Sanju Samson: వన్డే ప్రపంచకప్-2023 జట్టులో చోటు ఆశించి భంగపడిన టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలో కేరళ జట్టును ముందుండి నడిపించనున్నాడు.
ఈ దేశవాళీ టీ20 టోర్నమెంట్లో సంజూకు రోహన్ కన్నుమ్మాళ్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. కాగా అక్టోబరు 16 నుంచి నవంబరు 6 వరకు ఈ ఈవెంట్ జరుగనుంది. ఇందులో భాగంగా గ్రూప్-బిలో ఉన్న కేరళ ముంబైలో హిమాచల్ ప్రదేశ్ జట్టుతో తొలి మ్యాచ్‌లో తలపడనుంది.
ఆసియా కప్-2023లో బ్యాకప్ ప్లేయర్‌గా
ఇక ఈ గ్రూపులో కేరళ, హిమాచల్ ప్రదేశ్‌తో పాటు సిక్కిం, అసోం, బిహార్, చండీగఢ్, ఒడిశా, సర్వీసెస్ టీమ్‌లు పోటీపడనున్నాయి. కాగా ఆసియా వన్డే కప్-2023లో సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు బ్యాకప్‌గా ఎంపికైన సంజూ శాంసన్.. రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్ జట్టు ఎంపిక సమయంలోనూ బీసీసీఐ సెలక్టర్లు సంజూను పక్కనపెట్టేశారు. 50 ఓవర్ల ఫార్మాట్లో మెరుగైన రికార్డు ఉన్న ఈ కేరళ వికెట్ కీపర్‌ను కాదని.. ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేశారు.
సూర్యకు పెద్దపీట.. మేనేజ్‌మెంట్ అండదండలు
వన్డేల్లో వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకున్న ఈ నంబర్ 1 టీ20 బ్యాటర్ కోసం సంజూను బలిచేశారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో సిరీస్‌లో వరుస అర్ధ శతకాలతో రాణించిన సూర్యకు మేనేజ్‌మెంట్ అండగా నిలిచింది.
ఈ నేపథ్యంలో ఆఖరి నిమిషం(సెప్టెంబరు 28వరకు జట్టులో మార్పులకు అవకాశం ఉన్న నేపథ్యంలో)లోనైనా అద్భుతం జరుగుతుందని ఆశించిన సంజూ శాంసన్ అభిమానులకు నిరాశే మిగిలింది. ఈ క్రమంలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీతో సంజూ తిరిగి మైదానంలో దిగనున్నాడు.
దేశవాళీ టీ20 జట్టు కెప్టెన్‌గా మరోసారి
ఇక ఈ టీ20 ఈవెంట్ కోసం కేరళ పద్దెనిమిది మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. గత నెలలో కర్ణాటక టీమ్ నుంచి వైదొలిగిన ఆల్‌రౌండర్ శ్రేయస్ గోపాల్ ఈసారి కేరళకు ఆడనున్నాడు. స్పిన్ దళానికి అతడు నాయకత్వం వహించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో కేరళ జట్టుకు ఈ సీజన్‌లో తమిళనాడు మాజీ క్రికెటర్ ఎం.వెంకటరమణ హెడ్‌కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీకి కేరళ జట్టు:
సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రోహన్ కన్నుమ్మాళ్ (వైస్ కెప్టెన్), శ్రేయస్ గోపాల్, జలజ్ సక్సేనా, సచిన్ బేబీ, మహ్మద్ అజారుద్దీన్, విష్ణు వినోద్, అబ్దుల్ బాసిత్, సిజోమోన్ జోసెఫ్, వైశాఖ్ చంద్రన్, బాసిల్ థంపి, కేఎం ఆసిఫ్, వినోద్ కుమార్, మను కృష్ణన్, వరుణ్ నయనార్, ఎం. అజ్నాస్, పీకే మిథున్, సల్మాన్ నిసార్.
చదవండి: WC 2023- Ind vs Pak: అతడి బ్యాటింగ్ అంతగొప్పగా ఏమీ ఉండదు.. షమీని ఆడించండి!
👉 సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి
Comments
Please login to add a commentAdd a comment