ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్ కోసం అమీతుమీ
సెమీఫైనల్స్‌లో బరోడాపై ముంబై; ఢిల్లీపై మధ్యప్రదేశ్ విజయం
రాణించిన రహానే, రజత్ పాటిదార్
దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై, మధ్యప్రదేశ్ జట్లు తుదిపోరుకు దూసుకెళ్లాయి. సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే దంచి కొట్టడంతో బరోడాపై ముంబై జట్టు ఘనవిజయం సాధిస్తే.... కెప్టెన్ రజత్ పాటిదార్ మెరుపులతో ఢిల్లీపై మధ్యప్రదేశ్ పైచేయి సాధించింది. బెంగళూరులో ఆదివారం జరగనున్న ఫైనల్లో మధ్యప్రదేశ్‌తో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది.
బెంగళూరు: సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే (56 బంతుల్లో 98; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో ముంబై జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో అడుగు పెట్టింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్లో ముంబై 6 వికెట్ల తేడాతో బరోడాను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
శివాలిక్ శర్మ (24 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... కెపె్టన్ కృనాల్ పాండ్యా (30; 4 ఫోర్లు), శాశ్వత్ రావత్ (33; 4 ఫోర్లు) రాణించారు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (5) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ముంబై బౌలర్లలో సుర్యాంశ్ షెగ్డే 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 17.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.
ఓపెనర్‌గా బరిలోకి దిగిన రహానే త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. ఈ టోర్నీలో ఫుల్ ఫామ్ కనబర్చిన రహానే... బరోడా బౌలర్లను కుదురుకోనివ్వకుండా మైదానం నలువైపులా షాట్లతో అలరించాడు.
ఓపెనర్ పృథ్వీ షా (8), సూర్యకుమార్ యాదవ్ (1) విఫలమైనా... లక్ష్యం పెద్దది కాకపోవడంతో ముంబై జట్టుకు పెద్దగా ఇబ్బందులు ఎదురవలేదు. బరోడా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, అతిత్ సేత్, అభిమన్యు సింగ్, శాశ్వత్ రావత్ తలా ఒక వికెట్ తీశారు. రహానేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
13 ఏళ్ల తర్వాత...
ఢిల్లీతో జరిగిన రెండో సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. 7 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్ ఢిల్లీని చిత్తుచేసిన మధ్యప్రదేశ్ జట్టు 13 ఏళ్ల తర్వాత ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్‌కు చేరింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. వికెట్ కీపర్ అనూజ్ రావత్ (33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), ప్రియాన్‡్ష ఆర్య (29; 3 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ రావత్ (24; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు.
మధ్యప్రదేశ్ బౌలర్లు ఆరంభం నుంచే కట్టుదిట్టమైన బంతులతో ఆకట్టుకోవడంతో... ఢిల్లీ జట్టు పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ 2 వికెట్లు పడగొట్టగా... త్రిపురేశ్ సింగ్, అవేశ్ ఖాన్, కుమార్ కార్తికేయ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో మధ్యప్రదేశ్ జట్టు 15.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 152 పరుగులు చేసింది.
కెప్టెన్ రజత్ పాటిదార్ (29 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... హర్‌ప్రీత్ సింగ్ (38 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్‡్ష (18 బంతుల్లో 30, 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ముఖ్యంగా రజత్ పాటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఢిల్లీ బౌలింగ్‌ను ఏమాత్రం లెక్కచేయని రజత్ భారీ షాట్లతో విజృంభించాడు.
హర్‌ప్రీత్‌తో కలిసి రజత్ అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 57 బంతుల్లోనే 106 పరుగులు జోడించడంతో... మధ్యప్రదేశ్ జట్టు మరో 26 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ 2 వికెట్లు, హిమాన్షు చౌహాన్ ఒక వికెట్ తీశారు. రజత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment