![Ind Vs SA: Prithvi Shaw Says I Am Scoring Runs But Not Getting Chance - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/8/prtivi%20shaw.jpg.webp?itok=KBwhVJ4h)
పృథ్వీ షా (PC: BCCI)
India Vs South Africa 2022 ODI Series- T20 Syed Mushtaq Ali Trophy: ‘‘నేను పరుగులు సాధించడంలో ఎప్పుడూ వెనుకపడలేదు. ఎంతో కష్టపడుతున్నాను. అయినా, నాకు భారత జట్టులో చోటు దక్కడం లేదు. పర్లేదు. నేను టీమిండియాలో ఆడేందుకు సన్నద్ధంగా ఉన్నానని సెలక్టర్లు ఎప్పుడు భావిస్తారో అప్పుడే నన్ను ఎంపిక చేస్తారు’’ అని టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా అన్నాడు.
దేశవాళీ టోర్నీల్లో గత కొంతకాలంగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ ఈ ముంబై బ్యాటర్‌కు జాతీయ జట్టులో చోటు దక్కడం లేదు. ఇటీవల ఐర్లాండ్, జింబాబ్వే పర్యటన సహా ప్రస్తుతం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ ఆడుతున్న జట్టులోనూ పృథ్వీ షాకు స్థానం దక్కలేదు.
సెలక్టర్లు నన్ను పట్టించుకోవడం లేదు
ఇక ప్రస్తుతం దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీకి సిద్ధమవుతున్న అతడు తాజాగా మిడ్ డేతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన పట్ల టీమిండియా సెలక్టర్లు వ్యవహరిస్తున్న తీరుపై స్పందించాడు. ‘‘ఇటీవలి కాలంలో నేను బాగానే పరుగులు రాబడుతున్నాను.
అయినా సరే నన్ను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోవడం లేదు. నిజానికి నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూనే ఉన్నాను. భారత ‘ఏ’ జట్టు లేదంటే దేశవాళీ క్రికెట్‌లోని జట్ల తరఫున ఆడుతున్నపుడైనా నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నా. ఫిట్‌నెస్ కాపాడుకుంటూ జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడుతున్నా. కానీ.. టీమిండియాలో మాత్రం చోటు దక్కడం లేదు’’ అని 22 ఏళ్ల పృథ్వీ షా ఆవేదన వ్యక్తం చేశాడు.
ఏడెనిమిది కిలోలు తగ్గాను
భారత జట్టులో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానన్న పృథ్వీ షా ఫిట్‌నెస్‌ను మరింత మెరుగుపరచుకునే పనిలో ఉన్నట్లు వెల్లడించాడు. ‘‘గత ఐపీఎల్ ముగిసిన తర్వాత బరువు తగ్గడంపై దృష్టి సారించాను. దాదాను ఏడెనిమిది కిలోలు తగ్గాను. జిమ్‌లో ఎక్కువసేపు వర్కౌట్లు చేస్తున్నా. రన్నింగ్ కూడా చేస్తున్నా.
స్వీట్లు, చైనీస్ ఫుడ్ దూరం పెట్టేశా
స్వీట్లు తినడం, కూల్‌డ్రింక్స్ తాగటం మానేశాను. ఇక ఇప్పుడు నా మెనూ నుంచి చైనీస్ ఫుడ్‌ను పూర్తిగా పక్కనపెట్టేశా. కచ్చితంగా టీమిండియాలో స్థానం సంపాదిస్తాననే నమ్మకం ఉంది. అందుకోసం ఆట పట్ల అంకితభావంతో ముందుకు సాగడమే నా పని’’ అని పృథ్వీ చెప్పుకొచ్చాడు.
కాగా ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలో వరుసగా రెండు సెంచరీలు కొట్టిన ఈ ముంబై బ్యాటర్.. న్యూజిలాండ్ ‘ఏ’ జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లో 44 బంతుల్లో 77 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇక 2018లో టెస్టు మ్యాచ్ ద్వారా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన అతడు.. మొదటి మ్యాచ్‌లోనే శతకం బాదాడు.
చివరిసారిగా 2020లో భారత్ తరఫున టెస్టు ఆడిన పృథ్వీ.. 2021లో శ్రీలంకతో ఆఖరిసారిగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాడు. ఇదిలా ఉంటే.. అక్టోబరు 11న ఆరంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం ప్రస్తుతం అతడు సన్నద్ధమవుతున్నాడు. అజింక్య రహానే సారథ్యంలో ముంబై జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు.
చదవండి: Ind Vs SA- WC 2023: వన్డే వరల్డ్‌కప్-2023కి మేము ‘అర్హత’ సాధించడం కష్టమని తెలుసు! అయినా..
Deepak Chahar: దీపక్ చహర్‌కు గాయం..!
Comments
Please login to add a commentAdd a comment