ప్రిక్వార్టర్ ఫైనల్లో ఉత్తరప్రదేశ్ చేతిలో ఓటమి
యూపీని గెలిపించిన రింకూ సింగ్, విప్‌రాజ్
బెంగళూరు: దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు కథ ముగిసింది. లీగ్ దశలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్న ఆంధ్ర ఈ అడ్డంకిని అధిగమించడంలో విఫలమైంది. చిన్నస్వామి స్టేడియంలో ఉత్తరప్రదేశ్ జట్టుతో సోమవారం జరిగిన రెండో ప్రిక్వార్టర్ ఫైనల్లో రికీ భుయ్ నాయకత్వంలోని ఆంధ్ర జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
ఆంధ్ర జట్టు నిర్దేశించిన 157 పరుగుల విజయలక్ష్యాన్ని ఉత్తరప్రదేశ్ (యూపీ) జట్టు 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత స్టార్ రింకూ సింగ్ (22 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), విప్‌రాజ్ నిగమ్ (8 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి ఉత్తరప్రదేశ్ జట్టుకు విజయాన్ని అందించారు. ఒకదశలో ఉత్తరప్రదేశ్ జట్టు విజయానికి 24 బంతుల్లో 48 పరుగులు అవసరమయ్యాయి.
ఆంధ్ర మీడియం పేసర్ కేవీ శశికాంత్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో రింకూ, విప్‌రాజ్ 22 పరుగులు పిండుకోవడంతో ఫలితం యూపీ జట్టు వైపునకు మొగ్గింది. చివరి 3 ఓవర్లలో యూపీ విజయానికి 26 పరుగులు అవసరంకాగా... ఆ జట్టు 2 ఓవర్లలోనే 26 పరుగులు సాధించి విజయాన్ని ఖరారు చేసుకుంది. విప్‌రాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఆంధ్ర బౌలర్లలో కొడవండ్ల సుదర్శన్ 22 పరుగులిచ్చి 3 వికెట్లు, త్రిపురాన విజయ్ 21 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు. మరో వికెట్ సత్యనారాయణ రాజుకు దక్కింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు సాధించింది. ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్ (22 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు), కేవీ శశికాంత్ (8 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించారు.
శ్రీకర్ భరత్ (11 బంతుల్లో 4), అశ్విన్ హెబ్బర్ (11 బంతుల్లో 11; 1 ఫోర్, 1 సిక్స్), షేక్ రషీద్ (14 బంతుల్లో 18; 3 ఫోర్లు), పైలా అవినాశ్ (20 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్), రికీ భుయ్ (18 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు), త్రిపురాన విజయ్ (16 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్స్) క్రీజులో నిలదొక్కుకుంటున్న దశలో వెనుదిరిగారు.
ఉత్తరప్రదేశ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, విప్‌రాజ్ నిగమ్ 2 వికెట్ల చొప్పున తీయగా... మొహసిన్ ఖాన్, శివమ్ మావిలకు ఒక్కో వికెట్ లభించింది. అంతకుముందు జరిగిన తొలి ప్రిక్వార్టర్ ఫైనల్లో బెంగాల్ జట్టు మూడు పరుగుల తేడాతో చండీగఢ్‌పై గెలిచింది. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో మధ్యప్రదేశ్‌తో సౌరాష్ట్ర; బరోడాతో బెంగాల్; ముంబైతో విదర్భ; ఢిల్లీతో ఉత్తరప్రదేశ్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment