న్యూజిలాండ్ టీ20 టోర్నీ సూపర్ స్మాష్ (Super Smash) విజేతగా సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ (Central Districts) (సెంట్రల్ స్టాగ్స్) అవతరించింది. ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన ఫైనల్లో ఆ జట్టు కాంటర్‌బరీ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ సూపర్ స్మాష్ టైటిల్ గెలవడం 2019 తర్వాత ఇదే మొదటిసారి. ఇనాగురల్ ఎడిషన్‌లో (2006) టైటిల్ గెలిచిన కాంటర్‌బరీ కింగ్స్ వరుసగా ఐదోసారి, మొత్తంగా ఏడో సారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన కాంటర్‌బరీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 46 పరుగులు చేసిన డారిల్ మిచెల్ (Daryl Mitchell) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెక్‌కోంచీ (27), చాడ్ బోవ్స్ (16), షిప్లే (10), మ్యాట్ హెన్రీ (12) రెండంకెల స్కోర్లు చేయగా.. మిచెల్ హే (5), మాథ్యూ బాయిల్ (2), జకరీ ఫౌల్క్స్ (7) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ బౌలర్లలో టాబీ ఫిండ్లే 3 వికెట్లు పడగొట్టగా.. రాండెల్ 2, అంగస్ షా, టిక్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సెంట్రల్ డిస్ట్రిక్ట్స్.. డేన్ క్లీవర్ (43), విల్ యంగ్ (35) రాణించడంతో మరో 16 బంతులు మిగిలుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ ఇన్నింగ్స్‌లో జాక్ బాయిల్ 5, కెప్టెన్ టామ్ బ్రూస్ 14 పరుగులు చేసి ఔట్ కాగా.. విలియమ్ క్లార్క్ (17), కర్టిస్ హీపీ (9) సెంట్రల్ డిస్ట్రిక్ట్స్‌ను విజయతీరాలకు చేర్చారు. కాంటర్‌బరీ కింగ్స్ బౌలర్లలో కైల్ జేమీసన్ 2, విలియమ్ ఓరూర్కీ, హెన్రీ షిప్లే తలో వికెట్ పడగొట్టారు.
కాగా, న్యూజిలాండ్‌లో జరిగే సూపర్ స్మాష్ టీ20 టోర్నీ 2005-06లో తొలిసారి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ టోర్నీ పలు పేర్లతో చలామణి అవుతూ వస్తుంది. తొలుత న్యూజిలాండ్ టీ20 కాంపిటీషన్ అని, ఆతర్వాత స్టేట్ టీ20 అని, 2009-2012 వరకు హెచ్‌ఆర్వీ కప్ అని, 2013-14 ఎడిషన్‌లో హెచ్‌ఆర్వీ టీ20 అని, 2018-19 సీజన్ నుంచి సూపర్ స్మాష్ అని నిర్వహించబడుతుంది.
ఈ టోర్నీ పురుషులతో పాటు మహిళల విభాగంలోనూ జరుగుతుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ప్రస్తుత సీజన్‌లో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్‌కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా నిలిచింది. ఈ టోర్నీలో న్యూజిలాండ్ జాతీయ జట్టుకు ఆడే చాలామంది ఆటగాళ్లు పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment