
సాక్షి, విశాఖపట్నం: దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ఆంధ్ర జట్టు ఓటమితో ముగించింది. ఆదివారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 5 వికెట్ల తేడాతో సర్వీసెస్ చేతిలో ఓడింది. దీంతో టోర్నీలో మూడు విజయాలు, మూడు ఓటములతో 12 పాయింట్లు సాధించిన ఆంధ్ర... తమ గ్రూప్‌లో నాలుగో స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. 27 పరుగులకే 3 వికెట్లు నష్టపోయి కష్టాల్లో ఉన్న జట్టును క్రాంతి కుమార్ (36 బంతుల్లో 43; 3 ఫోర్లు, సిక్స్), నరేన్ రెడ్డి (23 బంతుల్లో 43; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆదుకోవడంతో మెరుగైన స్కోరు సాధించింది. ఛేదనకు దిగిన సర్వీసెస్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది.
రాహుల్ సింగ్ (23 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. ఆంధ్ర బౌలర్ శశికాంత్ (3/32) రాణించాడు. చండీగఢ్ వేదికగా జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ 21 పరుగుల తేడాతో ఛత్తీస్‌గఢ్‌పై విజయం సాధించింది. తొలుత హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 174 పరుగులు సాధించగా... అనంతరం ఛత్తీస్‌గఢ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసి ఓడిపోయింది. తమ లీగ్ మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న హైదరాబాద్ 16 పాయింట్లతో ... పంజాబ్, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, రైల్వేస్‌లతో సమానంగా నిలిచింది. అయితే మెరుగైన రన్‌రేట్ లేకపోవడంతో సూపర్‌లీగ్ దశకు అర్హత సాధించలేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment