నేటి నుంచి ముస్తాక్ అలీ టి20 టోర్నీ
న్యూఢిల్లీ: దేశవాళీ ధనాధన్ మెరుపుల ‘షో’కు రంగం సిద్ధమైంది. సాధారణంగా ఐపీఎల్ మెగా వేలానికి ముందే ఈ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నీని నిర్వహిస్తారు. దీంతో ప్లేయర్లకు ఫ్రాంచైజీలను ఆకర్షించే అవకాశం లభించేది. కానీ ఈసారి వేలానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఈ టి20 టోర్నీ శనివారం నుంచి దేశంలోని వివిధ నగరాల్లో (హైదరాబాద్, విశాఖపట్నం, విజయనగరం, రాజ్‌కోట్, ఇండోర్, ముంబై) జరగనుంది.
ఠాకూర్ తిలక్ వర్మ సారథ్యంలో హైదరాబాద్ జట్టు ఈ టోర్నీలో పోటీపడనుంది. రాజ్‌కోట్‌లో నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో మేఘాలయ జట్టుతో హైదరాబాద్ తలపడుతుంది. ఉప్పల్ స్టేడియంలో ఈనెల 25న జరిగే గ్రూప్ ‘ఇ’ తొలి లీగ్ మ్యాచ్‌లో నాగాలాండ్ జట్టుతో ఆంధ్ర పోటీపడుతుంది.
డిసెంబర్ 15వ తేదీన జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది. ఈ టోర్నీలో పాల్గొంటున్న మొత్తం 38 జట్లను ఐదు గ్రూప్‌లుగా విభజించారు. డిఫెండింగ్ చాంపియన్‌గా పంజాబ్ జట్టు ఉంది.
బరిలో స్టార్ క్రికెటర్లు...
భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా (బరోడా), మొహమ్మద్ షమీ (బెంగాల్), శ్రేయస్ అయ్యర్ (ముంబై), యుజువేంద్ర చహల్ (హరియాణా) తదితరులతో పాటు దేశవాళీ స్టార్లు అభిషేక్ పొరెల్ (బెంగాల్), షారుక్ ఖాన్ (తమిళనాడు), అభినవ్ మనోహర్ (కర్ణాటక), మానవ్ సుతార్ (రాజస్తాన్), కరుణ్ నాయర్ (విదర్భ), కృనాల్ పాండ్యా (బరోడా), దీపక్ హుడా (రాజస్తాన్) ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరిపించడానికి ‘సై’ అంటున్నారు.
ఇందులో ఒక్క హార్దిక్ పాండ్యానే రిటెయిన్ ప్లేయర్ కాగా మిగతా వారంతా ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకోవాలని... తమపై కోట్ల రూపాయాలు కురవాలని గంపెడాశలతో ఉన్నారు. వేలాన్ని పక్కన బెడితే ముస్తాక్ అలీ టోర్నీలో ఏటికేడు పోటీ పెరుగుతోంది. ఆటగాళ్లు తమ సత్తా చాటుకుంటున్నారు. గాయం నుంచి కోలుకున్నాక రంజీ బరిలో దిగిన వెటరన్ సీమర్ షమీ మధ్యప్రదేశ్‌పై నిప్పులు చెరిగాడు.
7 వికెట్లతో అదరగొట్టిన 34 ఏళ్ల సీమర్ తనలో ఇంకా పేస్ పదును ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఆసీస్‌లో జరుగుతున్న బోర్డర్–గావస్కర్ ట్రోఫీకి ఎంపిక కాలేకపోయినా... ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌లో పేస్ షమీ ఆడే అవకాశాల్ని తోసిపుచ్చలేం. ఈ టి20 టోర్నీలోనూ ఫిట్‌నెస్ నిరూపించుకుంటే ఆసీస్ ఫ్లయిట్ ఎక్కడం దాదాపు ఖాయమవుతుంది.
ఏ గ్రూప్‌లో ఎవరంటే...
గ్రూప్ ‘ఎ’: హైదరాబాద్, మధ్యప్రదేశ్, బెంగాల్, మేఘాలయ, పంజాబ్, మిజోరం, బిహార్, రాజస్తాన్.
గ్రూప్ ‘బి’: బరోడా, సిక్కిం, గుజరాత్, సౌరాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, తమిళనాడు, త్రిపుర.
గ్రూప్ ‘సి: హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, హరియాణా, జమ్మూ కశ్మీర్, మణిపూర్, ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్.
గ్రూప్ ‘డి’: ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, అస్సాం, విదర్భ, రైల్వేస్, ఒడిశా, చండీగఢ్.
గ్రూప్ ‘ఇ’: ఆంధ్ర, నాగాలాండ్, కేరళ, ముంబై, గోవా, సర్వీసెస్, మహారాష్ట్ర.
Comments
Please login to add a commentAdd a comment