్లు తీశాడు. 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటక.. భువీ దాటికి 156 పరుగులకు ఆలౌటైంది. భువీతో పాటు యశ్ దయాల్ రెండు వికెట్లు సాధించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. యూపీ బ్యాటర్లలో గోస్వామి(77), నితీష్ రానా(40) పరుగులతో రాణించారు. చదవండి: World Cup 2023: ఓటమి బాధతో బాబర్ ఏడ్చాడు.. తప్పు అతనొక్కడిదే కాదు: పాకిస్తాన్ లెజెండ్ -
రుత్‌రాజ్ విధ్వంసకర శతకం.. కేవలం 51 బంతుల్లోనే
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023లో టీమిండియా ఓపెనర్, మహారాష్ట్ర ఆటగాడు రుత్‌రాజ్ గైక్వాడ్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా బుధవారం విదర్భతో జరిగిన మ్యాచ్‌లో రుత్‌రాజ్ మెరుపు శతకంతో చెలరేగాడు. కేవలం 51 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్ 102 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 11 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. గైక్వాడ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా 178 పరుగుల టార్గెట్‌ను మహారాష్ట్ర.. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 16.1 ఓవర్లలో ఛేదించింది. గైక్వాడ్‌తో పాటు కెప్టెన్ కేదార్ జాదవ్(42) పరుగులతో రాణించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. విదర్భ బ్యాటర్లలో ధ్రువ్ షోరే(62) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మహారాష్ట్ర బౌలర్లలో సత్యజిత్ బాచావ్ 4 వికెట్లు పడగొట్టగా.. సొలాంకి రెండు, దాదే, ఖాజీ, జాదవ్ తలా వికెట్ సాధించారు. చదవండి: WC 2023: నాకు మరీ ఎక్కువ రెస్ట్ ఇచ్చేశారు.. సెలక్టర్లపై సెంచరీ ‘హీరో’ విసుర్లు -
వరల్డ్‌కప్‌కు మిస్సయ్యాడు.. కానీ అక్కడ మాత్రం విధ్వంసం! కేవలం 27 బంతుల్లోనే
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా వన్డే ప్రపంచకప్-2023కు దూరమైన సంగతి తెలిసిందే. తొలుత ప్రకటించిన ప్రిలిమనరీ జట్టులో సభ్యునిగా ఉన్న అక్షర్.. టోర్నీ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కలేదు. వరల్డ్‌కప్‌కు దూరమైన అక్షర్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ప్రస్తుతం జరగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గుజరాత్ జట్టు తరుపున అక్షర్ ఆడుతున్నాడు. ఈ టోర్నీలో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 27 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 పరగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 234 పరుగుల భారీ లక్ష్య చేధనలో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 197 పరుగులు మాత్రమే చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ(112) సెంచరీతో చెలరేగాడు. చదవండి: World Cup 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్! -
తిలక్ వర్మ సెంచరీ వృథా
జైపూర్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జోరుకు బ్రేక్ పడింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి దూసుకెళ్తున్న హైదరాబాద్‌కు తొలి పరాజయం ఎదురైంది. బరోడా జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ (69 బంతుల్లో 121 నాటౌట్; 16 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగి అజేయ సెంచరీతో అలరించాడు. అనంతరం బరోడా జట్టు 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బరోడా జట్టును కెపె్టన్ కృనాల్ పాండ్యా (36 బంతుల్లో 64 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్), విష్ణు సోలంకి (37 బంతుల్లో 71 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీలతో గెలిపించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 70 బంతుల్లో 138 పరుగులు జోడించడం విశేషం. -
తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీ..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టీమిండియా యువ ఆటగాడు, హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. జైపూర్ వేదికగా బరోడాతో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్ వర్మ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. బరోడా బౌలర్లకు తిలక్ చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 69 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్స్‌లతో 121 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. తిలక్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కాగా ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన తిలక్ వర్మ 271 పరుగులతో.. టాప్-2 రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. కాగా ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘ఎ’లో హైదరాబాద్ ప్రస్తుతం 16 పాయింట్లతో ముంబై జట్టుతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. చిన్న చిన్న తప్పులు సహజం! అతడొక మాస్టర్ క్లాస్: రోహిత్ శర్మ -
ఆంధ్రను గెలిపించిన భరత్, అశ్విన్
రాంచీ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు ఖాతాలో వరుసగా రెండో విజయం చేరింది. గుజరాత్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ 19.2 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ఆర్య దేశాయ్ (35 బంతుల్లో 62 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీ చేశాడు. ఆంధ్ర బౌలర్లు స్టీఫెన్ (3/25), కావూరి సాయితేజ (2/45), కేవీ శశికాంత్ (2/22), మనీశ్ (2/47) గుజరాత్ జట్టును దెబ్బ తీశారు. అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు 17.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెపె్టన్ కోన శ్రీకర్‌భరత్ (41 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), అశి్వన్ హెబ్బర్ (36 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి తొలి వికెట్‌కు 10.2 ఓవర్లలో 87 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక విహారి (16 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), రికీ భుయ్ (13 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఆంధ్ర జట్టును విజయతీరానికి చేర్చారు. నేడు జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో మణిపూర్ జట్టుతో ఆంధ్ర ఆడుతుంది. -
హైదరాబాద్‌కు నాలుగో విజయం
జైపూర్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు విజయపరంపర కొనసాగుతోంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా మిజోరం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచి ఈ టోరీ్నలో వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన మిజోరం సరిగ్గా 20 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. అగ్ని చోప్రా (16 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోసెఫ్ లాథన్‌కుమా (20 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. హైదరాబాద్ బౌలర్లు రవితేజ (3/30), సీవీ మిలింద్ (2/18), చింతల రక్షణ్ రెడ్డి (2/20) మిజోరం జట్టును కట్టడి చేశారు. 115 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 15.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ రాయుడు (31 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ తిలక్ వర్మ (24 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడి హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘ఎ’లో హైదరాబాద్ ప్రస్తుతం 16 పాయింట్లతో ముంబై జట్టుతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. నేడు జరిగే తదుపరి మ్యాచ్‌లో బరోడా జట్టుతో హైదరాబాద్ తలపడుతుంది. -
హడలెత్తించిన రవితేజ
జైపూర్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. ఛత్తీస్‌గఢ్‌తో గురువారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో తిలక్ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఛత్తీస్‌గఢ్ జట్టును హైదరాబాద్ మీడియం పేసర్ టి.రవితేజ హడలెత్తించాడు. రవితేజ కేవలం 13 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. సీవీ మిలింద్ (2/16), తనయ్ త్యాగరాజన్ (2/16) కూడా రాణించడంతో ఛత్తీస్‌గఢ్ 19.1 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌటైంది. శశాంక్ సింగ్ (47 బంతుల్లో 51; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం హైదరాబాద్ 16 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 98 పరుగులు చేసి గెలిచింది. తన్మయ్ అగర్వాల్ (15 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ రాయుడు (10 బంతుల్లో 14; 2 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (13 బంతుల్లో 11; 1 ఫోర్), చందన్ సహని (22 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ సింగ్ (33 బంతుల్లో 25 నాటౌట్) రాణించారు. హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్‌లో 21న మిజోరం జట్టుతో ఆడుతుంది. -
షేక్ రషీద్ అజేయ శతకం
రాంచీ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు తొలి విజయం నమోదు చేసింది. అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర 145 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత ఆంధ్ర జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగులు చేసింది. షేక్ రషీద్ (54 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) అరుణాచల్ బౌలర్లపై విరుచుకుపడి అజేయ సెంచరీ చేశాడు. హనుమ విహారి (32 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. రికీ భుయ్ (10 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్‌లు), కరణ్ షిండే (8 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడారు. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అరుణాచల్ ప్రదేశ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసి ఓడిపోయింది. ఆంధ్ర జట్టు బౌలర్లలో స్టీఫెన్ (3/10), కేవీ శశికాంత్ (2/2) రాణించారు. ఆంధ్ర తమ తదుపరి మ్యాచ్‌ను ఈనెల 21న గుజరాత్‌తో ఆడుతుంది. -
ఆంధ్ర ఆటగాడి వీరోచిత పోరాటం.. భారీ లక్ష్య ఛేదనలో శతక్కొట్టుడు
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2023లో భాగంగా పంజాబ్‌తో నిన్న (అక్టోబర్ 17) జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు రికీ భుయ్ వీరోచితంగా పోరాడాడు. భారీ లక్ష్య ఛేదనలో భుయ్ అజేయ శతకంతో (52 బంతుల్లో 104; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) మెరిశాడు. అతనికి మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో ఈ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. అభిషేక్ శర్మ (51 బంతుల్లో 112; 9 ఫోర్లు, 9 సిక్సర్లు), అన్మోల్ప్రీత్ సింగ్ (26 బంతుల్లో 87; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 275 పరుగుల భారీ స్కోర్ చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది. అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఆంధ్రప్రదేశ్.. పంజాబ్ బౌలర్లు హర్‌ప్రీత్ బ్రార్ (4-1-18-3), సిద్దార్థ్ కౌల్ (2/40), అర్షదీప్ సింగ్ (1/37), ప్రేరిత్ దత్తా (1/25) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులకే పరిమితమైంది. ఆంధ్ర ఇన్నింగ్స్‌లో రికీ భుయ్ (104 నాటౌట్) ఒక్కడే ఒంటిపోరాటం చేసి శతక్కొట్టగా.. అశ్విన్ హెబ్బర్ (17), త్రిపురన విజయ్ (23) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
SMAT 2023: అరంగేట్రంలోనే ఐదు వికెట్లతో చెలరేగిన కేకేఆర్ బౌలర్
కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ సుయాశ్ శర్మ.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2023లో ఢిల్లీ తరఫున తన అరంగేట్రం మ్యాచ్‌లోనే చెలరేగిపోయాడు. మధ్యప్రదేశ్‌తో ఇవాళ (అక్టోబర్ 17) జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన సుయాశ్.. కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో సుయాశ్తో పాటు ఇషాంత్ శర్మ (4-0-29-2), హర్షిత్ రాణా (4-0-22-2) కూడా రాణించడంతో ఢిల్లీ టీమ్ మధ్యప్రదేశ్‌ను 115 పరుగులకు (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. ఒక్కరు కూడా పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. సుయాశ్.. మధ్యప్రదేశ్ పతనాన్ని శాసించాడు. గుర్తింపు కలిగిన ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్ (2), రజత్ పాటిదార్ (7) నిరాశపర్చగా.. శుభమ్ శర్మ (10), సాగర్ సోలంకి (13), రాకేశ్ ఠాకూర్ (15), రాహుల్ బాథమ్ (32), అర్షద్ ఖాన్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ విజయం దిశగా సాగుతుంది. ఆ జట్టు 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. ప్రియాంశ్ ఆర్య (22), అనూజ్ రావత్ (23), యశ్ ధుల్ (0) ఔట్ కాగా.. అయుశ్ బదోని (20), హిమ్మత్ సింగ్ (9) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఢిల్లీ బౌలర్ సుయాశ్ శర్మ ఈ ఏడాది ఐపీఎల్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన సుయాశ్ 8.23 సగటున 10 వికెట్లు పడగొట్టాడు. -
హైదరాబాద్‌ను గెలిపించిన తిలక్ వర్మ.. వరుసగా రెండో మ్యాచ్‌లో..!
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2023లో టీమిండియా అప్ కమింగ్ ఆటగాడు తిలక్ వర్మ (హైదరాబాద్ కెప్టెన్) సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో నిన్న జరిగిన మ్యాచ్‌లో (మేఘాలయ) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ (31 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడిన తిలక్.. జమ్ము అండ్ కశ్మీర్‌తో ఇవాళ (అక్టోబర్ 17) జరిగిన మ్యాచ్‌లోనూ అచ్చం అలాంటి ఇన్నింగ్సే ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇవాల్టి మ్యాచ్‌లో 43 బంతులు ఎదుర్కొన్న తిలక్ 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జమ్ము అండ్ కశ్మీర్.. శుభమ్ పుండిర్ (58) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ, మిలింద్, చింట్ల రక్షణ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అనికేత్ రెడ్డి ఓ వికెట్ దక్కించకున్నాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్.. తిలక్ వర్మతో పాటు మిగతా ఆటగాళ్లు కూడా తలో చేయి వేయడంతో 18.3 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. తన్మయ్ అగర్వాల్ (20), రోహిత్ రాయుడు (38), రాహుల్ సింగ్ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేసి రాణించారు. జమ్ము అండ్ కశ్మీర్ బౌలర్లలో యుద్ద్‌వీర్ సింగ్, సాహిల్ లోత్రా తలో వికెట్ పడగొట్టారు. -
రఫ్ఫాడించిన రహానే.. విధ్వంసం సృష్టించిన రుతురాజ్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023 తొలి రోజు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్ల హవా కొనసాగింది. హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో అజింక్య రహానే (ముంబై కెప్టెన్), బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (మహారాష్ట్ర) చెలరేగిపోయారు. హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో రహానే 43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 76 పరుగులు చేయగా.. బెంగాల్‌తో మ్యాచ్‌లో రుతురాజ్ 40 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు సీఎస్కే బ్యాటర్లు మెరుపు అర్ధశతకాలు సాధించి, తమతమ జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషించారు. బెంగాల్-మహారాష్ట్ర మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. రుతురాజ్, కేదార్ జాదవ్ (40 నాటౌట్) రాణించడంతో మహారాష్ట్ర 14.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ముంబై-హర్యానా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. భారత బౌలర్ హర్షల్ పటేల్ ఈ మ్యాచ్‌లో హర్యానా ఓపెనర్‌గా బరిలోకి దిగి 38 పరుగులు చేశాడు. హర్యానా ఇన్నింగ్స్‌లో అంకిత్ (36), నిషాంత్ సంధు (30 నాటౌట్) పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లు తనుశ్ కోటియన్ (3-0-19-3), మోహిత్ అవస్తి (3-0-15-2) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టారు. అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రహానే, శివమ్ దూబే (26 నాటౌట్) రాణించడంతో 15.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ముంబై ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (12) మూడు ఫోర్లు బాది ఇన్నింగ్స్‌ను ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత ఔటయ్యాడు. హర్యానా బౌలర్లలో యుజ్వేంద్ర చహల్, అన్షుల్ తలో వికెట్ పడగొట్టారు. -
నిరాశపరిచిన సంజూ శాంసన్.. కేరళ ఘన విజయం
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023ను కేరళ జట్టు విజయంతో ఆరంభించింది. ముంబై వేదికగా హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో కేరళ విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కేరళ బ్యాటర్లలో విష్ణు వినోద్(44) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సచిన్ బేబీ(30), నైజర్(23) పరుగులతో రాణించారు. నిరాశపరిచిన సంజూ.. ఫామ్ లేమితో భారత సీనియర్ జట్టులో చోటు కోల్పోయిన వికెట్ కీపర్ బ్యాటర్, కేరళ కెప్టెన్ సంజూ శాంసన్.. హిమాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్ కేవలం ఒక్కపరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. హిమాచల్ బౌలర్ ముకల్ నేగీ బౌలింగ్‌లో సంజూ ఔటయ్యాడు. చెలరేగిన వినోద్ కుమార్, శ్రేయస్ గోపాల్.. ఇక 164 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన హిమాచల్ ప్రదేశ్ 128 పరుగులకు ఆలౌటైంది. కేరళ బౌలర్లలో వినోద్ కుమార్, శ్రేయస్ గోపాల్ తలా 4 వికెట్లతో హిమాచల్ పతనాన్ని శాసించారు. హిమాచల్ ప్రదేశ్ బ్యాటర్లలో నికిల్ గంగటా(42) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: SMT 2023: 3 వికెట్లు పడగొట్టిన అర్జున్ టెండూల్కర్.. పోరాడి ఓడిన ఆంధ్ర -
తిలక్ వర్మకు బంపరాఫర్.. ఏకంగా జట్టు కెప్టెన్‌గా ప్రమోషన్
దేశవాళీ జాతీయ టీ20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును ప్రకటించారు. భారత యువ క్రికెటర్ తిలక్ వర్మకు తొలిసారి హైదరాబాద్ జట్టు పగ్గాలు అప్పగించారు. తిలక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే జరిగిన ఆసియా క్రీడల్లో తిలక్ దుమ్మురేపాడు. అంతకుముందు తను అరంగేట్రం చేసిన వెస్టిండీస్ సిరీస్‌లో తిలక్ అకట్టుకున్నాడు. ఈ క్రమంలో జట్టు కెప్టెన్సీ బాధ్యతలను తిలక్‌కు హెచ్‌సీఏ అప్పగించింది. ఈ టోర్నీ అక్టోబర్ 16 నుంచి దేశంలోని వివిధ నగరాల్లో జరుగుతుంది. ఈ టోర్నీలో అజింక్యా రహానే, రింకూ సింగ్, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్లు భాగం కానున్నారు. హైదరాబాద్ టీ20 జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), సీవీ మిలింద్ (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, రాహుల్ సింగ్, రాహుల్ బుద్ది, రాహుల్ రాధేశ్, రోహిత్ రాయుడు, చందన్ సహని, భవేశ్ సేథ్, రవితేజ, రక్షణ్ రెడ్డి, సంకేత్, తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి, షౌనక్ కులకర్ణి, అమన్ రావు. చదవండి: WC 2023: చెలరేగిన సౌతాఫ్రికా బౌలర్లు.. ఆసీస్‌కు ఘోర పరాభవం! వరుసగా రెండో ఓటమి -
WC 2023: చోటు ఆశించి భంగపడ్డ సంజూ.. టీ20 జట్టు కెప్టెన్‌గా..
Sanju Samson: వన్డే ప్రపంచకప్-2023 జట్టులో చోటు ఆశించి భంగపడిన టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలో కేరళ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నమెంట్లో సంజూకు రోహన్ కన్నుమ్మాళ్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. కాగా అక్టోబరు 16 నుంచి నవంబరు 6 వరకు ఈ ఈవెంట్ జరుగనుంది. ఇందులో భాగంగా గ్రూప్-బిలో ఉన్న కేరళ ముంబైలో హిమాచల్ ప్రదేశ్ జట్టుతో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఆసియా కప్-2023లో బ్యాకప్ ప్లేయర్‌గా ఇక ఈ గ్రూపులో కేరళ, హిమాచల్ ప్రదేశ్‌తో పాటు సిక్కిం, అసోం, బిహార్, చండీగఢ్, ఒడిశా, సర్వీసెస్ టీమ్‌లు పోటీపడనున్నాయి. కాగా ఆసియా వన్డే కప్-2023లో సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు బ్యాకప్‌గా ఎంపికైన సంజూ శాంసన్.. రాహుల్ పూర్తి ఫిట్నెస్ సాధించడంతో ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్ జట్టు ఎంపిక సమయంలోనూ బీసీసీఐ సెలక్టర్లు సంజూను పక్కనపెట్టేశారు. 50 ఓవర్ల ఫార్మాట్లో మెరుగైన రికార్డు ఉన్న ఈ కేరళ వికెట్ కీపర్‌ను కాదని.. ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేశారు. సూర్యకు పెద్దపీట.. మేనేజ్మెంట్ అండదండలు వన్డేల్లో వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకున్న ఈ నంబర్ 1 టీ20 బ్యాటర్ కోసం సంజూను బలిచేశారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో సిరీస్‌లో వరుస అర్ధ శతకాలతో రాణించిన సూర్యకు మేనేజ్మెంట్ అండగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆఖరి నిమిషం(సెప్టెంబరు 28వరకు జట్టులో మార్పులకు అవకాశం ఉన్న నేపథ్యంలో)లోనైనా అద్భుతం జరుగుతుందని ఆశించిన సంజూ శాంసన్ అభిమానులకు నిరాశే మిగిలింది. ఈ క్రమంలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీతో సంజూ తిరిగి మైదానంలో దిగనున్నాడు. దేశవాళీ టీ20 జట్టు కెప్టెన్‌గా మరోసారి ఇక ఈ టీ20 ఈవెంట్ కోసం కేరళ పద్దెనిమిది మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. గత నెలలో కర్ణాటక టీమ్ నుంచి వైదొలిగిన ఆల్‌రౌండర్ శ్రేయస్ గోపాల్ ఈసారి కేరళకు ఆడనున్నాడు. స్పిన్ దళానికి అతడు నాయకత్వం వహించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో కేరళ జట్టుకు ఈ సీజన్లో తమిళనాడు మాజీ క్రికెటర్ ఎం.వెంకటరమణ హెడ్‌కోచ్‌గా వ్యవహరించనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీకి కేరళ జట్టు: సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రోహన్ కన్నుమ్మాళ్ (వైస్ కెప్టెన్), శ్రేయస్ గోపాల్, జలజ్ సక్సేనా, సచిన్ బేబీ, మహ్మద్ అజారుద్దీన్, విష్ణు వినోద్, అబ్దుల్ బాసిత్, సిజోమోన్ జోసెఫ్, వైశాఖ్ చంద్రన్, బాసిల్ థంపి, కేఎం ఆసిఫ్, వినోద్ కుమార్, మను కృష్ణన్, వరుణ్ నయనార్, ఎం. అజ్నాస్, పీకే మిథున్, సల్మాన్ నిసార్. చదవండి: WC 2023- Ind vs Pak: అతడి బ్యాటింగ్ అంతగొప్పగా ఏమీ ఉండదు.. షమీని ఆడించండి! 👉 సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
కెప్టెన్‌గా వాషింగ్టన్ సుందర్.. జట్టులో ఐపీఎల్ స్టార్లు!
Syed Mushtaq Ali Trophy 2023-24: టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ దేశవాళీ టీ20 క్రికెట్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023-24 సీజన్‌కు గానూ తమిళనాడు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇందుకు సంబంధించి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రకటన చేసింది. వాషీకి సాయి సుదర్శన్ డిప్యూటీగా వ్యవహరిస్తాడని పేర్కొంది. ఈ మేరకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగమయ్యే 15 మంది ఆటగాళ్ల పేర్లను బుధవారం వెల్లడించింది. కాగా అక్టోబరు 16 నుంచి ఈ దేశవాళీ టీ20 టోర్నమెంట్ ఆరంభం కానుంది. ఈ పొట్టి ఫార్మాట్లో ఈవెంట్ చరిత్రలో తమిళనాడుకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటి వరకు మూడుసార్లు ట్రోఫీ గెలిచిన ఘనత తమిళనాడు సొంతం. తాజా సీజన్లో వాషింగ్టన్ సుందర్ సారథ్యంలో సాయి సుదర్శన్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ సేన్, నారాయణ్ జగదీశన్, విజయ్ శంకర్, షారుఖ్ ఖాన్, టి.నటరాజన్ తదితర ఐపీఎల్ స్టార్లు ఆడనున్నారు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో సుందర్‌కు స్థానం దక్కలేదన్న విషయం తెలిసిందే. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా అతడి స్థానంలో చెన్నై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పోటీ పడ్డ వాషీకి మొండిచేయి ఎదురైంది. అనుభవానికి పెద్దపీట వేసిన బీసీసీఐ సెలక్టర్లు అశూ వైపే మొగ్గుచూపారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023 తమిళనాడు జట్టు: వాషింగ్టన్ సుందర్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), నారాయణ్ జగదీశన్, విజయ్ శంకర్, సి హరి నిశాంత్, జి.అజితేష్, బాబా అపరాజిత్, ఆర్. సంజయ్ యాదవ్, ఎం. మహ్మద్, ఆర్.సాయి కిషోర్, వరుణ్ చక్రవర్తి, టి. నటరాజన్, కుల్దీప్ సేన్, సందీప్ వారియర్. -
క్రికెట్లో కొత్త రూల్.. ఇకపై ఓవర్‌కు..!
