నేడు సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ ఫైనల్
సాయంత్రం గం.4:30 నుంచి జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
బెంగళూరు: దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో ముంబై జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న తుది పోరులో మధ్యప్రదేశ్‌తో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్ దశలో తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన ముంబై జట్టు టైటిల్ సాధించాలని పట్టుదలతో ఉంటే... 13 ఏళ్ల తర్వాత తుదిపోరుకు అర్హత సాధించిన మధ్యప్రదేశ్ జట్టు ఇదే జోష్‌లో ట్రోఫీ కైవసం చేసుకోవాలని చూస్తోంది.
ముంబై జట్టు స్టార్ ఆటగాళ్లతో కళకళలాడుతుండగా... మధ్యప్రదేశ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ముంబై జట్టులో అజింక్య రహానే, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్ వంటి టీమిండియా ప్లేయర్లు ఉన్నారు. మరోవైపు మధ్యప్రదేశ్ జట్టుకు రజత్ పటిదార్ సారథ్యం వహిస్తుండగా... ఇటీవల ఐపీఎల్ వేలంలో రికార్డు ధర (రూ. 23.75 కోట్లు) దక్కించుకున్న పేస్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కీలకం కానున్నాడు.
భారత టి20 జట్టు కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే తన మెరుపులతో అదరగొడుతున్నాడు. సంప్రదాయ ఆటతీరుకు చిరునామా అయిన రహానే... భారీ హిట్టింగ్‌తో విరుచుకుపడుతూ ముంబై జట్టుకు ఒంటి చేత్తో విజయాలు అందించాడు. తాజా టోర్నీలో 8 మ్యాచ్‌లాడిన రహానే 170కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో 432 పరుగులు సాధించాడంటే అతడి జోరు ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.
ఇక మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్న శ్రేయస్ అయ్యర్ 189 స్ట్రయిక్ రేట్‌తో 329 పరుగులు సాధించాడు. పృథ్వీ షా అడపాదడపా మెరుగైన ప్రదర్శన చేస్తుండగా... సూర్యకుమార్ రాణించాల్సిన అవసరముంది. మిడిలార్డర్‌లో శివమ్ దూబేతో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ సూర్యాన్‡్ష షెగ్డే భారీ షాట్లు ఆడగల సమర్థులే. బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, తనుష్ కోటియాన్, సూర్యాన్‡్ష, అథర్వ కీలకం కానున్నారు.
మరోవైపు సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఫైనల్ చేరిన మధ్యప్రదేశ్ జట్టు... తుది పోరులోనూ అదే కొనసాగించాలని భావిస్తోంది. ‘మా జట్టు సామర్థ్యంపై నమ్మకముంది. ఎవరితో తలపడుతున్నామనే విషయాన్ని పెద్దగా ఆలోచించడం లేదు. దీన్ని కూడా మరో మ్యాచ్‌లాగే చూస్తున్నాం. మెరుగైన ప్రదర్శనతో ట్రోఫీ చేజిక్కించుకోవడమే మా లక్ష్యం’ అని మధ్యప్రదేశ్ కెపె్టన్ రజత్ పటిదార్ అన్నాడు.
ఈ టోర్నీలో పటిదార్ 183 స్ట్రయిక్ రేట్‌తో 347 పరుగులు చేసి మంచి టచ్‌లో ఉన్నాడు. మిడిలార్డర్‌లో వెంకటేశ్ అయ్యర్ హిట్టింగ్ జట్టుకు బలం కానుంది. ఈ టోర్నీలో అతడు 162 స్ట్రయిక్ రేట్‌తో 210 పరుగులు సాధించడంతో పాటు... ఉపయుక్తకరమైన మీడియం పేస్‌తో 6 వికెట్లు పడగొట్టాడు. అవేశ్ ఖాన్, త్రిపురేశ్ సింగ్, కుమార్ కార్తికేయ మధ్యప్రదేశ్ బౌలింగ్ భారం మోయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment