శివ 4-3-6-4
చెలరేగిన ఆంధ్ర బౌలర్
హైదరాబాద్ పరాజయం
సాక్షి, విజయనగరం: సరిగ్గా నెల రోజుల క్రితం సుబ్బయ్య పిళ్లై వన్డే టోర్నీలో హైదరాబాద్‌ను చిత్తు చేసిన ఆంధ్ర జట్టు పరిమిత ఓవర్లలో మరోసారి తన ఆధిక్యం ప్రదర్శించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (సౌత్‌జోన్)లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన టి20 మ్యాచ్‌లో ఆంధ్ర 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. టోర్నీలో తొలి మూడు మ్యాచ్‌లు ఓడిన ఆంధ్రకు ఇది తొలి గెలుపు కాగా... హైదరాబాద్‌కు వరుసగా రెండో ఓటమి. దువ్వారపు శివకుమార్ (4-3-6-4) అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు శివకుమార్, బోడవరపు సుధాకర్ (3/9) ధాటికి 20 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. సందీప్ రాజన్ (35 బంతుల్లో 21; 3 ఫోర్లు)దే టాప్ స్కోర్ కాగా, ముగ్గురు బ్యాట్స్‌మెన్ డకౌటయ్యారు. శివకుమార్ 3 మెయిడిన్ ఓవర్లు వేయడం విశేషం. అనంతరం ఆంధ్ర 11.3 ఓవర్లలో 2 వికెట్లకు 77 పరుగులు చేసి విజయాన్నందుకుంది. శ్రీకాంత్ (0) తొలి ఓవర్లోనే అవుటైనా... కెప్టెన్ ప్రశాంత్ కుమార్ (34 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), జ్యోతి సాయికృష్ణ (24 బంతుల్లో 33; 6 ఫోర్లు) రెండో వికెట్‌కు 47 బంతుల్లో 56 పరుగులు జోడించి మరో 51 బంతులు మిగిలి ఉండగానే ఆంధ్రను గెలిపించారు. ఈ పరాజయంతో హైదరాబాద్ నాకౌట్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. శనివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లలో గోవాతో హైదరాబాద్, కేరళతో ఆంధ్ర తలపడతాయి.