దేశవాళీ క్రికెట్లో బీసీసీఐ కొత్త రూల్‌ను అమల్లోకి తేనుంది. త్వరలో ప్రారంభంకానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఓవర్‌కు రెండు బౌన్సర్లకు అనుమతిచ్చింది. ఇప్పటివరకు టీ20ల్లో ఓవర్‌కు ఒకే బౌన్సర్ నిబంధన అమల్లో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌కు మధ్య పోటీని బ్యాలెన్స్ చేసేందుకు ఈ రూల్‌ను అమల్లోకి తేవాలని నిర్ణయించినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. ఈ రూల్‌తో పాటు మరో నిబంధనను కూడా ముస్తాక్ అలీ టోర్నీలో అమల్లోకి తెస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన సక్సెస్ కావడంతో ఆ రూల్‌ను కూడా ముస్తాక్ అలీ టోర్నీలో అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాగా, ముస్తాక్ అలీ టోర్నీలో రెండు బౌన్సర్లు, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్స్ సక్సెస్ అయితే మిగిలిన దేశవాళీ టోర్నీల్లోనూ ఈ రెండు రూల్స్‌ను అమల్లోకి తెస్తారని సమాచారం. టీ20 ఫార్మాట్లో రెండు బౌన్సర్ల నిబంధన అమల్లోకి తెస్తే బౌలర్ల ప్రభావం పెరిగే అవకాశం ఉందని బీసీసీఐ అధికారులు వివరించారు. ఇదిలా ఉంటే, 2023-24 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 6 వరకు జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 38 టీమ్‌లు తలపడనున్నాయి. -
శ్రేయస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్! ఫైనల్లో ముంబై
సయ్యద్ ముస్తాక్ అలీ-2022 ఫైనల్లో ముంబై జట్టు తొలి సారి అడుగుపెట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా విదర్భతో జరిగిన సెమీఫైనల్లో 5 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఐదు వికెట్లు కోల్పోయి కేవలం 16.5 ఓవర్లలోనే ఛేదించింది. కాగా ఈ విజయంలో ఆ జట్టు స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 44 బంతులు ఎదుర్కొన్న అయ్యర్.. 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు సాధించాడు. అతడితో పాటు ఓపెనర్ పృథ్వీ షా (21 బంతుల్లో 34) కూడా రాణించాడు. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే, అక్షయ్ కర్నేవార్ తలా రెండు వికెట్లు సాధించగా.. లలిత్ యాదవ్ ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు చేసింది. విదర్భ బ్యాటర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో షామ్స్ ములానీ మూడు వికెట్లు, దేశ్‌పాండే, దుబే తలా రెండు వికెట్లు సాధించారు. మరో వైపు హిమాచల్ ప్రదేశ్ ఈ టోర్నీ ఫైనల్‌కు చేరుకుంది. ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో హిమాచల్ ప్రదేశ్ 13 పరుగులతో పంజాబ్‌పై విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య ఫైనల్ శనివారం జరుగుతుంది. చదవండి: కోహ్లి "ఫేక్ ఫీల్డింగ్" ఆరోపణలు .. వివరణ ఇచ్చిన భారత మాజీ క్రికెటర్ -
టీ20 టోర్నీ ఫైనల్లో తొలిసారిగా.. మరో ట్రోఫీకి అడుగు దూరంలో ధావన్ సేన
Syed Mushtaq Ali Trophy 2022- Punjab vs Himachal Pradesh, Semi Final 1: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2022 సెమీ ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. సమిష్టి కృషితో తొలిసారిగా దేశవాళీ టీ20 టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టింది. కోల్‌కతాలో పంజాబ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో గెలుపొందడం ద్వారా టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. సెమీ ఫైనల్-1 ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ వేదికగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2022 తొలి సెమీ ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్- పంజాబ్ తలపడ్డాయి. టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన రిషి ధావన్ సేనకు ఆదిలోనే షాకిచ్చారు పంజాబ్ బౌలర్లు. ఆదుకున్న సుమీత్ వర్మ, ఆకాశ్ ఓపెనర్లు ప్రశాంత్ చోప్రా, అంకుశ్ బైన్స్ వరుసగా 17, 16 పరుగులు చేయగా.. వన్‌డౌన్‌లో వచ్చిన అభిమన్యు రాణా(2 రన్స్) పూర్తిగా నిరాశపరిచాడు. జట్టు ఇలా కష్టాల్లో కూరుకుపోయిన వేళ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సుమీత్ వర్మ పట్టుదలగా నిలబడ్డాడు. 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 51 పరుగులు సాధించాడు. మరో ఎండ్‌లో ఆకాశ్ వశిష్ట్ 43 పరుగులతో సహకారం అందించాడు. వీరిద్దరు కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించగా.. పంకజ్ జైస్వాల్ సైతం 27 పరుగులతో రాణించాడు. శుభారంభం లభించకపోయినా మిడిలార్డర్ రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో హిమాచల్ ప్రదేశ్ 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగలిగింది. రిషి మూడు వికెట్లు పడగొట్టి ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లలో శుబ్‌మన్ గిల్ 45 పరుగులతో ఆకట్టుకోగా.. అభిషేక్ శర్మ మాత్రం ఒక్క పరుగుకే పెవిలియన్‌కు చేరాడు. మిగిలిన వాళ్లలో అన్మోల్ప్రీత్ సింగ్ 30, కెప్టెన్ మన్దీప్ సింగ్ 29(నాటౌట్), రమణ్‌దీప్ సింగ్ 29 పరుగులు చేశారు. అయితే, అప్పటికే మ్యాచ్ పంజాబ్ చేజారిపోయింది. డెత్ ఓవర్లలో హిమాచల్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మరో టైటిల్ దిశగా హిమాచల్ బౌలర్లలో కెప్టెన్ రిషి ధావన్‌కు మూడు, కున్వార్ అభినయ్ సింగ్‌కు ఒకటి, మయాంక్ దాగర్‌కు రెండు, ఆకాశ్ వశిష్ట్‌కు ఒక వికెట్ దక్కాయి. ఇక ఈ విజయంతో హిమాచల్ ప్రదేశ్ తొలిసారిగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్‌కు అర్హత సాధించింది. మరో సెమీ ఫైనల్లో విజేత(విదర్భ వర్సెస్ ముంబై)తో తుదిపోరులో అమీతుమీ తేల్చుకోనుంది. పరిమిత ఓవర్లలో మరో దేశవాళీ టైటిల్‌ను గెలిచి చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా గతేడాది.. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీని హిమాచల్ ప్రదేశ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పటిష్ట జట్టు అయిన తమిళనాడును ఓడించి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. చదవండి: T20 WC Ind Vs Ban: అప్పుడు కూడా నరాలు తెగే ఉత్కంఠ! బంగ్లా ఒక్క పరుగుతో.. టాయ్‌లెట్‌కి వెళ్లి Ind Vs Ban: కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ ఆరోపణలు.. లేదంటే విజయం తమదేనన్న బంగ్లా క్రికెటర్ 4⃣ Overs 2⃣5⃣ Runs 3⃣ Wickets Talk about leading from the front! 👏 👏 #SyedMushtaqAliT20 | @mastercardindia Relive Himachal Pradesh skipper @rishid100's match-winning bowling display against Punjab in #SF1 of the #PUNvHP contest🎥 🔽https://t.co/cW86hcSBTa — BCCI Domestic (@BCCIdomestic) November 3, 2022