సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ జాతీయ టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టుకు మరో పరాజయం ఎదురైంది.
వడోదర: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ జాతీయ టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టుకు మరో పరాజయం ఎదురైంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 111 పరుగుల తేడాతో ఢిల్లీ చేతిలో చిత్తుగా ఓడింది. ఆంధ్ర టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 236 పరుగులు చేసింది. నితిష్ రాణా (40 బంతుల్లో 97; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మిలింద్ కుమార్ (58) అర్ధసెంచరీ చేశాడు. ఆంధ్ర బౌలర్ స్టీఫెన్ ఐదు వికెట్లు తీసుకున్నాడు.
ఆంధ్ర జట్టు 19.2 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. శ్రీకాంత్ (37) టాప్ స్కోరర్. ఢిల్లీ బౌలర్లలో నేగి, సుబోధ్, శివమ్ శర్మ రెండేసి వికెట్లు తీసుకున్నారు. కటక్‌లో ఆసక్తికరంగా జరిగిన మరో మ్యాచ్‌లో కర్ణాటక జట్టు ఒక్క పరుగు తేడాతో ముంబైపై గెలిచింది. తొలుత కర్ణాటక 20 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటయింది. బిన్నీ (38), తాహా (37), ఉతప్ప (30) రాణించారు. ధావల్ కులకర్ణి, రోహన్ రాజే మూడేసి వికెట్లు తీశారు. తర్వాత ముంబై జట్టు 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. అభిషేక్ నాయర్ (49). శ్రేయస్ అయ్యర్ (32) ఆకట్టుకున్నారు.
ముంబై విజయానికి చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరం కాగా... వినయ్ కుమార్ బౌలింగ్‌లో నాయర్ అవుట్ కాగా, చివరి బంతికి తాంబే రనౌట్ అయ్యాడు. అరవింద్, బిన్నీ, కరియప్ప రెండేసి వికెట్లు తీశారు.
భజ్జీ సూపర్ బౌలింగ్
కొచ్చిలో జరిగిన మ్యాచ్‌లో హర్భజన్ అద్భుతమైన బౌలింగ్‌తో పంజాబ్ జట్టు 8 వికెట్లతో జమ్మూకశ్మీర్‌ను ఓడించింది. తొలుత జమ్ము జట్టు 19.3 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటయింది. హర్భజన్ (4-0-8-3) ఆకట్టుకున్నాడు. పంజాబ్ 14.3 ఓవర్లలో రెండు వికెట్లకు 108 పరుగులు చేసి గెలిచింది. నాగ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 14 పరుగులతో హిమాచల్ ప్రదేశ్‌ను ఓడించింది. ఆశిష్ రెడ్డి (37) రాణించడంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 140 పరుగులు చేసింది. బదులుగా హిమాచల్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 126 పరుగులు మాత్రమే చేసింది.
ఇతర మ్యాచ్‌ల ఫలితాలు
⇒ బెంగాల్‌పై 69 పరుగులతో తమిళనాడు విజయం
⇒గోవాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన మధ్యప్రదేశ్
⇒విదర్భపై 60 పరుగులతో నెగ్గిన గుజరాత్
⇒ఒడిషాపై 32 పరుగులతో గెలిచిన ఉత్తరప్రదేశ్
⇒రైల్వేస్‌పై 9 పరుగుల తేడాతో గట్టెక్కిన బరోడా
⇒త్రిపురపై 9 వికెట్లతో జార్ఖండ్ ఘన విజయం.